Shiva Rajkumar: క్యాన్సర్‌ను జయించిన శివన్న.. మళ్లీ సినిమాల్లో నటించడంపై ఏమన్నారంటే?
కొత్త సంవత్సరం సందర్భంగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తన అభిమానులకు శుభవార్త అందించారు. సర్జరీ కోసం అమెరికా వెళ్లిన శివన్న.. తొలిసారి అభిమానులకు కనిపించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను అందరితో పంచుకున్నారు. తన ఆరోగ్యం ఎలా ఉంది? ఇండియాకు ఎప్పుడు తిరిగి వస్తారు? తదితర విషయాలను ఆయనే స్వయంగా చెప్పారు.
క్యాన్సర్ తో బాధపడుతున్నకన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్దిరోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్‌కుమార్, నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు, న్యూ ఇయర్ సందర్భంగా, శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్ ..శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్టులు నెగెటివ్ గా వచ్చాయి. పాథాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగెటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరువలేనని భావోద్వేగంతో అన్నారామె.
అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నేను అనారోగ్యంతో ఉన్న సమయంలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. కీమో తీసుకుంటూనే ఫైట్ సీన్‌లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడి డాక్టర్లు, నర్సులు తనను బాగా చూసుకున్నారు’ అని అన్నారు. పలువురి పేర్లను ప్రస్తావించి శివన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉంటోన్న సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న.
‘క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. మీరు మాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మొదటి కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు. గతంలో కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తాను. డ్యాన్స్ లు, ఫైట్స్ తో అలరిస్తాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు’ అని శివరాజ్ కుమార్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
శివన్న ఎమోషనల్ వీడియో..
ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ, ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿ ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು! #2025 pic.twitter.com/4oyg2uXfjg
— DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.