Tollywood: టాలీవుడ్‌కు కొత్త గ్లామర్.. వారసుల టైమ్ షురూ..!
సినిమా అంటే వారసులకు అద్భుతమైన వేదిక. అందమైన అవకాశాన్ని వినియోగించుకుంటే..వాళ్లందరూ అందలానికి ఎక్కడం ఎంతో తేలిక. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో వెలుగుతున్నారు కొందరు నటులు తండ్రులు వేసిన బాటలో నడుస్తూ, వారిని తలెత్తుకునేలా చేస్తున్నారు..! భవిష్యత్తుల్లో వీరి పేరును నిలబెట్టడానికి... నవ వారసులు సిద్ధమేనా?
సినిమా అంటే వారసులకు అద్భుతమైన వేదిక. అందమైన అవకాశాన్ని వినియోగించుకుంటే..వాళ్లందరూ అందలానికి ఎక్కడం ఎంతో తేలిక. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో వెలుగుతున్నారు కొందరు నటులు తండ్రులు వేసిన బాటలో నడుస్తూ, వారిని తలెత్తుకునేలా చేస్తున్నారు..! భవిష్యత్తుల్లో వీరి పేరును నిలబెట్టడానికి… నవ వారసులు సిద్ధమేనా? ఇంటిపేరును నిలబెట్టి, సొంతంగా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి వారు తయారుగున్నారా? వందేళ్ల సినిమా చరిత్రను ఘనకీర్తితో ముందుకు సాగించగల సత్తా వాళ్లలో ఉందా? ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ… అంటూ రంగంలోకి దిగడానికి రెడీ అంటున్నారు వారసులు. వాళ్లకున్న సత్తా ఏంటి? వాళ్ల మీదున్న బరువు బాధ్యతలు ఎలాంటివి? అభిమానులు ఇష్టంగా మాట్లాడుకునే ట్రెండింగ్ టాపిక్ ఇది.
అకీరా… డిప్యూటీ సీఎం తాలూకు!
మెగా ఫ్యామిలీ నుంచి వారసుడు సిద్ధమవుతున్నాడు… జూనియర్ పవర్ స్టార్, పవర్ ప్రిన్స్ అకీరాని దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాసుకుంటే బాక్సాఫీస్ దగ్గర భలేగా వర్కవుట్ అవుతాయనే మాట గట్టిగానే వినిపిస్తోంది సినిమా పరిశ్రమలో. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేళ… ఆ గెలుపు గురించి ఎందరు మాట్లాడుకున్నారో, పవర్‌స్టార్ వెంట నడిచిన తనయుడు అకీరా నందన్ గురించి కూడా అంతేమంది మాట్లాడుకున్నారు.
పవర్‌స్టార్ వారసుడు సిద్ధమవుతున్నాడు. అద్భుతమైన కథలు అల్లుకుంటే, కుర్రాడు భలేగా సెట్ అవుతాడనే మాటలు మళ్లీ మళ్లీ వినిపించాయి. 18 ఏళ్లు నిండకుండా హీరోలుగా ప్రూవ్ చేసుకున్నవారి గురించి జోరుగా ప్రస్తావన వచ్చింది. అయితే అకీరా మేకప్ వేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడా? లేదా? అనేది అందరికీ ఉన్న అనుమానం. అకీరాకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదు అంటూ కొన్నేళ్ల క్రితం వైరల్ అయిన మాటలను మరికొందరు గుర్తుచేసుకుంటున్నారు. అయితే, పవన్‌కల్యాణ్ గెలిచిన సందర్భంలో అకీరానందన్ ఎడిట్ చేసిన వీడియో… అతనికి సినిమాల మీద ఉన్న ఆసక్తిని చెప్పకనే చెప్పింది.
మంచి పొడగరి. హావభావాలను చక్కగా పలికించగల సమర్థుడు. కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు.. స్క్రీన్ మీద కటౌట్ అదిరిపోతుందని అంటున్నారు అనుభవజ్ఞులు. ‘జస్ట్ మేకప్ వేసి కెమెరా ముందు నిలుచోబెట్టండి.. మిగిలింది మేం చూసుకుంటాం’ అనే భరోసా మెగా పవర్ ఫ్యాన్ సర్కిల్స్ నుంచి ఎప్పుడూ కనిపిస్తోంది. మరి అకీరా నందన్ మనసులో ఆలోచనలు ఆ దశగానే సాగుతున్నాయా? ఫాస్ట్ బీట్లకు తగ్గట్టు స్టెప్పులేయడానికి, రోప్‌లు కట్టుకుని డిష్యుమ్ డిష్యుమ్ చేయడానికి సిద్ధమేనా?
ఓ వైపు పవన్ కల్యాణ్ సినిమాల సంఖ్య తగ్గించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎనీ టైమ్ సినిమా చేసినా, వందల కోట్ల బిజినెస్ చేయగలిగే స్టార్ సైడిచ్చినప్పుడు, ఆ గ్యాప్‌ని వాడుకుని అర్జంటుగా ఎదిగేయగల పరిస్థితులు అకీరాకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. మరి జూనియర్ పవన్ అందుకు సిద్ధమవుతున్నారా? తనను తాను సమాయత్తం చేసుకుంటున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అకీరా వైర్లున్న ఇయర్‌ఫోన్స్ వాడుతున్నాడని, అకీరాకు ఫలానా విషయం అంటే ఇష్టమని తరచూ ఏదో ఒక విషయం చెప్పే ఆయన తల్లి… ఈ గుడ్‌న్యూస్‌ని ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటారా? అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
బాబు రెడీ… అనే మాట వినిపిస్తే చాలు… వేడివేడిగా కథలు సిద్ధమవుతాయి.. ముందుండి మార్గదర్శకత్వం చేయడానికి మెగాస్టార్ అడుగేస్తారు. సోదరులు, కజిన్స్ అందరూ అండగా నిలబడతారు. సినిమా ఇండస్ట్రీలో జూనియర్ నిలదొక్కుకున్నాడనే మాట వినిపించేవరకు సపోర్ట్ చేయడానికి అభిమాన సైన్యం ఎలాగూ ఉంది… మరెందుకు ఆలస్యం… ఆ మంచి మాట వినే ముహూర్తం మరెంతో దూరంలో లేదని చెప్పండి… అంటూ చెవులు చాటంత చేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు…
నందమూరి అందగాడు… మోక్షజ్ఞ
అర్ధశతాబ్దం క్రితం నందమూరి బాలకృష్ణను తెలుగు తెరమీద పరిచయం చేశారు నందమూరి తారక రామారావు. భానుమతికి బాలకృష్ణను పరిచయం చేసే ఆ సన్నివేశం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంది. ‘తాతమ్మకల’లో చలాకీగా నడిచొచ్చిన బాలయ్యలో ఆ చురుకుదనం ఇప్పటికీ అలాగే తొణికిసలాడుతోందని అంటారు అభిమానులు. అప్పుడు నందమూరి తారక రామారావు చేసిన పరిచయం లాగానే, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా తనయుడిని పరిచయం చేయనున్నారు. నందమూరి నవ అందగాడు మోక్షజ్ఞను పరిచయం చేయడానికి సర్వం సిద్ధమైంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరింది. ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞతో పాటు, నందమూరి బాలకృష్ణ కూడా నటిస్తున్నారన్నది అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్న విషయం. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే జరగాల్సింది. ఆదిత్య 999తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇదివరకే కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు బాలయ్య. డైరక్టర్‌గా బోయపాటి, వైవీయస్ చౌదరి, క్రిష్, నందమూరి బాలకృష్ణ పేర్లు వార్తల్లో వినిపించాయి. ఒకానొక సందర్భంలో బోయపాటి ఫిక్స్ అని అనుకున్నారంతా.
కానీ, అనూహ్యంగా సీన్‌లోకి వచ్చేశారు ప్రశాంత్ వర్మ. ట్రెండ్‌లో ఉన్న డైరక్టర్, కుర్రకారుకు దగ్గరైన డైరక్టర్ అని మాత్రమే కాదు, ఇద్దరు హీరోలను ఎలివేట్ చేసే అద్భుతమైన కథ చెప్పిన డైరక్టర్ అని ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట గాడ్ ఆఫ్ మాసెస్ మిస్టర్ నందమూరి బాలకృష్ణ. మోక్షజ్ఞకు కూడా ఎప్పటి నుంచో సినిమాలు చేయాలనే కోరిక ఉంది. మాస్ హీరోకి ఉండాల్సిన కటౌట్ కోసం కష్టపడి మేకోవర్ అయ్యారు. స్పెషల్‌గా యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నారు. నిత్యం తండ్రి పర్యవేక్షణలో ఉచ్ఛారణ విషయంలోనూ ఆనుపానులు తెలుసుకున్నారు.
ఆ మధ్య ‘భగవంత్ కేసరి’ వేడుకలో శ్రీలీల గురించి ప్రస్తవిస్తూ, యంగ్ హీరోయిన్లతో తాను ఆడిపాడుతానని మోక్షజ్ఞ అన్నట్టు… బాలయ్య చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో ఊపు పెంచాయి. పర్ఫెక్ట్ మాస్ హీరో రెడీ అవుతున్నారని ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లయింది… 2024లో నందమూరి నయా హీరోల ఎంట్రీలకు ముహూర్తాలు బలంగా కుదిరాయని పొంగిపోతున్నారు ఫ్యాన్స్.
సన్నాఫ్ నందమూరి జానకిరామ్..!
నందమూరి నాలుగోతరాన్ని పరిచయం చేస్తున్నారు వైవీయస్ చౌదరి. హరికృష్ణను సోలో హీరోగా పరిచయం చేసిన వైవీయస్ చౌదరి, ఇప్పుడు… హరికృష్ణ మనవడు, జానకిరామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును ప్రపంచానికి పరిచయం చేయడానికి నడుం బిగించారు. ‘అతనొక్కడే’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాల్లో నటించిన అనుభవం ఉంది నందమూరి తారకరామారావుకి. కుటుంబసభ్యులు అందరి అండదండలున్నాయి. అయితే అన్నిటికి మించి, తన తండ్రి కన్న కలను సాకారం చేయాలనే పట్టుదల ఉంది. తాను పుట్టినప్పుడు ఏ కల కంటూ తన తండ్రి తారకరామారావు అని పేరు పెట్టారో, దాన్ని ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా కృషి చేస్తున్నారు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ విషయాన్ని గురించి వైవీయస్ చౌదరి మాట్లాడుతూ ”కలను సాకారం చేసుకోవాలంటే మంచి ఆహార్యం, ముఖ కవళికలు రావాలి. సరైన ప్రాజెక్ట్ ద్వారా ఓ డైరక్టర్ ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి. నందమూరి తారక రామారావు విషయంలో అదే జరిగింది. ఆ కుర్రాడిలో తపన ఉంది. మంచి లక్షణాలున్నాయి. పెద్ద కళ్లు, కనుబొమ్మలున్నాయి. మంచి దేహదారుఢ్యం ఉంది. ఇంకొన్ని ఏళ్ల పాటు నందమూరి కుటుంబం పేరును అభిమానుల గుండెల్లో కొనసాగించడానికి అతని రూపాన్ని ప్రకృతి శాసిస్తోందని అనిపించింది నాకు. తను సమయపాలన పాటిస్తున్నాడు. అంకిత భావం ఉంది. జానకిరామ్ కన్న కల ఇతనిలో సజీవంగా ఉంది. అతన్ని కొన్నేళ్లుగా దగ్గరి నుంచి గమనిస్తున్న తుమ్మల ప్రసన్నకుమార్‌గారు నన్ను అతనివైపు నడిపించారు. మంచి కథతో రాబోతున్నాం. హరికృష్ణగారిని సోలో హీరో చేశాను. ఇప్పుడు ఆయన మనవడిని, నందమూరి ఫ్యామిలీ నాలుగో తరాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.
ఘట్టమనేని వారసులు సిద్ధం!
నేను సినిమా స్టార్‌ని అయి తీరుతానని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అడిగినా తడుముకోకుండా చెప్పేస్తారు సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని. మరి గౌతమ్ సంగతేంటి? ఆయనకు కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయా? అంటే, ‘ఎందుకు లేవూ… గౌతమ్‌ని చూస్తేనే అర్థం కావడం లేదా, తను దేనికోసం ప్రిపేర్ అవుతున్నాడో…’ అంటూ ముక్తకంఠంతో సమాధానమిచ్చేస్తున్నారు సూపర్‌స్టార్ అభిమానులు. గౌతమ్‌కి ఇప్పుడే ఫ్యాన్ బేస్ భలేగా ఉంది.
‘ఒన్ నేనొక్కడి’నే సమయంలోనే ‘ఫ్యూచర్ హీరో రెడీ అవుతున్నాడు’ అంటూ సెట్లో అందరూ గౌతమ్‌ని గౌరవంగా చూసేవారట. అందుకు కారణం అతను మహేష్‌బాబు కొడుకు అనేది మాత్రమే కాదు… నటన పట్ల అతనికున్న డెడికేషన్! తాను చేయబోయే సన్నివేశాలకు సంబంధించిన కాగితాలను ముందుగానే తీసుకుని ప్రిపేర్ అయ్యేవాడు. సెట్లో సన్నివేశాలు బాగా వచ్చేవరకు ఎన్ని టేకులైనా చేస్తానంటూ సుకుమార్‌తో చెప్పేవాడు. టేక్ ఓకే అని సుకుమార్ చెప్పినా సరే, మానిటర్‌లో చూసుకుని బాగా వచ్చిందని భావించాకే విశ్రమించేవాడు. ‘డబ్బింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పండి… నేనే వచ్చి చెబుతాను. నా నటనకు ఇంకెవరితోనో డబ్బింగ్ చెప్పించకండి’ అంటూ తన పాత్ర పట్ల గౌతమ్ చూపించిన అంకితభావాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేనని చాలా సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు సుకుమార్.
ఇటీవల విదేశాల్లో చదువు పూర్తి చేశాడు గౌతమ్. మరోవైపు ఫిజిక్‌ని కూడా పర్ఫెక్ట్ గా మెయింటెయిన్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ టైమ్ చూసుకుని హీరోగా ఎంట్రీ చేసేస్తారనే టాక్ గట్టిగానే వైరల్ అవుతోంది. తండ్రి ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఎదుగుతున్నారు… ఘట్టమనేని ప్రిన్స్ పరిచయవేదికకు వేళాయే… అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
మరో ఘట్టమనేని ఫ్యామిలీ హీరో
గౌతమ్ హీరోగా పరిచయం కావడానికి ముందే సినిమా ఇండస్ట్రీకి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఘట్టమనేని రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరో మెటీరియల్ అనే డిస్కషన్ సడన్‌గా వినిపిస్తోంది టాలీవుడ్‌లో. అందుకు కారణం, రీసెంట్‌గా రిలీజ్ అయిన ఫొటోలే. లేటెస్ట్ ఫొటో షూట్‌లో మ్యాన్లీ లుక్స్ తో మెప్పిస్తున్నారు జయకృష్ణ. పర్ఫెక్ట్ ప్రొడక్షన్ హౌస్, కేపబుల్ కెప్టెన్ కుదరాలేగానీ, ఇమీడియేట్‌గా టాలీవుడ్‌కి మరో టాలెంటెడ్ హీరో దొరికినట్టే అంటున్నారు క్రిటిక్స్.
అర్జున్ దగ్గుబాటి… హీరో మెటీరియల్!
టాలీవుడ్‌లో ఫ్యూచర్‌లో ఆరడుగుల హీరోల్లో తప్పకుండా ఉంటాడు అర్జున్ దగ్గుబాటి. విక్టరీ వెంకటేష్ కొడుకుగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వేడుకకు హాజరైనప్పుడు అందరి కళ్లూ అర్జున్ మీదే ఉన్నాయి. ‘పక్కా స్టార్ మెటీరియల్’ అని అందరూ పొగుడుతుంటుంటే… ‘చిన్నపిల్లాడు.. చదువుకుంటున్నాడు. ఇప్పుడే ఆ మాటలెందుకు? అవ్వాల్సినప్పుడు కచ్చితంగా అయ్యి తీరుతాడు. తన మనసుకు నచ్చిన ఫీల్డ్ లో ఎదుగుతాడు’ అని ఒపీనియన్ షేర్ చేసుకున్నారు వెంకటేష్. ఆ శుభఘడియలు ఎప్పుడా? అని ఎదురుచూస్తున్నారు దగ్గుబాటి అభిమానులు. ఆ మధ్య రానా పెళ్లిలో అర్జున్‌ని పోల్చి చూసుకుని త్వరలోనే హీరో అవుతాడని మురిసిపోయారు ఫ్యాన్స్.
మహాధన్.. కేరాఫ్ మాస్ మహరాజ్!
మాస్ మహరాజ్ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ రాజా ది గ్రేట్‌లో మహాధన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అడపాదడపా థియేటర్లలో సినిమాలు చూడటానికి వచ్చినప్పుడల్లా జనాలు మహాధన్‌ని గుర్తుపడుతూనే ఉన్నారు. సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి, అభిరుచి ఉన్న మహాధన్ ఎంట్రీ మామూలుగా ఉండదనే మాట మాత్రం ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ రెండు మూడేళ్లల్లో ఇంకెంత మంది స్టార్ తనయులు సినీ ఎంట్రీ ఇస్తారోననే ఆసక్తి కూడా జనాల్లో బాగానే ఉంది. ఫలానా వారి తాలూకు అని చెప్పుకుని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం తేలికే. కానీ నిలబెట్టుకోవడానికే జీవితకాలం సరిపోతుంది. ఇంటి పేరును విజిటింగ్ కార్డులా వాడుకోవాలి. అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, సమయపాలనతో ముందడుగు వేయాలి. సొంత కాళ్ల మీద నిలబడగలిగినప్పుడే సినిమా ఇండస్ట్రీలో విలువ. పెద్దల సలహాలు తీసుకుంటూ, తమదైన శైలితో సాగినప్పుడే సక్సెస్ సొంతమయ్యేది. లేకుంటే అలా వచ్చి… ఇలా వెళ్లిన వాళ్ల కోవలోకి చేరడం ఖాయం. సినిమా ఇండస్ట్రీలో నడక కత్తిమీద సాములాంటిది. గుర్తెరిగి అహర్నిశలు శ్రమించగలిగితే అందలాలు ఎక్కడం ఖాయం. వారసులుగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న వీరందరూ ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. అనుసరించాలి. స్టార్లుగా వెలగాలని ఆశిద్దాం. ప్యాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ పేరును నిలబెట్టాలని ఆకాంక్షిద్దాం..!
– డా. చల్లా భాగ్యలక్ష్మి
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి