Ramoji Rao: మరణానికి ముందే స్మారక కట్టడాన్ని ఏర్పాటు చేసుకున్న రామోజీ రావు.. ఫిల్మ్ సిటీలోనే నిర్మాణం..
కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు.. ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను నానక్ రామ్ గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీ రావు మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు గుండె సంబంధిత సమస్యలతో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ రావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో రామోజీ రావు పార్థీవదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్ తదితరులు నివాళులర్పించారు. ఈరోజు (జూన్ 9న) రామోజీ రావు అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంత్రక్రియలు నిర్వహించనున్నారు.
ఈరోజు ఉదయం 9 గంటల నుంచే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రామోజీరావు మృతికి గౌరవసూచకంగా ఇవాళ సినిమాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రకటించింది. మరోవైపు ఈరోజు జరగనున్న రామోజీ రావు అంత్యక్రియలను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పెద్దఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
రామోజీ రావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీ రావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ రావు కుటుంబసభ్యులతో సీఎం ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి శనివారం పరిశీలించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.