Saif Ali Khan: సైఫ్ కంటే ముందు ఆ స్టార్ హీరో ఇంటిపై కన్నేసిన నిందితుడు.. కానీ.. విచారణలో విస్తుపోయే విషయాలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడిన దుండగుడు పట్టుబడ్డాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు.అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంట్లోకి చొరబడి, డబ్బు డిమాండ్ చేసి, ఆపై సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచిన వ్యక్తి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. అతడిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ కంటే ముందు ఈ నిందితుడు మరో స్టార్ హీరో ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇందుకోసం గట్టిగా రెక్కీ నిర్వహించినట్లు కూడా విచారణలో తేలింది. అయితే ఎందుకోగానీ అక్కడికి వెళ్లేకపోయాడు. దీంతో సైఫ్ అలీఖాన్ ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు.
ముంబైలోని బాంద్రాలో షారుఖ్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’ ఉంది. ఈ ఇంటికి చాలా భద్రత ఉంది. ఈ ఇంటి గేటు వద్ద సెక్యూరిటీ గార్డు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తుంటారు. ఇంట్లోకి ఎవరూ సులభంగా ప్రవేశించలేరు. కానీ ఈ నిందితుడు మాత్రం షారుఖ్ ఇంట్లోకి చొరబడేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. జనవరి 14వ తేదీ రాత్రి మన్నత్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. కానీ ఎందుకో గానీ ఆ ప్లాన్ విఫలమైంది. ఆ తర్వాత షారుఖ్ బంగ్లాను వదిలి సైఫ్ అలీఖాన్ ఇంటి లోపలికి వెళ్లాడు. అక్కడి భద్రతా వైఫల్యం ఈ నిందితుడికి బాగా కలిసొచ్చింది. దీంతో అతను సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ‘సద్గురు బిల్డర్స్’ నిర్మించిన ‘సద్గురు శరణ్’ అపార్ట్‌మెంట్‌లో సైఫ్ ఉంటున్నాడు. ఇది ఐదు పడక గదుల ఇల్లు. సైఫ్ నాలుగో అంతస్తులో నివసిస్తున్నట్లు సమాచారం. దీని ధర 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. కానీ ఇక్కడ సరైన భద్రత లేదని తెలుస్తోంది. అపార్ట్ మెంట్లోకి ఎవరు వచ్చి వెళుతున్నారో చూసేందుకు సెక్యూరిటీ గార్డులను కూడా కేటాయించలేదు.
సైఫ్ ఫ్లాట్ లోపల నాలుగు అంతస్తులు ఉన్నాయి. ఇంత పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ సైఫ్ ఇంట్లో సీసీటీవీ లేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన తర్వాత, దొంగ భవనం మెట్లు దిగి రావడం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అతడి ముఖం కూడా స్పష్టంగా కనిపించింది. అయితే సైఫ్ ఇంటి లోపలా, బయటా సీసీటీవీలు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ‘ఇది సైఫ్-కరీనాలకే కాదు.. భద్రత పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇతర సెలబ్రిటీలకు కూడా హెచ్చరిక’’ అని సీనియర్ ఇన్వెస్టిగేటర్ తెలిపారు.
🚨 Saif Ali Khan’s attacker also conducted recce of Shah Rukh Khan’s residence ‘Mannat’, police sources have revealed.#SaifAliKhan #ShahRukhKhan #Mannat #Bollywood #SaifAliKhanAttacked pic.twitter.com/NQkKOt76bI
— News9 (@News9Tweets) January 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








