MAA Elections 2021: ఎన్ని షేడ్స్.. ఎన్ని వేరియేషన్స్.. ఈసారి ‘మా’ ఎలక్షన్స్ నెక్ట్స్ లెవల్ అంతే

'మా' పోలింగ్ సెంటర్ వద్ద విభిన్న దృశ్యాలు సాక్షాత్కరించాయి. అప్యాయంగా పలకరింపులు.. అంతకుమించి ఆలింగనం.. క్యా సీన్‌ హై అంటూ చప్పట్లు చరిచారంతా.

MAA Elections 2021: ఎన్ని షేడ్స్.. ఎన్ని వేరియేషన్స్.. ఈసారి 'మా' ఎలక్షన్స్ నెక్ట్స్ లెవల్ అంతే
Maa Elections 2021
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2021 | 4:30 PM

‘మా’ పోలింగ్ సెంటర్ వద్ద విభిన్న దృశ్యాలు సాక్షాత్కరించాయి. అప్యాయంగా పలకరింపులు.. అంతకుమించి ఆలింగనం.. క్యా సీన్‌ హై అంటూ చప్పట్లు చరిచారంతా. కానీ సీన్ సితార్ కావడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇలా.. అలయ్ బలయ్ అనుకున్నారో లేదో అలా మొదలైంది అసలు సిసలు రగడ. నోటితో పలకరింపులు.. నొసటితో వెక్కిరింపులు.. ప్రశాంతత మొత్తం చెదిరిపోయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒకరి తర్వాత మరొకరు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ టైమ్‌లో నరేష్‌-ప్రకాష్‌ రాజ్‌లు ఎదురుపడ్డారు. ఆ టైమ్‌లో ఏం జరిగిందో.. ఎవరేం మాట్లాడారో తెలియదు. కానీ ఉన్నపళంగా మోనార్క్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. నోటికి పనిచెప్పారు. ఆవేశంగా మాట్లాడారు. ప్రకాష్‌ కోపంతో మాట్లాడుతుంటే పక్కనే ఉన్న శ్రీకాంత్‌, ఉత్తేజ్‌లు టెన్షన్ పడ్డారు. ప్రకాష్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు.

మోనార్క్‌ మంటలకు ముందు పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్ అలజడి అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు వేసుకుని పోలింగ్ సెంటర్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. అదే సమయంలో మా సభ్యులు బయట కలియబడ్డారు. దీంతో గందరగోళం నెలకొంది. ఫైనల్‌గా రిగ్గింగ్‌ ఆరోపణల్ని రెండు ప్యానళ్లు కొట్టిపడేశాయి. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో కొరుకుడు వ్యవహారం కలకలం రేపింది. శివబాలాజీ మోచేయిని హేమ కొరికింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. శివబాలాజీకి అయిన గాయాన్ని చేయి పట్టుకుని అందరికీ చూపించారు. అయితే ఈ విషయంలో శివబాలాజీ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ హేమ మాత్రం ఏం జరిగిందో తననే అడిగాలన్నారు.

హేమ-శివబాలాజీ ఎపిసోడ్‌ అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి శివబాలాజీ జరిగిందంతా ప్రకాశ్‌ రాజ్‌కి వివరించినట్టు తెలిసింది. తన చేయి చూపిస్తూ ఏదో చెబుతున్నట్టు కనిపించింది. అయితే ప్రకాష్‌ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. అదే సమయంలో శివబాలాజీ భార్య మధుమిత శానిటైజర్‌ తీసుకొచ్చి ఆయన మోచేయికి స్ప్రే చేశారు.

పొలింగ్‌ ప్రశాంతంగా సాగినప్పటికీ మధ్య మధ్యలో సభ్యుల అరుపులు, కేకలు, విరుపులు కనిపించాయి. ముఖ్యంగా ప్రగతి ఆసాంతం చిరాకు ప్రదర్శించింది. తెలియని ఆగ్రహంతో రగిలిపోతూ ఎవరిపైనో కోపాన్ని చూపించారు. పోలింగ్‌లో లాఠీలకు పని చెప్పారు పోలీసులు. క్రౌడ్ ఎక్కువగా ఉండటం, కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. ఓటు వేసేందుకు హీరో అఖిల్ రావడంతో ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో వారిని అక్కడినుంచి చెదరగొట్టారు పోలీసులు.

నిజానికి నటీనటుల నటనా కౌశల్యాన్ని ఇన్నాళ్లు రీల్‌లోనే చూశాం. కానీ రియల్‌ లైఫ్‌లో ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారో రియల్‌గా చూశారంతా. కోపం, చిరాకు, అసహ్యం, అసహనం ఇలా అన్ని పోలింగ్ ఫ్రేమ్‌లో కనిపించాయి. ప్రచారంలోనే కాదు… పోలింగ్‌లోనూ మంటలు కొనసాగాయ్. జనరల్ ఎలక్షన్స్‌ను మించి సాగిన మా ఎన్నికల్లో తోపులాటలు, తన్నులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ముగిసే చివరి క్షణం వరకు ఇరువర్గాల మధ్య హైఓల్టేజ్ వార్ నడిచింది.

Also Read: ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు… స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్

‘మా’ క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.