AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Girls Movie Review: బ్యాడ్ గర్ల్స్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

యూత్ ఫుల్ కామెడీ ఎలిమెంట్స్‌తో, నలుగురు అమ్మాయిల ప్రయాణాన్ని చూపిస్తూ తెరకెక్కిన చిత్రం బ్యాడ్ గర్ల్స్. క్రైమ్, కామెడీ మరియు ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు ఫణి ప్రదీప్ రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Bad Girls Movie Review: బ్యాడ్ గర్ల్స్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Badgirlz
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 26, 2025 | 6:55 PM

Share

రివ్యూ: బ్యాడ్ గర్ల్స్

నటీనటులు: రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, యశ్న ముతులురి, రోష్ని, శ్రవంతి చొక్కారపు, రాజా రవీంద్ర తదితరులు..

సంగీతం: అనూప్ రూబెన్స్

నిర్మాతలు: శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, సోమ నర్సయ్య

రచన, దర్శకత్వం: ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా)

కథ:

రోజీ రెడ్డి, మల్లేశ్వరి, మెర్సీ, వెంకట లక్ష్మి.. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉండే మంచి స్నేహితులు. తమలో ఇద్దరికి పెళ్లి నిశ్చయం కావడంతో.. పెళ్లికి ముందే స్పిన్‌స్టర్ వెకేషన్ కోసం మలేషియా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. సరదాగా సాగిపోతున్న వీళ్ళ ట్రిప్, అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ కుట్ర, మహిళల అక్రమ రవాణా చేసే ముఠా కారణంగా మలుపు తిరుగుతుంది. ఈ క్రైమ్ వలయంలో చిక్కుకున్న ఆ నలుగురు అమ్మాయిలు, ఆ ప్రమాదాల నుంచి ఎలా బయటపడ్డారు? ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగిలిన కథ.

కథనం:

బ్యాడ్ గర్ల్స్ సినిమా ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ప్రయత్నం. దర్శకుడు ఫణి ప్రదీప్ ఒక రొటీన్ స్టోరీని తీసుకున్నప్పటికీ.. దాన్ని నడిపించిన విధానం పర్వాలేదనిపిస్తుంది. సినిమా మొదటి భాగం కాస్త నెమ్మదిగా, కొన్ని అనవసరమైన సన్నివేశాలతో సాగినట్లు అనిపించినా, సెకండాఫ్ మాత్రం పర్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వాళ్ళ మధ్య బాండింగ్ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయి. కామెడీ, థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేయడం పాత ఫార్ములానే అయినా.. ద్వితీయార్థంలో స్క్రీన్ ప్లే వేగం పుంజుకోవడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, ట్విస్ట్ సినిమాకి ఓకే అనిపించాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, ఫస్టాఫ్‌లో వచ్చే లాగ్ సినిమాకి ప్రధాన మైనస్. రొటీన్ కథ కావడం.. స్లోగా సాగే ఫస్టాఫ్.. కొన్ని చోట్ల హీరోయిన్ల డిక్షన్ కూడా ఈ సినిమాకు మైనస్ అవుతుంది. అయితే నలుగురు హీరోయిన్ల నటన, కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ క్లైమాక్స్ పర్లేదు అనిపిస్తాయి. అలాగే రేణు దేశాయ్ సినిమాలో ఉండటం ప్లస్ అవుతుంది.

నటీనటులు:

ప్రధాన పాత్రల్లో నటించిన అంచల్, పాయల్, యశ్న, రోష్ని తమ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను ముందుకు నడిపించారు. నలుగురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. వాళ్ళ కామెడీ టైమింగ్, రియాక్షన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే కొంతమంది లీడ్స్ డైలాగ్ స్లాంగ్ అక్కడక్కడా కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మోయిన్, రోహన్ సూర్య తమ కామెడీతో నవ్వించగా.. రేణు దేశాయ్, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

సాంకేతికంగా ఈ సినిమాకు ప్రధాన బలం అనూప్ రూబెన్స్ సంగీతం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మలేషియా లొకేషన్స్‌ను కెమెరాలో చాలా కలర్ ఫుల్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు కానీ, ఫస్టాఫ్‌లో ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు మున్నా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మంచి కథ రాసుకున్నా.. అక్కడక్కడా కాస్త స్లో అయింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బ్యాడ్ గర్ల్స్.. డీసెంట్ యూత్‌ఫుల్ సినిమా..!