Shruti Haasan: సౌత్.. నార్త్ సినిమాలపై శ్రుతి హాసన్ ఓపెన్ కామెంట్స్..
నేను నిజంగా ఉత్తరాది.. దక్షిణాది పరిశ్రమలకు చెందిన వ్యక్తిని. నేను బహుభాషా గృహంలో పెరిగాను.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన శ్రుతి హాసన్ (Shruti Haasan).. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. క్రాక్ సినిమాతో తెలుగులోకి మళ్లీ ఫాంలోకి వచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ మూవీలో నటిస్తోంది. ఓవైపు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటూనే.. మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. ఇటీవల సలార్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే సౌత్, నార్త్ సినిమాల గురించి.. భాష పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ” నేను నిజంగా ఉత్తరాది.. దక్షిణాది పరిశ్రమలకు చెందిన వ్యక్తిని. నేను బహుభాషా గృహంలో పెరిగాను. మా ఇంట్లో ఇద్దరు వేర్వేరు భాషలకు చెందిన కళాకారులు ఉన్నారు. ఈ రెండు సినీ పరిశ్రమలను చూస్తూ పెరిగే అవకాశం నాకు వచ్చింది. వేర్వేరు పరిశ్రమలలో పనిచేస్తున్న నా తల్లిదండ్రులను చూశాను.. అమ్మ హిందీలో కాకుండా వేరే భాషలలో.. నాన్న తమిళంలో కాకుండా ఇతర భాషలలోనూ సినిమాలు చేశారు. అందులోనూ వారు చిత్రపరిశ్రమలో అద్బుతంగా పనిచేశారు. ఎందుకంటే కళకు భాష లేదు. నేను అటూ ఇటూ ప్రయాణిస్తుంటాను. నాకు సాంబార్ రైస్ ఎంత ఇష్టమో.. దాల్ చావల్ కూడా అంతే ఇష్టం. అందుకే భాష వ్యత్యసం నాకు కనిపించలేదు. నేను హిందీలోనూ సినిమాలను చేయాలనుకుంటున్నాను. సినిమాల పరంగా అన్ని చోట్లకు వెళ్తుంటాను. ఎక్కడైనా నన్ను ప్రేక్షకులు మెచ్చుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నార్త్, సౌత్ సినిమాల మధ్య చీలిక అనేది నేను పెద్దది అనుకోను. నేను విదేశాల్లో ఉన్నప్పుడు భారతీయ సినిమాలు కూల్ గా ఉన్నాయని.. మాట్లాడుతున్నప్పుడు అందరూ అవునంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలను విభజించడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మంచి పని రోజు చివరిలో మంచి పని మాత్రమే ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చింది.