Tollywood Drugs Case : ఈ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములున్నాయో.. ఒకొక్కటిగా బయటకు వస్తున్న నిజాలు
టాలీవుడ్ సహా, పాలిటిక్స్.. షేక్ షేక్ అయిపోతున్నాయ్.తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో.. డ్రగ్సుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయ్. పోలీసుల విచారణలో కేపీ.. కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది.
అదొక పుట్ట. మామూలు పుట్ట కాదు. మత్తెక్కించే మందుకు అది కేరాఫ్ అన్నట్టు. అందులోంచి కొన్నాళ్ల క్రితం ఓ పాము.. తల బయటకు పెట్టి చూసింది. లటుక్కున పట్టేసుకున్న అధికారులు.. ఆరా తీశారు. ఆ పుట్టలో మరెన్నో పాములున్నాయని కనిపెట్టారు. దీంతో, ఇప్పుడు టాలీవుడ్ సహా, పాలిటిక్స్.. షేక్ షేక్ అయిపోతున్నాయ్. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో.. డ్రగ్సుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయ్. పోలీసుల విచారణలో కేపీ.. కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. సినిమా సెలబ్రిటీలు, రాజకీయనేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ అమ్మినట్టు.. దర్యాప్తులో తేలింది. మొత్తంగా కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌తో షేక్ అవుతోంది టాలీవుడ్.
అధికారుల విచారణలో.. కేపీ చౌదరి పన్నెండు మంది డ్రగ్స్ పెడ్లర్స్, ఆరుగురు డ్రగ్స్ కన్‌స్యూమర్స్ పేర్లను చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్లకు సంబంధించి మొత్తం డేటాను రిలీజ్ చేశారు పోలీసులు. ప్రధానంగా ఇందులో రఘుతేజ పేరు కీలకంగా వినిపిస్తోంది. అతనితో పాటు సనా మిశ్రా, శ్వేత, సుశాంత్ రెడ్డి, నితినేష్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్, వంటేరు సవన్ రెడ్డి, చింతా రాకేష్ రోషన్ అతడి భార్య సాయిప్రసన్న తదితరుల పేర్లున్నాయి.
కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో 9వేలకు పైగా ఫొటోలున్నాయి. వీటిలో ఎక్కువ శాతం సెలబ్రిటీలతో దిగినవే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేకాదు.. అతడి ఫోన్ నెంబర్ నుంచి వాళ్లతో ప్రతీరోజు బోలెడు కాల్స్ మాట్లాడినట్లు తేల్చారు. సినిమా సెలబ్రిటీలు అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతితో చాలా కాల్స్ ఎక్స్‌చేంజ్ అయినట్లు కూడా గుర్తించారు. ఈ కాల్స్ ఎందుకు చేశారు? దేనికోసం అనేదానిపైనే ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అషురెడ్డితో కేపీ రెడ్డి వందల కాల్స్ మాట్లాడినట్టు.. పోలీసు విచారణలో తేలింది. వీరి మధ్య జరిగిన సంభాషణపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్ లిస్ట్ డీకోడ్ చేస్తున్నారు పోలీసులు.
కొన్నిరోజుల క్రితం వీళ్లంతా కలిసి స్నేహిత హిల్స్‌లోని సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు చేసుకున్నట్టు కూడా పోలీసు విచారణలో తేలింది. అక్కడ డ్రగ్ పార్టీ జరిగినట్లు పక్కా ప్రూఫ్స్ సంపాదించారు పోలీసులు. వీళ్లందరూ ఆ పార్టీలో పాల్గొన్నట్లు వెల్లడించారు పోలీసులు. చాలా లావిష్‌గా జరిగిన ఆ పార్టీలో.. కేపీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేల్చారు పోలీసులు. ఈ పన్నెండు మందికి.. డ్రగ్స్ పంపిణీ చేసినట్లు విచారణలోనూ కేపీ ఒప్పుకొన్నాడు.
ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో .. ఫోన్‌కాల్స్, బ్యాంక్ లావాదేవీలు కీలకంగా మారాయి. పలువురికి బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన కిన్‌షుక్ అగర్వాల్ నుంచి 16వేలు కేపీ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యాయి. విజయవాడకు చెందిన సుజాతకు.. లక్షరూపాయలు పంపాడు కేపీ. అయితే వీటికి సంబంధించి కేపీ నుంచి పోలీసులు సమాచారం రాబట్టాల్సి ఉంది. వచ్చే వారం ఈ పన్నెండు మందిని పిలిచి వివరాలు సేకరించబోతున్నారు పోలీసులు.
అయితే టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన కేపీ చౌదరి.. తనకు ఏ పాపం తెలియదన్నాడు. అన్నీ తప్పుడు ఆరోపణలేననీ.. అసలు నిజాలు విచారణలో తేలుతాయంటూ.. చెప్పుకొచ్చాడు ఈ కబాలిచౌదరి. మరి ఈ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములున్నాయో చూడాలి.