AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarangapani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి మరో హిట్ అందుకున్నాడా.?

బలగం, కోర్ట్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రియదర్శి. తాజాగా ఈయన హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం సారంగపాణి జాతకం. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ఈ సినిమాకు జాతకం బాగా వర్కవుట్ అయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Sarangapani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి మరో హిట్ అందుకున్నాడా.?
Sarangapani Jathakam
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Apr 25, 2025 | 1:09 PM

Share

నటీనటులు: ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: పీజీ విందా

ఇవి కూడా చదవండి

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్

స్క్రీన్ ప్లేదర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి

కథ:

కార్స్ షాప్‌లో సేల్స్‌మెన్‌ సారంగపాణి (ప్రియదర్శి). చిన్నప్పటి నుంచి కూడా మనోడికి బాగా జాతకాల పిచ్చి. అదే కంపెనీలో పనిచేసే మేనేజర్ మైథిలీ (రూపా కొడువాయూర్)ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు సారంగపాణి. తన ప్రేమను చెప్పాలనుకుంటున్న సమయంలోనే.. సారంగను ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తుంది మైథిలి. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలోనే.. ఆస్ట్రాలజర్ జిగ్నేశ్వర్ శర్మ ( శ్రీనివాస్ అవసరాల) సారంగపాణి జీవితంలోకి వస్తాడు. ఆయన జాతకం చూసి.. ఒక నరహత్య చేస్తావని జోతిష్యం చెబుతాడు. అప్పట్నుంచి ఎవర్ని చంపాలా అని తన స్నేహితుడు చందు (వెన్నెల కిషోర్)తో కలిసి తిరుగుతుంటాడు. జాతకాలను పిచ్చిగా నమ్మే సారంగపాణి.. ఎవరో ఒకరిని హత్య చేసేవరకు వేట సాగిస్తూనే ఉంటాడు. అసలు విషయం చెప్పలేక పెళ్లిని వాయిదా వేయిస్తుంటాడు. అప్పుడు మైథిలి తల్లిదండ్రులు (వీకే నరేష్, రూపాలక్ష్మీ), సారంగపాణి తల్లిదండ్రులు (శ్రీనివాసరావు, కల్పలత) ఏం చేసారు అనేది అసలు కథ..

కథనం:

బలగం, కోర్ట్ లాంటి సినిమాలతో నవ్విస్తూ ఏడిపించాడు ప్రియదర్శి. అయినా ఏడిపించడం ఈజీనే గానీ నవ్వించడం చాలా కష్టం.. అందులో సక్సెస్ అయ్యారంటే చాలు సినిమా ఒడ్డున పడ్డట్లే. పేరుకు కమెడియన్ అయినా కూడా ఎక్కువగా సీరియస్ కథలనే ఓకే చేస్తూ వచ్చాడు దర్శి. కానీ ఫస్ట్ టైమ్ తన స్టామినాకు తగ్గట్లు పూర్తిగా ఎంటర్‌టైనింగ్ కథను ఓకే చేసాడీయన. ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా చాలా కాలం తర్వాత తన అసలైన కామెడీ టైమింగ్ బయటికి తీసుకొచ్చాడు. ఈ విషయంలో సారంగపాణి జాతకం మహాద్భుతంగా ఉంది.. చూస్తుంటే ప్రియదర్శికి మరో హిట్ పడేలాగే ఉంది. జాతకాలు నమ్మే ఓ అబ్బాయి.. అనుకోకుండా ఓ సమస్య.. అందులోంచి బయటపడ్డానికి ఆ కుర్రాడు చేసే విన్యాసాలు.. వినడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది కథ. కానీ దాన్ని తనదైన స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు ఇంద్రగంటి. తొలి అరగంట కాస్త నెమ్మదిగా సాగుతుంది కథ.. కానీ ట్విస్ట్ వచ్చాక అస్సలు ఆగదు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా హిలేరియస్‌గా ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ వన్ లైనర్స్‌కు కడుపులు చెక్కలే..! ప్రియదర్శి, కిషోర్ మధ్య సీన్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.. సెకండాఫ్ వైవా హర్ష వచ్చాక ఫన్ మరింత పెరిగింది. కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడా బోర్ కొట్టదు.. క్లైమాక్స్ కూడా హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. సంక్రాంతి సినిమాలన్నీ ఒకే థియేటర్‌లో పడ్డట్లు అంతా ఇక్కడే ఉన్నారేంట్రా.., ఇప్పుడు ఫుల్ నెరేషన్ ఇస్తావేంట్రా.. స్టార్ హీరోకు చెప్పినట్లు లైన్ చెప్పు చాలు.. అంటూ టాలీవుడ్‌పై ముచ్చటపడి మరీ పంచ్ డైలాగులు రాసాడు ఇంద్రగంటి. ఓవరాల్‌గా హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది సారంగపాణి జాతకం.

నటీనటులు:

ప్రియదర్శి మరోసారి అదరగొట్టాడు. సీరియస్ క్యారెక్టర్ అయినా.. ఎంటర్‌టైనింగ్ రోల్ అయినా చాలా బాగా చేస్తుంటాడు దర్శి. సారంగపాణిగా అద్భుతంగా నటించాడు ఈ నటుడు. ఇక తెలుగమ్మాయి రూప కొడవయూర్ నటన బాగుంది. వెన్నెల కిషోర్ మెయిన్ పిల్లర్.. ఈయన కనిపించిన ప్రతీసారి నవ్వొస్తుంది. సెకండాఫ్ వైవా హర్ష వచ్చిన తర్వాత డోస్ ఇంకాస్త పెరిగింది. మరో కీలక పాత్రలో అవసరాల శ్రీనివాస్ బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

వివేక్ సాగర్ సంగీతం పర్లేదు. పాటలు కూడా బాగానే ఉన్నాయి. పిజి విందా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా రోజుల తర్వాత తన మార్క్ రైటింగ్ చూపించాడు. స్క్రీన్ ప్లే పరంగా సారంగపాణి పరుగులు పెట్టాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సారంగపాణి జాతకం.. సమ్మర్‌ కూల్ ఎంటర్‌టైనర్..!