Upendra Gadi Adda Movie Review: ఉపేంద్ర గాడి అడ్డా సినిమా ఎలా ఉందంటే..
ఈ రోజుల్లో చిన్న సినిమాలే కొన్నిసార్లు మంచి కథలతో వస్తుంటాయి. కాకపోతే స్టార్ క్యాస్ట్ లేక అలాంటి సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు ఐడియా ఉండదు. అలాంటి మంచి కథతోనే మేము కూడా వస్తున్నామంటున్నారు ఉపేంద్ర గాడి అడ్డా దర్శక నిర్మాతలు. మరి వాళ్లు చెప్తున్నంత మంచి సందేశం ఈ సినిమాలో ఉందా.. అసలు ఉపేంద్ర గాడి అడ్డా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ఉపేంద్ర గాడి అడ్డా
నటీనటులు: కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, మురళీధర్ గౌడ్, అప్పారావు, కిరీటి దామరాజు, సంధ్య జనక్ తదితరులు
సంగీతం: రాము అద్దంకీ
సినిమాటోగ్రఫీ: రవీందర్ సన్
నిర్మాత: కంచర్ల అచ్యుతరావు
దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్. కె
ఈ రోజుల్లో చిన్న సినిమాలే కొన్నిసార్లు మంచి కథలతో వస్తుంటాయి. కాకపోతే స్టార్ క్యాస్ట్ లేక అలాంటి సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు ఐడియా ఉండదు. అలాంటి మంచి కథతోనే మేము కూడా వస్తున్నామంటున్నారు ఉపేంద్ర గాడి అడ్డా దర్శక నిర్మాతలు. మరి వాళ్లు చెప్తున్నంత మంచి సందేశం ఈ సినిమాలో ఉందా.. అసలు ఉపేంద్ర గాడి అడ్డా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ఉపేంద్ర (కంచర్ల ఉపేంద్ర) పక్కా బంజారా హిల్స్ బస్తీ కుర్రాడు. డిగ్రీ పట్టా చేతుల్లో ఉన్నా.. అతడి ఆలోచనలు మాత్రం ఈజీ మనీ వైపు వెళ్లాలనుకుంటాడు. డబ్బు కోసం పెద్దింటి అమ్మాయిని పడేయాలని ప్లాన్ చేస్తుంటాడు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సెటిల్ అయిపోతుందని భావిస్తుంటాడు. అందుకే ఆవారాగా తిరుగుతూ.. అప్పులు చేసి పబ్బుల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే సావిత్రి (సావిత్రి కృష్ణ)తో పరిచయం అవుతుంది. ఆమె డబ్బున్న అమ్మాయి అనుకుని.. తాను కూడా డబ్బున్న అబ్బాయి అని ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది.. కానీ ప్రేమలో నిజాయితీ కోసం తాను రిచ్ కిడ్ కాదని.. బంజారా హిల్స్ కిడ్ అని చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది.. ఆ బస్తీ కుర్రాడి వైపు సావిత్రి మళ్లీ చూసిందా.. తన ప్రేమలో ఉపేంద్రకు ఎదురైన కష్టాలేంటి అనేది అసలు కథ..
కథనం:
ఈ రోజుల్లో ఇండస్ట్రీకి సొంతంగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే.. కమర్షియల్ కథలను మించిన ఆప్షన్ మరోటి లేదు. రొటీన్‌గానే ఉంటాయి కానీ క్లిక్ అయితే మాత్రం కచ్చితంగా ఇమేజ్ వస్తుందని కలలు కంటుంటారు కొత్త హీరోలు. ఇప్పుడు ఉపేంద్ర కూడా ఇదే చేసాడు. తన తొలి సినిమా కోసం పక్కా కమర్షియల్ అంశాలున్న కథను ఎంచుకున్నాడు. పైగా సోషల్ మీడియా ప్రస్తుత సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. ఎంతగా ఎఫెక్ట్ పడుతుందనే విషయాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు ఆర్యన్ సుభాన్. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనేది చూపించాడు. ముందు వెనక చూడకుండా సోషల్ మీడియాను నమ్ముకుని అమ్మాయిలు ఎంత ఈజీగా అబ్బాయిల మాయలో పడిపోతున్నారు.. వాళ్లు ఎలా చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారనేది ఫస్టాఫ్‌లో చూపించే ప్రయత్నమైతే చేసాడు. ఆ తర్వాత అనర్థాలను సెకండాఫ్‌లో చూపించాడు. నేటి సమాజంలో సెల్ ఫోన్ ప్రభావం పిల్లలపై ఎంత ఉంది.. వాళ్ల జీవితాలను ఎలా నాశనం చేస్తుందనేది కూడా ఇందులో చూపించారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది హైలైట్ చేసాడు. ఉమెన్ ట్రాఫికింగ్ సీన్ కూడా ఇందులో ఉంది. సినిమా మొదట్లో రొటీన్‌గానే ఉన్నా.. ఆ తర్వాత సందేశాత్మక కథగా మారిపోతుంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు పర్లేదు. ఇక సెకండాఫ్‌లో కథ స్లోగా సాగుతుంది. మంచి సందేశం ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు కానీ సగం వరకే సక్సెస్ అయ్యాడు.
నటీనటులు:
కంచర్ల ఉపేంద్ర స్క్రీన్ మీద పర్లేదు.. కొత్త నటుడైనా కూడా మంచి నటన కనబరిచాడు. డాన్సులు, ఫైట్లు బాగానే చేసాడు. డైలాగ్ డెలవరీ ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకావాలి.. బస్తీ కుర్రాడిలాగే కాకుండా డబ్బున్న అబ్బాయిగా రెండు రోల్స్‌లోనూ సెట్ అయ్యాడు. అలాగే డబ్బున్న కుర్రాడిగానూ బాగానే మేనేజ్ చేసాడు. సావిత్రి కృష్ణ పర్లేదు.. ఆమె కూడా స్క్రీన్ మీద చక్కగా ఒదిగిపోయింది. హీరో చుట్టూ స్నేహితులుగా ఉండే జబర్దస్థ్ బ్యాచ్ నవ్వించారు. జబర్దస్థ్ కమెడియన్ అప్పారావు ఉన్నది కాసేపే అయినా నవ్వించాడు. బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్, నటి ప్రభావతి హీరో తల్లిదండ్రులుగా ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లందరూ ఓకే..
టెక్నికల్ టీం:
చిన్న సినిమాలకు సంగీతం ప్రధానమైన బలం. ఉపేంద్ర గాడి అడ్డాకు రాము అద్దంకీ ఇచ్చిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాటల వరకు ఎలా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ రిచ్‌గానే ఉంది. కొన్ని ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే సెకండాఫ్ కాస్త వీక్. అయితే డైరెక్టర్ ఏం చెప్తే అదే ఫైనల్ కాబట్టి ఎడిటర్‌ను తప్పు పట్టలేం. కొత్త హీరో అయినా నిర్మాణ విలువలు పర్లేదు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ సోషల్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి.. రిస్క్ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడిగా కొంత మేర సక్సెస్ అయ్యాడు.
పంచ్ లైన్:
ఉపేంద్ర గాడి అడ్డా.. కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్..




