Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం అడిగిన దాంట్లో తప్పు లేదుగా.. మనకెందుకు లేదు అక్కడ ఇంపార్టెన్స్..?
తమిళ హీరోలకు తెలుగులో లభించే ఆదరణ మన హీరోలకు తమిళనాడులో ఎందుకు దక్కదన్న ప్రశ్నను కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ముందుకు తెచ్చారు. ‘K Ramp’ టీజర్ లాంచ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ..

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన అడిగిన ప్రశ్న చాలా మందికి కొత్త అనుమానాలు వచ్చేలా చేస్తుంది. తెలుగులో తమిళ హీరోలకు ఉండే ఆదరణ.. మన హీరోలకు తమిళనాడులో ఎందుకు దక్కదన్నది ఆయన ప్రశ్న. సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల వరకు చాలా మందిలో ఉన్న అనుమానమే ఇది. ఇటీవల ‘K Ramp’ సినిమా టీజర్ లాంఛ్ సందర్భంగా కిరణ్ ఈ వ్యాఖ్యలు చేసాడు. ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అంత భారీగా థియేటర్లు, హైప్ వచ్చినట్టే.. తన సినిమాకు ఎందుకు అలాంటి అవకాశం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ తమిళ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు.
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మార్కెట్ తెచ్చుకున్నాడు ప్రదీప్. ఆయనొక్కడే కాదు.. శివ కార్తికేయన్, కార్తీ లాంటి హీరోలకు తెలుగులో క్రేజ్ పెరిగిపోతుంటే.. ఇలాంటి గ్రాండ్ రిలీజ్‌లు మన తెలుగు హీరోలకు మాత్రం తమిళనాడులో రాకపోవడం ఇండస్ట్రీలో అసంతృప్తిని పెంచుతుంది. ఇది కేవలం తెలుగు సినిమాలపై చిన్న చూపు తప్ప.. వాస్తవానికి అక్కడి థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూషన్స్‌లో కొన్ని సంస్థలు ఎంతవరకు తెలుగు సినిమాలకు అవకాశాలిస్తారన్నదానిపై ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళ ఇండస్ట్రీలో బేసిక్‌గానే తమ సొంత సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ తెలుగులో అలా కాదు.. అన్ని సినిమాలను ఇక్కడ ఆదరిస్తుంటారు.
ఇప్పుడు కిరణ్ అడుగుతున్నది కూడా అదే. మనం వాళ్లను అంత బాగా ఆదరిస్తున్నపుడు మనల్ని ఎందుకు వాళ్లు పట్టించుకోరు అని..? గతేడాది ‘క’ సినిమా సమయంలోనే తనకు ఇది ఎదురైందని చెప్పాడు కిరణ్. ప్యాన్ ఇండియన్ రిలీజ్ అనుకున్నా కూడా.. కేవలం థియేటర్లు లేని కారణంగానే తన సినిమాను తెలుగుకే పరిమితం చేసానన్నాడు కిరణ్ అబ్బవరం. దివాళికి అందరికంటే ముందే కే ర్యాంప్ సినిమా వస్తుందని చెప్పామని.. కానీ ఇప్పుడు మరో మూడు నాలుగు సినిమాలు పోటీకి వచ్చేసాయని.. ఇప్పుడు కూడా థియేటర్స్ గోల తప్పదంటున్నాడు ఈ కుర్ర హీరో. డబ్బింగ్ సినిమాలు వచ్చినపుడు కూడా మన వాళ్లు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారని చెప్పాడు కిరణ్. మనకు కూడా అక్కడ అదే స్థాయి ఆదరణ రావాలనేది ఈ హీరో కోరుకునేది. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




