AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: వెండితెరపై కలెక్షన్ కింగ్ నట ప్రస్థానానికి 47 వసంతాలు.. సామాన్యుడి నుంచి అసమాన్య శక్తిగా ఎదిగిన హీరో..

ఓ సామాన్య వ్య‌క్తి నుండి అస‌మాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండేల్లో సుస్థిర సింహాస‌నం వేసుకుని కూర్చున్న 'పెద‌రాయుడు' నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారక్టర్ నటుడు మంచు భక్తవత్సలం నాయుడు ఆయ‌నే మంచు మోహన్ బాబు.

Mohan Babu: వెండితెరపై కలెక్షన్ కింగ్ నట ప్రస్థానానికి 47 వసంతాలు.. సామాన్యుడి నుంచి అసమాన్య శక్తిగా ఎదిగిన హీరో..
Mohan Babu
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2022 | 9:17 AM

Share

సామాన్యుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. విలక్షణమైన నటనతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్‏ మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. హీరోగానే కాదు..పవర్ ఫుల్ విలనిజం చూపించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఓ సామాన్య వ్య‌క్తి నుండి అస‌మాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండేల్లో సుస్థిర సింహాస‌నం వేసుకుని కూర్చున్న ‘పెద‌రాయుడు’ నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారక్టర్ నటుడు మంచు భక్తవత్సలం నాయుడు ఆయ‌నే మంచు మోహన్ బాబు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం చుర‌గొన్న‌ మోహన్ బాబు సినిమా ప్ర‌స్తానాని నేటికి 47 ఏళ్లు. చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో జన్మించిన‌ ఆయన ప్రాధమిక విద్య యర్పేడు, తిరుపతిలలో సాగింది. చిన్నప్పటి నుండి నాటకాలఫై ప్రత్యేక అభిమానం కలిగిన భక్తవత్సలం నాయుడు నటనఫై ఆసక్తి పెంచుకున్నారు. తన కల నేరవేర్చుకోవటానికి మ‌ద్రాసుకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్ళు వై.యం.సి.ఏ. కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేసారు. కానీ నటుడు అవ్వాలనే కోరిక ఆయన్ని నిలకడగా నిలబడనియ్యక పరుగులెత్తించింది. అవకాశాలకొసం ఎండా, వానా, ఆకలి దప్పికలు లెక్కచేయక అహర్నిశలు శ్రమించారు. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేసారు.

1975 లో దాసరి నారాయణరావు గారు కొత్త నటి నటులతో నిర్మించ తలపెట్టిన ‘స్వర్గం-నరకం’ చిత్రం కోసం జరిగిన ఆడిషన్ లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తోలి ఆవకాశం సంపాదించారు. దాసరి గారే భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండి తెరకు పరిచయం చేసారు. ‘స్వర్గం నరకం’ చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 573 చిత్రాలకు పైగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి అందులో అల్లుడుగారు , అసెంబ్లీ రౌడి , రౌడీ గారి పెళ్ళాం , మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టాయి. ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా ‘కలెక్షన్ కింగ్’ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరవాత వచ్చిన ‘పెదరాయుడు’ ఇండస్ట్రి హిట్ గా నిలిచింది. శ్రీ రాములయ్య , అడవిలో అన్న తో మోహన్ బాబు లో మరో నటుడిని చూపించాడు. వీటితో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం, న్యాయం కోసం అన్నింటినీ త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి.

అలాగే 1983 లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ స్థాపించి నిర్మాతగా మారి 72కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా 1992 లో విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్,, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు “నటప్రపూర్ణ”, “డైలాగ్ కింగ్”, “కల్లెక్షన్ కింగ్” నే బిరుదులు కాకుండా ‘యాక్టర్ ఆఫ్ ది మిలీనియం’ లాంటి పలు బిరుదులు పొందారు. వీటితో పాటు తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చింది.

ఇవే కాకుండా ‘నటవాచస్పతి’ 2015 లో ‘స్వర్ణకనకం’ 2016లో నవరస నటరత్నం అవార్డులు పొందారు. 2022 నవంబరు 24 నాటికి మోహన్‌బాబు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 47 వసంతాలు పూర్తి చేసుకున్నారు. 1995 లో యన్.టి.ఆర్ ప్రోద్బలంతో 2001 వ‌ర‌కు రాజ్యసభ ఎమ్.పి. గా పనిచేసారు. క‌ళాను’ కళాకారులను అమితంగా అభిమానించే మోహాన్ బాబు సొంత బ్యానెర్ లో సినిమాలు నిర్మించ‌డంతో పాటు ఆయ‌నే హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తూ పలు సినిమాల్లో న‌టిస్తున్నారు. వెండితెరపై అదే ఉత్సాహంతో ఇలాగే మ‌రిన్ని చిత్రాల్లో న‌టిస్తూ మ‌న‌ల్ని అల‌రించాల‌ని కోరుకుందాం.