అతను బ్రతికి ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది.. ఎమోషనల్ అయిన హర్షవర్ధన్
అమృతం సీరియల్ తనకెంతో ఇష్టమని, నటుడిగా కాకుండా ఆడియెన్స్‌గా చూస్తానని నటుడు హర్షవర్ధన్ తెలిపారు. దివంగత గుండు హనుమంతరావు తమ మనసుల్లో ఎప్పటికీ ఉంటారని ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో హనుమంతరావు కీలక పాత్ర పోషించారని, తనను ముందుకు నడిపించే స్ఫూర్తినిచ్చారని గుర్తుచేసుకున్నారు.

90స్ కిడ్స్ ఆల్ టైం ఫేవరెట్ సీరియల్ అంటే టక్కున చెప్పే పేరు.. అమృతం. ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ప్రస్తుతం ఈ సీరియల్ యూట్యూబ్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించిన హర్షవర్ధన్ గుర్తున్నాడా.? ఆయన ఇప్పుడు నటుడిగా దర్శకుడిగా రాణిస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ దివంగత సహనటుడు గుండు హనుమంతరావు గురించి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. తాను అమృతం సీరియల్‌కు బేసిక్‌గా ఫ్యాన్‌నని, అందులో తాను నటించినప్పటికీ, ఆడియెన్స్‌లాగే చూసి ఆస్వాదిస్తానని తెలిపారు. తన స్నేహితుల ఇళ్లలో అమృతం సీరియల్ పెట్టినప్పుడు, తాను వారికన్నా ఎక్కువ నవ్వుతానని చెప్పారు.
గుండు హనుమంతరావుతో తనకున్న కాంబినేషన్‌ను గుర్తుచేసుకుంటూ.. ఆయన భౌతికంగా లేకపోయినా తన మనసులో ఎప్పటికీ ఉన్నారని హర్షవర్ధన్ ఎమోషనల్ అయ్యారు. మనుషులు ప్రజల హృదయాల్లో నిలిచిపోతే, వారు సజీవంగా ఉన్నట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాల మాదిరిగానే, గుండు హనుమంతరావు కూడా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని, సినీ పరిశ్రమ గొప్పతనం ఇదేనని ఆయన అన్నారు. సినిమా మరణం లేకుండా చేస్తుందని, ఇందులో అందరూ ఎప్పటికీ ఉంటారని ఆయన అన్నారు.
హర్షవర్ధన్, గుండు హనుమంతరావుతో తన సంబంధం మాట్లాడుతూ.. హనుమంతరావు ప్యాక్ ఆఫ్ ఎనర్జీ అని అన్నారు. తాను సహజంగా సీరియస్‌గా, నాన్-సింక్‌లో ఏదో ఆలోచిస్తూ ఉండేవాడినని, కానీ హనుమంతరావు వచ్చి తనను కూర్చోనిచ్చేవాడు కాదని, రా రా కమాన్ రా, ఏంటి ఎలా ఉన్నారు మీరు, ఇలా రండి, అది చేయండి ఇది చేయండి అంటూ గోల చేసేవాడని గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌కు బైక్‌పై వెళ్తున్న తనను చూసి, బైక్ ఎందుకు, కారు కొనుక్కోమని ప్రోత్సహించారని తెలిపారు. మొదట తాను సందేహించినా, హనుమంతరావు దగ్గరుండి మారుతి 800 కొనేలా చేశారని, ఐదు- ఆరు నెలల్లో దాన్ని మార్చమని కూడా చెప్పేవారని హర్షవర్ధన్ గుర్తుచేసుకున్నారు. ఒక పెద్ద లక్ష్యం, కల ఉండటం వల్ల ఎక్కువ, మెరుగైన పని చేయవచ్చని, తనకు లేని ఈ మోటివేషన్ గుండు హనుమంతరావు ద్వారా లభించిందని హర్షవర్ధన్ చెప్పారు. ఆయన నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ఇప్పటికీ ఉండుంటే నా జీవితం ఇంకొంచెం బాగుండేది. నాకు ఆ బూస్టింగ్ పక్కన ఉండాలి. నేను ఆయన్ను మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అయ్యారు హర్షవర్ధన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




