AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: మరోసారి వివాదంలో కమల్ హాసన్.. కమల్‌తో పాటు అతనిపై కూడా కేసు నమోదు…

రాజ్యసభ సభ్యుడు, నటుడు కమల్ హాసన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కమల్ హాసన్ తాజాగా నిర్మాతగా కొత్త సినిమాను నిర్మిస్తున్నారు.. సినిమా టైటిల్ సండియర్ గా నిర్ణయించారు. తమిళనాడులో ఒక సామాజిక వర్గానికి చెందిన పేరు కావడంతో వివాదం మొదలైంది. పుదియ తమిలగం అనే పార్టీ దీనిపై అభ్యంతరాలను లేవనెత్తింది.

Kamal Haasan: మరోసారి వివాదంలో కమల్ హాసన్..  కమల్‌తో పాటు అతనిపై కూడా కేసు నమోదు...
Kamal Haasan
Ch Murali
| Edited By: |

Updated on: Nov 11, 2026 | 2:25 PM

Share

దక్షిణ తమిళనాడులో కుల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు, రాజకీయ కోణం లో అల్లర్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. డీఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కమల్‌హాసన్.. రాజకీయ ఉద్దేశంతోనే ఈ సినిమా పేరును ఎంచుకున్నారా? అంటూ విమర్శలు చేశారు. కమల్‌హాసన్, దర్శకుడు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. సండియర్ సినిమా టైటిల్‌పై వివాదం ముదురుతోంది. ఈ సినిమా పేరుతో దక్షిణ తమిళనాడులో మళ్లీ సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందంటూ పుదియ తమిళగం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా టైటిల్‌ను నిషేధించడంతో పాటు నటుడు రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ సినిమా దర్శకుడు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సేలం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిటికే పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. సేలంలో పుదియ తమిళగం పార్టీ నేతలు ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. సండియర్ అనే పేరుతో సినిమా తీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ సినిమా టైటిల్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పుదియ తమిళగం పార్టీ సేలం జిల్లా కోఆర్డినేటర్ బాబు.. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. నటుడు కమల్‌హాసన్‌తో పాటు సినిమా దర్శకుడు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో 2004లో కూడా సండియర్ పేరుతో సినిమా నిర్మించేందుకు ప్రయత్నించినప్పుడు వివాదం తలెత్తిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత.. కమల్‌హాసన్‌ను పిలిచి మాట్లాడి, సామాజిక ఉద్రిక్తతలకు కారణమయ్యే సినిమాలు తీయవద్దని సూచించడంతో సినిమా పేరును మార్చినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు మరోసారి సండియర్ పేరుతో సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయడం వివాదానికి దారితీసిందని ఆరోపించారు. చేతిలో కత్తి.. రక్తం కారుతున్న దృశ్యాలతో పాటు.. ప్రతీకారానికి ప్రతీకారమే సమాధానం అన్నట్లుగా టీజర్‌ను విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కులపరమైన వివాదాలకు కారణమైన సినిమాల నేపథ్యంలో దక్షిణ తమిళనాడులో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని, వాటిని చక్కదిద్దేందుకు రెండు దశాబ్దాలకు పైగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.

ప్రస్తుతం రెండు వర్గాల మధ్య సామరస్యం క్రమంగా పెరుగుతున్న సమయంలో.. మళ్లీ సామాజిక ఉద్రిక్తతలు సృష్టించేలా సినిమా టైటిల్ ఉండటం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే సండియర్ సినిమా పేరును నిషేధించాలని, కమల్‌హాసన్‌తో పాటు దర్శకుడు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పుదియ తమిళగం పార్టీ నేతలు పోలీసులను కోరారు.దక్షిణ తమిళనాడులో గత 25 ఏళ్లుగా కుల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాబు తెలిపారు. ప్రస్తుతం రెండు ప్రధాన సామాజిక వర్గాల ప్రజలు విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు.ఇలాంటి సమయంలో మళ్లీ కుల ఘర్షణలను ప్రేరేపించేలా కమల్‌హాసన్ సండియర్ అనే పేరుతో సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సినిమా టైటిల్ వెనుక కులపరమైన ద్వేషం, ఉద్దేశపూర్వక ఆలోచన ఉందని విమర్శించారు.అంతేకాదు.. డీఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కమల్‌హాసన్.. రాజకీయ ఉద్దేశంతోనే ఈ సినిమా పేరును ఎంచుకున్నారా? అనే అనుమానం కూడా ఉందని బాబు ప్రశ్నించారు.కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసిన రాజకీయ నాయకులు ఇలాంటి సినిమాలకు ప్రోత్సాహం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే కమల్‌హాసన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి సండియర్ సినిమా టైటిల్‌పై వివాదం ఇప్పుడు పోలీసుల వరకు చేరింది. సినిమా పేరును నిషేధించాలని, సంబంధిత వారిపై కేసులు నమోదు చేయాలని పుదియ తమిళగం పార్టీ చేసిన ఫిర్యాదుపై పోలీసు లు కేసు నమోదు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us