Venu Udugula: “ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ హీరో నా అప్పులన్నీ తీర్చేశారు”
దర్శకుడు వేణు ఊడుగుల నీది నాది ఒకే కథ చిత్ర నిర్మాణ ప్రస్థానాన్ని పంచుకున్నారు. శ్రీ విష్ణు ఇచ్చిన ఫైనాన్సియల్, మోరల్ సపోర్ట్.. ఓ నిర్మాత పెట్టిన తిప్పట, ఒక కమర్షియల్ రైటర్ తన కథ గురించి చేసిన కామెంట్స్ వివరించారు. చివరికి సినిమా విజయం సాధించగా, అదే రచయిత ప్రశంసించారని చెప్పుకొచ్చారు. కొత్త దర్శకులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన వివరించారు.

దర్శకుడు వేణు ఊడుగుల నీది నాది ఒకే కథ చిత్రం వెనుక ఉన్న భావోద్వేగ, సవాళ్లతో కూడిన ప్రయాణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ కథను నారా రోహిత్ కోసం మొదట అనుకున్నట్లు, తర్వాత శ్రీ విష్ణు దీన్ని ఒక సినిమాగా రూపొందించాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. శ్రీ విష్ణు కథను నమ్మి.. ఒక సంవత్సరం పాటు నిర్మాతలను వెతికే క్రమంలో వేణు ఊడుగులకు ఆర్థికంగా అండగా నిలిచారట. ప్రతి నెల జీతం రూపంలో, మెయింటెనెన్స్ కోసం రూ. 30,000 నుంచి 50,000 వరకు ఇచ్చేవారు. అంతేకాకుండా వేణుకు ఉన్న చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులను గమనించిన శ్రీ విష్ణు, ఒక రోజు అడిగి మరుసటి రోజు ఉదయాన్నే దాదాపు రూ. 3.5 నుంచి 4 లక్షల వరకు ఉన్న అప్పులన్నీ తీర్చేశారని, ఒకసారి బంగారు గొలుసు కూడా ఇచ్చారని వేణు గుర్తు చేసుకున్నారు.
శ్రీ విష్ణు కారణంగానే టెస్టారోసా వంటి కేఫ్‌లలో కూర్చుని కథా చర్చలు జరిపేవాడ్ని. నిర్మాతలను వెతికే ప్రయత్నంలో, ఒక నిర్మాత దాదాపు మూడు నెలల పాటు ఆశలు కల్పించి, చివరికి కథ నచ్చలేదని, సినిమా చేయలేనని చెప్పడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. నారా రోహిత్ ఆ నిర్మాతతో నేరుగా మాట్లాడి, నిర్ణయం చెప్పమని అడిగారు. అప్పుడు ఆ నిర్మాత.. కథను ఒక ప్రముఖ కమర్షియల్ రైటర్‌కు చెప్పాలని సూచించారు. వేణు ఆ రచయితను కలుసుకుని నీది నాది ఒకే కథ చెప్పగా, ఆ రచయిత “కథ బాగుంది, ఇది నవలకి పనికొస్తుంది కానీ సినిమాకు పనికిరాదు. నీ కెరీర్‌కు కూడా మంచిది కాదు” అని రిజెక్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో వేణు ఊడుగుల గుండె పగిలిపోయినంత పని అయిందని తెలిపారు. ఈ రిజెక్షన్, నిరాశ తర్వాత, నారా రోహిత్ వేణు ఊడుగులకు అండగా నిలిచారు. “వాళ్లు చేసినవి అన్నీ హిట్లు ఏమీ కాదు. నువ్వు మా ఇంటికి వచ్చేయ్” అని రోహిత్ ధైర్యం చెప్పారు.
రెగ్యులర్ నిర్మాతలు ఇలాంటి కథలను ఒప్పుకోరని అర్థం చేసుకున్న రోహిత్, శ్రీ విష్ణుతో కలిసి తామే ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. సుమారు రూ. 1.5 కోట్లు అవుతుందని అంచనా వేసిన ఈ సినిమాను కేవలం 80 లక్షల బడ్జెట్‌తో విజయవంతంగా పూర్తి చేశారు. నీది నాది ఒకే కథ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా విజయం సాధించిన రోజు, గతంలో కథను తిరస్కరించిన అదే రచయిత శ్రీ విష్ణుకు ఫోన్ చేసి, సినిమా అద్భుతంగా ఉందని, దర్శకుడు చాలా నిజాయితీగా తీశారని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్యూర్ సినిమాలు చేయాలని ప్రశంసించారు. పక్కనే ఉన్న వేణు ఊడుగుల ఈ విషయాన్ని గుర్తు చేయగా, రచయిత “అప్పుడు అలా లేదు కదా” అని సమాధానం ఇచ్చారని వేణు తెలిపారు. ఇది ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొత్త దర్శకులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తుందని, అప్పటి వేణు ఊడుగుల, ఇప్పటి వేణు ఊడుగుల ఒక్కరే అయినా, మారని మనసులు, పద్ధతులు ఇంకా పరిశ్రమలో ఉన్నాయని వేణు ఊడుగుల ఆవేదన వ్యక్తం చేశారు.




