AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macherla Controversy: వివాదంలో నితిన్ మాచర్ల మూవీ.. తోకలొద్దని దర్శకరత్న చెప్పిన సూక్తిని పాటించమంటున్న క్రిటిక్స్

తాజాగా మాచర్ల నియోజకవర్గాన్ని కడిగి శుభ్రం చేస్తానంటూ సిద్ఱార్థ్‌రెడ్డి IASగా కొత్తవతారమెత్తిన హీరో నితిన్‌ మాత్రం.. సినిమా రిలీజ్‌కి ముందే విచిత్రంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రారా రెడ్డీ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌.. ఈ నిప్పులోనే కాసింత ఉప్పు జల్లేసింది.

Macherla Controversy: వివాదంలో నితిన్ మాచర్ల మూవీ.. తోకలొద్దని దర్శకరత్న చెప్పిన సూక్తిని పాటించమంటున్న క్రిటిక్స్
Macherla Movie Controversy
Surya Kala
|

Updated on: Jul 28, 2022 | 9:49 AM

Share

Macherla Movie Controversy: వివాదాల్ని వెతుక్కుంటూ వెళ్లడం గత కొంతకాలంగా సినిమావారికి అలవాటుగా మారింది. ఏదో ఒకటి రచ్చ జరిగితే తప్ప తమ సినిమా కంటెంట్ జనంలోకి వెళ్లదన్న నీతిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు మేకర్స్. తాజాగా నితిన్ సినిమా కూడా కుల, రాజకీయ చిచ్చుకు దారితీసింది. ఆ గొడవ కాస్తా ముదిరి.. సినిమాలూ-సామాజికవర్గాలూ అనే సబ్జెక్ట్‌ని మళ్లీ తెరమీదికొచ్చేసింది. చాక్లెట్ బాయ్ నితిన్‌… ఫస్ట్‌ టైమ్ పొలిటికల్ ఫ్లేవర్లతో నటించిన తాజా సినిమా మాచర్ల నియోజకవర్గం. ఆగస్టు 12న రిలీజౌతోంది. ఆలోగానే దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పేరు మీద ప్రచారమౌతున్న కొన్ని ట్వీట్లు.. రచ్చకెక్కి.. సినిమాను నిషేధించాలన్న డిమాండ్‌ దాకా వెళ్లాయి. సినిమాలో క్యారెక్టర్ పేరుకు రెడ్డి అనే తోక తగిలించడం కూడా నెటిజన్లలో చిచ్చును రేపింది.

గతంలో టైటిల్స్‌లో గాని, క్యారెక్టర్‌ నేమ్స్‌లో గానీ కులం పేరు కనిపించినా… అదేం పెద్ద వివాదాలు ఏర్పడిన దాఖలా లేదు. ఇటీవల సీమకి చెందిన వీర్రాఘవరెడ్డి పాత్రతో బ్లాక్‌బస్టర్ కొట్టిన జూనియర్ రాముడు వెండితెరపై సామాజిక వర్గాల్ని ట్యాకిల్ చేసే విషయంలో అదుపు తప్పలేదు. ఫ్యాక్షనిజాన్ని రూపుమాపే టార్చ్‌బేరర్‌గా సదరు రెడ్లను మెప్పించాడు యంగ్ టైగర్. ఒక్క జూ ఎన్టీఆర్ మాత్రమే కాదు.. బాబాయ్ కూడా నైన్టీస్‌లో సమర సింహారెడ్డిగా ఎంత గట్టిగా గర్జించారో… ఆ తర్వాత రెండేళ్ల గ్యాపిచ్చి నరసింహనాయుడు గెటప్‌లో కూడా అంతే సాలిడ్‌గా హిట్టు కొట్టారు. ఆవిధంగా రెండు సామాజికవర్గాల్నీ ఇంటిలిజెంట్‌గా బ్యాలెన్స్ చేసి… రెండు వైపులా జైబాలయ్య ట్యాగ్‌ని నిలబెట్టుకున్నారు.

మెగాస్టార్ బ్రదర్స్ స్టైల్ అయితే ఇంకా యూనిక్. పొలిటికల్ ఫ్లేవరున్న సినిమాలు ఎన్ని తీసినా వాటిలో కులాల ప్రస్తావన అస్సలు రానివ్వరు. ఇంద్రసేనారెడ్డిగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా వెండితెరపై రాణించారు. టైటిల్స్‌లో మాత్రం రెడ్డి అనే సౌండ్ రాకుండా జాగ్రత్తపడ్డారు చిరూ. అంతేకాదు అన్నబాటలో తమ్ముడు.. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ కూడా కులాల తోకల జోలికి అసలే వెళ్లరు. గబ్బర్‌సింగ్ అనీ, భీమ్లా నాయక్ అనీ ఖతర్నాక్ టైటిల్స్‌ పెట్టుకుని.. ఈ మెయిన్ స్ట్రీమ్‌ సామాజికవర్గాల లొల్లికి దూరంగా ఉండిపోయారు పీకే. కాటమరాయుడిగా నటించినా కంటెంట్‌ విషయంలో జాగ్రత్తపడ్డారు. మిరామిరా మీసం తిప్పినా అది జనం కోసమేనంటూ మధ్యేమార్గంలో నడిచారు పవర్‌స్టార్.

ఇవి కూడా చదవండి

అవసరం అనిపిస్తే.. స్టోరీ డిమాండ్ చేస్తే.. తమ తమ ఇంటి పేర్లనైనా సినిమాల్లో వాడుకుంటాం తప్ప.. కులం పేర్ల జోలికి అసలే వెళ్లొద్దని స్టార్ హీరోల నుంచి స్ట్రాంగ్ అప్పీల్ కూడా వెళ్లిందట.

అయితే తాజాగా మాచర్ల నియోజకవర్గాన్ని కడిగి శుభ్రం చేస్తానంటూ సిద్ఱార్థ్‌రెడ్డి IASగా కొత్తవతారమెత్తిన హీరో నితిన్‌ మాత్రం.. సినిమా రిలీజ్‌కి ముందే విచిత్రంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రారా రెడ్డీ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌.. ఈ నిప్పులోనే కాసింత ఉప్పు జల్లేసింది. మూవీ డైరెక్టర్ కమ్మ, కాపు కులాల్ని టార్గెట్ చేస్తూ రాజశేఖర్‌రెడ్డి పేరుతో వచ్చిన కొన్ని పాత ట్వీట్లు ఇప్పుడు పైకొచ్చాయి. ఇది రెడ్ల సినిమా… అందుకే బ్యాన్ చేయండి అనేదాకా వెళ్లింది వ్యవహారం. ఆ ట్వీట్లు నావి కాదండీ బాబూ అంటూ దర్శకుడు సైబర్‌ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. అయితే సోషల్ మీడియా శాంతించే పరిస్థితుల్లేవు. హీరో నితిన్, డైరెక్టర్ రాజశేఖర్… ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు కావడం కూడా ఈ కాంట్రవర్సీని కాక రేపుతోంది.

కనుక ప్రస్తుతం నడుస్తున్న ట్రోలర్ల సామ్రాజ్యంలో కులాల ప్రస్తావన లేకుండా సినిమాలు తీస్తేనే బెటరన్నది క్రిటిక్స్ సైడ్‌ నుంచి వినిపించే సూచన. అసలు పేర్ల వెనకే ఈ తోకలొద్దని అప్పుడెప్పుడో దర్శకరత్న దాసరి ఒక పాట ద్వారా చెప్పిన సూక్తి.. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ల పేర్లకి కూడా ఈ నిబంధన వర్తింపజేయలేమో అని వ్యాఖ్యానిస్తున్నారు.

TV9 Movie Desk

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..