Taraka Ratna: ఒకటో నెంబర్ కుర్రాడు వెళ్ళిపోయాడు.. బరువెక్కిన గుండెలతో తారకరత్నకు తుది వీడ్కోలు పలికిన కుటుంబసభ్యులు, అభిమానులు

నందమూరి కుటుంబ సభ్యుల గుండెలు బరువెక్కాయి. ఎవరి కళ్లలో చూసినా నీళ్లు. పంటిబిగువునే ఆపుకున్న వెక్కిళ్లు. జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు కుటుంబ సభ్యుల్లో విషాదం గూడుకట్టుకుంది.

Taraka Ratna: ఒకటో నెంబర్ కుర్రాడు వెళ్ళిపోయాడు.. బరువెక్కిన గుండెలతో తారకరత్నకు తుది వీడ్కోలు పలికిన కుటుంబసభ్యులు, అభిమానులు
Taraka Ratna
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 20, 2023 | 5:39 PM

ఒకటో నెంబర్ కుర్రాడు వెళ్ళిపోయాడు. నందమూరి తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య తారకరత్నకు వీడ్కోలు పలికారు కుటుంబసభ్యులు, అభిమానులు. తారకరత్న అంత్యక్రియల సందర్భంగా మహాప్రస్థానంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. నందమూరి కుటుంబ సభ్యుల గుండెలు బరువెక్కాయి. ఎవరి కళ్లలో చూసినా నీళ్లు. పంటిబిగువునే ఆపుకున్న వెక్కిళ్లు. జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు కుటుంబ సభ్యుల్లో విషాదం గూడుకట్టుకుంది. నారా లోకేష్‌తోపాటు కొందరు తెలుగుదేశం ముఖ్యనేతలు కూడా మహాప్రస్థానానికి వెళ్లారు. అందర్లోనూ అంతులేని విషాదం. కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల అశృనయనాల మధ్య తారకరత్న అంతిమయాత్ర ఫిల్మ్‌చాంబర్‌ నుంచి మహాప్రస్థానానికి చేరుకుంది. బాలయ్యతోపాటు కుటుంబ సభ్యులు పాడెమోశారు. చంద్రబాబు కూడా అంతిమయాత్ర సాగుతున్న వాహనంలోనే వెళ్లారు. విజయసాయిరెడ్డి కూడా తారకరత్న అంతిమసంస్కారాల్లో పాల్గొన్నారు. అంతిమయాత్ర మహాప్రస్థానం చేరాక.. నందమూరి కుటుంబసభ్యులంతా నివాళులు అర్పించారు.

ఉదయం మోకిలాలోని నివాసం నుంచి చాంబర్‌కు భౌతికకాయాన్ని తరలించేప్పుడు పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్ని తారకరత్న కుమారుడి ద్వారా చేయించారు. చాంబర్‌ నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నప్పుడు మిగతా కార్యక్రమాల్ని ఆయన తండ్రి మోహనకృష్ణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.అబ్బాయ్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బాబాయ్‌ బాలయ్యలో తారకరత్న ఇక లేడనే బాధ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మొహం చిన్నపోయింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న క్షేమంగా బయటపతాడని బలంగా నమ్మినా విధిని తప్పించలేకపోయామనే బాధ కుటుంబసభ్యుల్లో కనిపిస్తోంది.. బాలకృష్ణతోపాటు కుటుంబ సభ్యులంతా పాడెమోశారు.

ఒకటో నంబర్‌ కుర్రాడు.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. తారకరత్న వ్యక్త్విత్వం తెలిసినవాళ్లు అతని గురించి చెప్పే మాట ఇది. అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ, కలుపుగోలుగా ఉంటూ తిరిగే వ్యక్తి ఇవాళ తమ మధ్య లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులంతా ఇవాళ చాంబర్‌కు తరలివచ్చి నివాళులు అర్పించారు. తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురైతే ప్రతినాయకుడిగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలోనే ఇలా అకాలమరణం చెందడం అందరి హృదయాల్నీ కలచివేస్తోంది.