Sarath Babu: శరత్ బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు.. రెండూ విడాకులే.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు..
ప్రముఖ టాలీవుడ్ నటుడు శరత్‌బాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు శరత్‌బాబు. ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు శరత్‌బాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు శరత్‌బాబు. ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్‌కి దారి తీయడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కి తరలించారు. గుండె, లివర్, కిడ్నీ, లంగ్స్ ఇన్‌ఫెక్షన్ పెరగడంతో చికిత్స ఫలించక కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
శరత్‌బాబుకు ఎన్ని పెళ్లిళ్లయ్యాయి?…. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నంత పాపులర్ ఈ ప్రశ్న. కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే రమాప్రభను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. అప్పటికే రమాప్రభ హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నంబియార్ కుమార్తె స్నేహను పెళ్లాడారు. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతాననే శరత్‌బాబు ఏడు పదుల వయసులోనూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టకపోయినా, చేసిన ప్రతి పాత్రనూ ప్రేమించే చేశానని అనేవారు శరత్‌బాబు.
తనకు పిల్లలు లేకపోయినా అన్నదమ్ముల పిల్లలు 25 మందీ తన పిల్లలేనని చెప్పేవారు శరత్‌బాబు. నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఆనందంగా ఉండటం తనకు అలవాటేనని అనేవారు. కోవిడ్ టైమ్‌లో ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదివారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచే వారు. ఇంట్లో ఉంటే ఉదయం పండ్లు తినేవారు. మధ్యాహ్నం చిరుధాన్యాల భోజనం, రాత్రిపూట పుల్కాలు తినేవారు. మితాహారం, శాకాహారం తన అందానికి, ఆరోగ్యానికి కారణమని చెప్పేవారు. హీరోయిన్లకు సోదరుడిగా, మధ్యతరగతి మనిషిగా, ప్రలోభాలకు గురైన వ్యక్తిగా, హీరోకి స్నేహితుడిగా, ప్రతినాయకుడిగా, సిట్చువేషన్స్ కి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించారు శరత్‌బాబు.
బాలచందర్, కె.విశ్వనాథ్, రజనీకాంత్, చిరంజీవి సినిమాల్లో శరత్‌బాబు పాత్రలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. సోషల్ సినిమాలు మాత్రమే కాదు పౌరాణిక, జానపద, భక్తి చిత్రాలతోనూ మెప్పించారు శరత్‌బాబు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పే డైలాగులకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. తెలుగు, తమిళంలో ఆయన డైలాగులు చెప్పే తీరు తనకు చాలా ఇష్టమని కె.విశ్వనాథ్ పలు సందర్భాల్లో చెప్పారు.