NTR- Vijayashanthi: ఇంటి కొచ్చి మరీ సారీ చెప్పారు.. ఎన్టీఆర్‌తో మధుర స్మృతులను గుర్తు చేసుకున్న రాములమ్మ
ప్రధాని మోడీ మొదలు నందమూరి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, సినిమా హీరోలు, అభిమానులు, నెటిజన్లు.. ఇలా ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుడిని మరోసారి స్మృతికి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ మొదలు నందమూరి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, సినిమా హీరోలు, అభిమానులు, నెటిజన్లు.. ఇలా ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుడిని మరోసారి స్మృతికి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో రాములమ్మ షేర్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యం శివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది. ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ చేతుల మీదుగానే అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నున్న అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్థానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ’
ఆ మరుసటి రోజే ఇంటికొచ్చారు..
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ ఏవీఎం స్టూడియోలో చెబుతున్నారు. అదే సమయంలో నేను చిరంజీవిగారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారిని డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లాను. అయితే డబ్బింగ్ థియేటర్ వెలుతురు లేని వాతావరణంలో ఎన్టీఆర్ నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చారు. అయితే నేను ఆ ఉదయమే ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను. అమ్మాయిని మేం చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుంది. అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ ‘జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, ‘I am extremely sorry ‘ అని చెప్పారు. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంత ప్రశంసించినా తక్కువే’
మరో వందేళ్లైనా..
‘ఇక ఎన్టీఆర్ మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించారు. అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు . ఆదరాభిమానాలకు మరో రూపు. ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు. 100 సంవత్సరాలైనా… మరో వంద సంవత్సరాలైనా… సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే. సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు విజయశాంతి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..