AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ . టికెట్ రేట్స్ పెంచే విషయంలో చర్చ జరిగింది. ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డ్స్ విషయంలో ఇప్పటికే ఏర్పాటైన నర్సింగ్ రావు కమిటీ సిఫార్సులపై ఇండస్ట్రీ రెస్పాన్స్‌పై చర్చ జరిగింది

Revanth Reddy: మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2024 | 12:50 PM

Share

సినీ ప్రముఖుల భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌కి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్‌ ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండబోమని తేల్చి చెప్పారు.  శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌.. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. తెలంగాణ రైజింగ్‌లో బిజినెస్‌ మోడల్‌ని తీసుకెళ్దామన్నారు భట్టి

ప్రజల భద్రత తమకు అత్యంత ముఖ్యం అంటున్నారు డీజీపీ జితేందర్‌. షోలు నిర్వహించేప్పుడు ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలంటున్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకోవచ్చు, అయితే అందులో ఉన్న షరతులు కూడా పాటించాలన్నారు. బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్రమైన ఆందోళన ఉందన్న డీజీపీ బౌన్సర్లు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ డీజీపీ హెచ్చరించారు. అలాగే ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు దగ్గుబాటి సురేష్‌బాబు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్ అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలన్నారు సురేష్‌బాబు. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందన్నారు త్రివిక్రమ్‌.

అదేవిధంగా ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు అల్లు అరవింద్. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూస్తామన్నారు. తెలుగు నిర్మాతలకు ఈరోజు శుభదినమన్నారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్‌ డెస్టినేషన్‌ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు అల్లు అరవింద్‌. ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్నారు మురళీమోహన్‌. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందన్నారు. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి, ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామన్నారు.

అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారన్నారు రాఘవేంద్రరావు. రేవంత్ సర్కార్‌ కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటోందన్నారు. గతంలో చిల్డ్రన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను చంద్రబాబు హైదరాబాద్‌లో నిర్వహించారని.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు సీఎంతో సమావేశంలో నాగార్జున. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్‌సెంటివ్‌లు ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు నాగార్జున. హైదరాబాద్ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. మొత్తం 46 మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.