ఆ భయంకర వ్యాధి బాధితులకు గుడ్‌న్యూస్, సైంటిస్టుల ప్రయోగాలు సక్సెస్
ఆల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గత కొంత కాలంగా గణనీయంగా పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే ఇక నయం కావడం కష్టం. ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మంది డెమెంటియాతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ ఆల్జీమర్స్ వ్యాధి బాధితులే. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే ప్రయోగాలు సక్సెస్ కావడం బాధితుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

ఆల్జీమర్స్ (తీవ్రమైన మతి మరుపు వ్యాధి) బారిన పడుతున్న వారి సంఖ్య గత కొంత కాలంగా ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే అంతే సంగతులు. ఈ వ్యాధి నయం కావడం దాదాపు అసాధ్యమే. ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మంది డెమెంటియాతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ ఆల్జీమర్స్ వ్యాధి బాధితులే. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల మంది ఈ జాబితాలో చేరుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
2050 నాటికి ఈ సంఖ్య ఆల్జీమర్స్ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతుంది. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఆల్జీమర్స్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. చికిత్స తీసుకున్నప్పటికీ ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే అవకాశం ప్రస్తుతానికి లేకపోవడం గమనార్హం. అయితే, శాస్త్రవేత్తలు తాజాగా ఆల్జీమర్స్ బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఆల్జీమర్స్ పూర్తిగా నయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెల్ రిపోర్ట్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన ఓ కొత్త స్టడీ ఈ మేరకు వెల్లడించింది.
ప్రస్తుతం జంతువులపై జరిపిన పరిశోధనలు విజయవంతమైనట్లు పేర్కొంది. ఇకపై ఆల్జీమర్స్ ఇక వన్ వే ప్రాసెస్ కాదని.. మెమోరీని పూర్తిగా తీసుకురావచ్చని యూనివర్సిటీ హాస్పిటల్స్ క్లీవ్‌లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శాస్త్రవేత్తల పరిశోధనలు మిలియన్ల ఆల్జీమర్స్ బాధితుల కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఆల్జీమర్స్‌ను అంతం చేసే ఆ రహస్యం పేరే మోలెక్యూల్ ఎన్ఏడీ+(NAD+)(nicotinamide adenine dinucleotide). NAD+ అనేది బ్రెయిన్ సెల్స్ నిరంతరం రన్ అయ్యేలా చేస్తుంది. ఆల్జీమర్స్ వ్యాధిని ఇది నిరోధిస్తుంది.
అసలు విషయం NAD+
ఆల్జీమర్స్ వ్యాధి బాధితుల్లో NAD+ బ్రేక్ డౌన్ అయ్యిందని వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే NAD+ లెవెల్స్ ను రిస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మొదట జంతువుల్లో పరిశోధనలు చేసి విజయవంతమయ్యారు. P7C3-A20 అనే డ్రగ్‌ను ఇందుకు వినియోగిస్తున్నారు. ఈ డ్రగ్ ఆల్జీమర్స్‌ను అదుపులోకి తీసుకురావడమే గాక, మునుపటి జ్ఞాపకశక్తిని పునరుద్ధరిస్తుంది. సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.
ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు దానికి విరుగుడును కనిపెట్టారు. NAD+ లెవల్స్ పెంచడం ద్వారా ఆల్జీమర్స్‌ను పూర్తిగా నయం చేవచ్చని తేల్చారు. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తీసుకురావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఐరోపా, ఆసియాల్లోని శాస్త్రవేత్తలు.. లిథియం డ్రగ్స్ ను జంతువుల్లో ఉపయోగించి ఆల్జీమర్స్ అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కూడా సత్ఫలితాలనే ఇస్తుండటం గమనార్హం.
ఆల్జీమర్స్ బారిన పడినవారు సాధారణ విషయాలు కూడా గుర్తుంచుకోలేరు. తమ పనిని తాము కూడా నిర్వహించుకోలేని స్థితిలోకి వెళ్లిపోతారు. దీంతో బాధితులతోపాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. తాజా పరిశోధనలు వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. జంతువుల్లో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు.. ఆ మందులను త్వరలోనే మనుషులపై ప్రయోగించనున్నారు. అవి సత్ ఫలితాలను ఇచ్చిన అనంతరం ఆ మందులను మార్కెట్లలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.