Mohan Babu: పోలీసులకు గన్ అప్పగించిన మోహన్ బాబు.. అరెస్టుపై రాచకొండ సీపీ కీలక ప్రకటన
టీవీ 9 రిపోర్టర్ పై దాడి విషయంలో నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ విషయంపై పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు రాలేదు. తాజాగా ఈ విషయంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మరోసారి కీలక ప్రకటన చేశారు.
మోహన్ బాబు అరెస్ట్ విషయంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసాం. వీటిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు.ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మోహన్ బాబు కు నోటీస్ ఇచ్చాం. ఆయన 24 వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబు కు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. 24వ తేదీ లోపు ఎగ్జామిన్ చేయవచ్చా లేదా అనే విషయం గురించి కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లు లేవు. మోహన్ బాబు వద్ద రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ ఒకటి .స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. 126 BNSS ద్వారా ఆయన సమయం అడగవచ్చు. మరోవైపు నోటీసులకు స్పందించకపోతే ఆయనను అరెస్ట్ చేస్తాం’ అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.
మరోవైపు మోహన్ బాబు తన లైసెన్స్ గన్‌ను పోలీసులకు అప్పగించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి ఆయన వెళ్లారు. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్‌డ్ గన్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ను ఆదేశించారు. దీంతో తాజాగా ఆయన గన్ పోలీసులకు అప్పగించారు.
సీపీ ప్రకటన.. వీడియో ఇదిగో..
అంతకు ముందు దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యలను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..