Tatapudi Subbarayashastri: వయోలిన్ విద్యాంసుడు తాతపూడి సుబ్బరాయశాస్త్రి కన్నుమూత..
1930లో జన్మించిన సుబ్బరాయశాస్త్రి మహేంద్రవాడ బాపన్నశాస్త్రి, మహేంద్రవాడ కామేశ్వరరావుగార్ల వద్ద సంగీత పాఠాలను అభ్యసించారు..
ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు తాతపూడి సుబ్బరాయశాస్త్రి (92) ఇకలేరు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. సుబ్బరాయశాస్త్రి కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందినవారు.. సంగీతంలో సుబ్బరాయశాస్త్రి అందె వేసిన చేయి..1930లో జన్మించిన సుబ్బరాయశాస్త్రి మహేంద్రవాడ బాపన్నశాస్త్రి, మహేంద్రవాడ కామేశ్వరరావుగార్ల వద్ద సంగీత పాఠాలను అభ్యసించారు.. ప్రముఖ కళాకారులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వంటి వారికి వాయిద్య సహకారం అందించిన వయోలిన్ పండితుడుగా నిలిచాడు. సంగీత కళాశాలలలో ఉద్యోగం చేస్తూ దేశవ్యాప్తంగా అనేక మందిని వీరి శిష్యులుగా తయారు చేశారు. ప్రస్తుతం ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారు దేశవ్యాప్తంగా 100 మందికి పైగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
రామచంద్రపురం, అమలాపురం, యానాం,బండారులంక,హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సంగీత విద్యార్థులకు సంగీత శిక్షణ ఇచ్చారు సుబ్బరాయశాస్త్రి. ప్రముఖ సంగీత కళాకారులకు ఈయన సహకార వాయిద్యాన్ని అందించారు. సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీ కృష్ణ చేత సత్కారం అందుకున్నారు. ప్రఖ్యాత వీణా విద్వాంసుడు ద్విభాష్యం నగేష్ బాబుకు కూడా ఈయన వద్దనుంచి మెలకువలు నేర్చుకున్నారు. ఆయనకు సునాద విద్వన్మణి, సువాయులీనాచార్య తదితర బిరుదులు ఉన్నాయి. అనేక కచేరీల్లో బంగారు కంకణాలను పొందారు. ఈయనకు ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. సుబ్బరాయశాస్త్రి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.