AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Actress: టాలీవుడ్‌పై హీరోయిన్ల విమర్శలు.. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకో మరి..?

టాలీవుడ్‌లో అవకాశాలు దొరికినప్పుడు స్టార్‌డమ్‌ను ఆస్వాదించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాక తెలుగు పరిశ్రమపై విమర్శలు చేయడం కొంతమంది హీరోయిన్లకు అలవాటైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి కమర్షియల్ సినిమాల ద్వారానే గుర్తింపు పొందిన వారు, ముంబై వెళ్లాక టాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడటం తెలుగు ప్రేక్షకుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఎదిగిన నిచ్చెనను తన్నేస్తున్నారన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా వ్యక్తమవుతోంది.

Bollywood Actress: టాలీవుడ్‌పై హీరోయిన్ల విమర్శలు.. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకో మరి..?
Taapsee Radhika Apte
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 24, 2026 | 6:01 PM

Share

టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి, ఇక్కడి అవకాశాలతో స్టార్ డమ్ ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లాక తెలుగు ఇండస్ట్రీపై విమర్శలు చేయడం కొంతమంది హీరోయిన్లకు పరిపాటిగా మారింది. తాప్సీ పన్ను, రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు ఈ జాబితాలో ముందుంటారు. ఇండస్ట్రీలో ఎవరూ అవకాశాలు ఇవ్వని రోజుల్లో.. వాళ్లలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి, ప్రేక్షకులకు పరిచయం చేసింది తెలుగు సినీ పరిశ్రమే. ఇక్కడి కమర్షియల్ సినిమాల ద్వారానే వాళ్ళు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్‌లో కాస్త నిలదొక్కుకోగానే.. తాము ఎదిగిన నిచ్చెనను తన్నేస్తూ, అక్కడి వేదికల మీద కూర్చుని టాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడటం తెలుగు ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకప్పుడు ఇక్కడి మేకర్స్ ఇచ్చిన అవకాశాలను పూర్తిగా వాడుకున్న వీరు.. తీరా ముంబై వెళ్లాక సడెన్‌గా మేధావులుగా మారిపోయి తెలుగు ఇండస్ట్రీపై పగబట్టినట్లు కామెంట్స్ చేయడం స్పష్టమైన అవకాశవాదమే అనిపించుకుంటుంది.

ఈ వ్యవహారంలో ప్రేక్షకులను ఎక్కువగా బాధించే విషయం వీళ్ళు చూపిస్తున్న డబుల్ స్టాండర్డ్స్. బాలీవుడ్‌లో బికినీలు వేసినా, అత్యంత బోల్డ్ సన్నివేశాల్లో నటించినా దాన్ని ‘కథ డిమాండ్ చేసింది’, ‘అది మా ప్రొఫెషనలిజం’ అంటూ గొప్పగా కవర్ చేసుకుంటారు. కానీ టాలీవుడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్యాడింగ్ బ్రాల గురించి, బమ్ సైజుల గురించి, నాభి మీద కొబ్బరికాయలు వేయడం గురించి పదే పదే విమర్శలు చేస్తుంటారు. తాప్సీ తనను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుపై చేసిన కామెంట్స్ గానీ, రీసెంట్ గా రాధికా ఆప్టే టాలీవుడ్ పురుషాధిక్యత పైనా, సౌత్ దర్శకులు తనను ప్యాడింగ్స్ వాడాలని ఇబ్బంది పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు గానీ ఈ కోవలోనివే. బాలీవుడ్‌లో గ్లామర్ ఒలకబోస్తే అది ‘మోడ్రనిజం’ అని.. ఇక్కడ చేస్తే మాత్రం ‘ఆబ్జెక్టిఫికేషన్’ అంటే హీరోయిన్లను ఒక వస్తువుగా చూడటం అని ముద్ర వేయడం కచ్చితంగా హిపోక్రసీనే అంటున్నారు విశ్లేషకులు.

వీళ్ళ విమర్శల్లో మరో ప్రధాన లోపం వాళ్ళ టైమింగ్. అవకాశాలు లేని కొత్తలో, కెరీర్ బిల్డ్ చేసుకునే సమయంలో ఈ హీరోయిన్లకు ఇక్కడి ప్యాడింగ్స్ గానీ, గ్లామర్ ట్రెండ్స్ గానీ అంత తప్పుగా అనిపించలేదు. ఆ సమయంలో అవకాశాలు, డబ్బు, స్టార్ స్టేటస్ అన్నీ కావాలి కాబట్టి సైలెంట్‌గా ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్‌కు తలవూపి నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో నెట్‌వర్క్ పెరిగి.. అక్కడ లేడీ ఓరియెంటెడ్ లేదా సీరియస్ రోల్స్ దక్కగానే, తమ గత సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఒకవేళ ఆరోజు ఆ దర్శకులు చేసిన విధానం నచ్చకపోతే, అప్పుడే ఆ పాత్రలను వదులుకునే ధైర్యం చేసి ఉండాలి లేదా సెట్స్‌లో ప్రశ్నించి ఉండాలి. అంతేకానీ ఇక్కడి రెమ్యునరేషన్లను జేబులో వేసుకుని, ఆ తర్వాత బాలీవుడ్ మీడియా ముందు కూర్చుని ఇక్కడి మేకర్స్‌ను కించపరచడం కేవలం పబ్లిసిటీ స్టంట్ లాగే కనిపిస్తుందనేది ఫ్యాన్స్ వాదన కూడా.

ఈ విమర్శల వెనుక ఉన్న కొంత వాస్తవిక కోణాన్ని కూడా విశ్లేషించాలి. ఒకప్పుడు సౌత్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్ లాగే చూసిన మాట వాస్తవం. హీరోయిన్ల శరీర భాగాలను హైలైట్ చేయడం, వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కొన్నిసార్లు ప్యాడింగ్స్ లాంటివి వాడాలని ఒత్తిడి చేయడం లాంటి చేదు నిజాలు తెరవెనుక ఉన్నాయి. కానీ ఇది కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన సమస్య కాదు. బాలీవుడ్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం, మహిళలను ఐటెమ్ సాంగ్స్ పేరుతో వాడుకోవడం అనేవి కోకొల్లలు. బాలీవుడ్ తమ గ్లామర్‌ను కాస్త క్లాస్‌గా, కార్పొరేట్ స్టైల్‌లో ప్యాకేజ్ చేసి అమ్ముతుంది; మనవాళ్లు కాస్త రఫ్‌గా, మాస్ ఆడియన్స్‌కు తగ్గట్లు చూపిస్తారు.. బహుశా అంతే తేడా. అలాంటప్పుడు రెండు చోట్లా ఉన్న నెగిటివ్స్‌ను వదిలేసి, కేవలం సౌత్ ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేస్తూ బాలీవుడ్ తప్పులను కప్పిపుచ్చడం వల్లే వీళ్ళు విమర్శల పాలవుతున్నారు.

చివరగా చెప్పాలంటే.. ఒక నటిగా సమాజంలో ఉన్న వివక్షను, సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రశ్నించడం తప్పు కాదు.. అది స్వాగతించదగ్గ పరిణామమే. కానీ ఆ పోరాటం అన్ని ఇండస్ట్రీలకు ఒకేలా వర్తించాలి. బాలీవుడ్‌ను తలపై పెట్టుకుని, తమకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్‌ను కించపరచడం ద్వారా వీళ్లు సాధించేది ఏమీ లేదు. నేడు టాలీవుడ్ ఎంతో అప్డేట్ అయింది, గ్లోబల్ స్థాయిలో పాన్-ఇండియా సినిమాలతో బాలీవుడ్‌కే సవాల్ విసురుతోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న ఎన్నో అద్భుతమైన కథలు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాత విషయాలను పదే పదే తవ్వుతూ, బాలీవుడ్ బికినీలను వెనకేసుకొస్తూ.. టాలీవుడ్ ప్యాడింగ్స్‌ను విమర్శించడం వాళ్ళ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందనేది కాదనలేని వాస్తవం. ఏ ఇండస్ట్రీ అయినా గౌరవం ఇవ్వాలి, పనికి తగ్గ ప్రతిఫలం తీసుకున్నప్పుడు ఆ వ్యవస్థపై కనీస కృతజ్ఞత ఉండాలి.. అంతే తప్ప లైఫ్ ఇచ్చిన చోటే బురద జల్లడం అనేది ఎప్పటికీ సమర్థనీయం కాదు.

Follow Us