AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calling Sahasra Review: కాలింగ్ సహస్ర మూవీ రివ్యూ.. సుదీర్ సినిమా ఎలా ఉందంటే

జబర్దస్త్ కామెడీతో షోతో కమెడియన్‌గా పరిచయమైన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత టీవీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలు కూడా చేసారు. ఈ మధ్యే హీరోగా మారి వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈయన నటించిన కాలింగ్ సహస్ర ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Calling Sahasra Review: కాలింగ్ సహస్ర మూవీ రివ్యూ.. సుదీర్ సినిమా ఎలా ఉందంటే
Calling Sahasra
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 01, 2023 | 6:58 PM

మూవీ రివ్యూ: కాలింగ్ సహస్ర

నటీనటులు: సుడిగాలి సుధీర్, డాలి షా, స్పందన, శివబాలాజీ, సుభాష్, రవిప్రకాశ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సన్నీ దోమల

సంగీతం: మోహిత్ రెహమానిక్

ఎడిటర్: గ్యారీ బిహెచ్

నిర్మాతలు: వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తాయల్, చిరంజీవి పామిడి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అరుణ్ విక్కిరాలా

జబర్దస్త్ కామెడీతో షోతో కమెడియన్‌గా పరిచయమైన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత టీవీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలు కూడా చేసారు. ఈ మధ్యే హీరోగా మారి వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈయన నటించిన కాలింగ్ సహస్ర ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) ఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత ఓ కొత్త సిమ్ తీసుకుంటాడు. ఆ సిమ్ తీసుకున్న రోజు నుంచి అతడికి అనుకోని కాల్స్ వస్తూనే ఉంటాయి. అతని ఫోన్ నుంచి అతనికే మెసేజ్‌లు రావడం మొదలవుతాయి. ఆ మెసేజెస్ ఏంటి.. ఎక్కడ్నుంచి వస్తున్నాయి.. దాని కథేంటో తెలుసుకోవాలని వెళ్లి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. తన ఫోన్ నుంచి తనకే మెసేజ్‌లు ఎలా వస్తున్నాయి.. అజయ్‌తో పాటు అతని తమ్ముడు సత్య (రవితేజ నన్నిమాల), అదే ఇంట్లో పేయింగ్ గెస్ట్ అయిన స్వాతి (డాలీ షా) ఈ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నారు.. అసలు ఈ కేసు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ..

కథనం:

ఈ రోజుల్లో కొత్త కథలు అంటూ ఏమీ ఉండవు. ఉన్న కథలను మనం ఎంత కొత్తగా చెప్తున్నాం అనేది మాత్రమే ముఖ్యం. అరుణ్ విక్కిరాలా కూడా ఇదే చేయాలని చూసాడు. అయితే తన ఫోన్ నుంచి తనకే మెసేజ్‌లు, ఫోన్ రావడం అనేది మాత్రం కొత్త పాయింట్. దాన్ని బాగా యూజ్ చేసుకోవాలని చూసాడు దర్శకుడు. ఫస్టాఫ్ వరకు పాయింట్ ఎక్కడా రివీల్ చేయకుండా కథను ముందుకు నడిపించాడు. కాలింగ్ సహస్ర అనే టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకున్నారు.. అన్నింటికీ మించి సుడిగాలి సుధీర్ హీరో అనగానే కొంతైనా క్రేజ్ వచ్చింది ఈ సినిమాకు. కానీ దర్శకుడు అరుణ్ చెప్పినట్లు ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీదే ఇలాంటి కథ రాలేదంటే మాత్రం ఓవర్ కాన్పిడెన్సే అవుతుంది. పాయింట్ కాస్త కొత్తగా అనిపించినా.. రొటీన్ కథే ఇది. ఇదే లైన్‌తో ఇదివరకు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. తనతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి జీవితంలోనికి ఓ వస్తువు నుంచి ఆత్మ ప్రవేశించడం.. అతడి ప్రమేయం లేకుండానే పగ తీర్చుకోవడం.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయడం అనేది గతంలోనూ లారెన్స్ ముని తరహా సినిమాల్లోనూ చూసాం. ఇక్కడా అదే ఫార్ములా అప్లై చేసాడు దర్శకుడు అరుణ్. సుడిగాలి సుధీర్ ఉన్నాడు కాబట్టి అతడిని అభిమానించే వాళ్ల కోసం అక్కడక్కడా ఫైట్స్ పెట్టారు. కానీ సుధీర్ అంటే కామెడీకి పెట్టింది పేరు. అయితే ఇందులో అలాంటదేం ఉండదు. రొటీన్ స్టోరీ తీసుకున్నా స్క్రీన్ ప్లే పర్లేదు. ఆత్మతో సంబంధం ఉన్న కథ కావడంతో కాస్త హారర్ ఎలిమెంట్స్ ఉండుంటే బాగుండేది కానీ దర్శకుడు ఫ్లాట్ నెరేషన్ ఎంచుకున్నాడు. ఫస్టాఫ్ కేవలం కారెక్టర్ ఇంట్రో కోసమే తీసుకున్న దర్శకుడు.. సెకండాఫ్‌లో కథ అంతా చెప్పాడు. ఇంటర్వెల్‌కు ముందు హీరో అండ్ గ్యాంగ్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో ఆసక్తి పెరుగుతుంది.. ఆ తర్వాత కథ అంతా రివీల్ అవుతూ వస్తుంది.

నటీనటులు:

సుడిగాలి సుధీర్‌ను కేవలం కమెడియన్‌గా మాత్రమే చూసిన వాళ్లకు ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. అజయ్ శ్రీవాత్సవ పాత్రలో బాగా నటించాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ బాగా అయ్యాడు సుడిగాలి సుధీర్. హీరోయిన్స్ స్పందన, డాలి షా పర్లేదు. ఇక సుధీర్ తమ్ముడు పాత్రలో రవితేజ నన్నిమాల ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత శివబాలాజీకి కాప్త పెద్ద పాత్ర పడింది. సుభాష్, రవి ప్రకాష్ అంతా ఓకే..

టెక్నికల్ టీం:

మోహిత్ రెహమానిక్ అందించిన పాటలు పర్లేదు. కానీ మార్క్ కే రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే.. సీన్స్ ఎలివేషన్‌కు బాగానే యూజ్ అయింది. ఎడిటింగ్ ఇంకాస్త వేగంగా ఉండాల్సింది. ఫస్టాఫ్ స్లోగా వెళ్లింది. కాకపోతే డైరెక్టర్ కట్ కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టలేం. సుధీర్ ఉన్నాడనే ధైర్యంతో నిర్మాతలు బాగానే ఖర్చు చేసారు. దర్శకుడిగా అరుణ్ విక్కిరాలా మరింత శ్రమించాల్సింది. ఉన్నంతలో ఓకే అనిపించాడు కానీ ఇంకా చాలా మంచి ఔట్ పుట్ ఇచ్చే సబ్జెక్ట్ ఇది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా కాలింగ్ సహస్ర.. జస్ట్ ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్..