Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edida Nageswara Rao: తీసిన 10 సినిమాలు కళా ఖండాలే.. మన ప్రభుత్వాలు గుర్తించని గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వర రావు వర్ధంతి నేడు

Edida Nageswara Rao: రాశి కంటే వాసి ముఖ్యమన్న నిర్మాత. తాను నిర్మించిన సినిమాలతో తన అభిరుచికి అద్దంపట్టేలా.. సినీ కళామతల్లికి సేవలు చేసిన..

Edida Nageswara Rao: తీసిన 10 సినిమాలు కళా ఖండాలే.. మన ప్రభుత్వాలు గుర్తించని గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వర రావు వర్ధంతి నేడు
Edida Nageswara Rao
Follow us
Surya Kala

|

Updated on: Oct 04, 2021 | 3:41 PM

Edida Nageswara Rao: రాశి కంటే వాసి ముఖ్యమన్న నిర్మాత. తాను నిర్మించిన సినిమాలతో తన అభిరుచికి అద్దంపట్టేలా.. సినీ కళామతల్లికి సేవలు చేసిన మహనీయుడు.. ప్రపంచ సినీ య‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు వర్ధంతి నేడు. తెలుగు సినిమా వ్యాపార ధోరణిని కాదంటూ.. ఉత్త‌మాభిరుచితో సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు 4, అక్టోబర్ 2015న స్వర్గస్తుల‌య్యారు.

పశ్చిమగోదావరి జిల్లా తణు కులో 1934 ఏప్రిల్‌ 24 ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. పాపలక్ష్మి, సత్తిరాజు నాయుడు తల్దిదండ్రులు. 1954లో మేనమామ కూతురు జయలక్ష్మిని వివాహ‌మాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.

నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సిరి సిరి మువ్వ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తర్వాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. ఉత్తమాభిరుచి ఉన్న ఏడిద నాగేశ్వర రావు.. 1979లో పూర్ణోద‌య సంస్థ‌ను స్థాపించారు. తన సినీజీవితంలో పదే పది సినిమాలను నిర్మించారు.  అయితే ఈ పది సినిమాలు కూడా కళాఖండాలు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన సంతకాలు. పూర్ణోదయ బ్యానర్ పై ఫస్ట్ తాయారమ్మ బంగారయ్యను నిర్మించారు. ఆపద్బాంధవుడు, స్వరకల్పన , స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం , సాగర సంగమం , సితార , సీతాకోకచిలుక , తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం , సిరిసిరిమువ్వ . ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 9 సినిమాల్లో అత్యధిక చిత్రాలు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం. ఏడిద నాగేశ్వరరావు శంకరాభరణంతో ఖండాంతరంగా ఖ్యాతిగాంచారు.  శంకరాభరణం సినిమాతో జాతీయ పురష్కారం ‘స్వర్ణ కమలం’ అందుకున్నారు. అంతేకాదు శంకరాభరణం మూవీ కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ సినిమాకి ఉత్త‌మ చిత్రంగా అవార్డు అందుకుంది.

కమర్శియల్‌ సినిమా హవా నడుస్తోన సమయంలో శంకరాభారం పెను సంచలనం సృష్టించింది. దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. కమల్‌హాస‌న్‌ నటించిన ‘సాగరసంగమం’ తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అందించింది. ఉత్తమ న‌టుడిగా కమల్‌, ఉత్త‌మ గాయనిగా జానకి నంది అవార్డులు అందుకున్నారు. చిరంజీవితో  ‘స్వయం కృషి’ సినిమా నిర్మించారు. తెలుగోడు త‌లెత్తుకునేలా ఈ సినిమా రష్యన్‌ భాషలోకి అనువాదమైంది. తర్వాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు శ్రీరామ్‌ హీరోగా నటించిన ‘స్వరకల్పన’ కూడా రష్యన్‌ భాషలోకి అనువాదమైంది. చిరంజీవి నటించిన మరో చిత్రం ‘ఆపద్భాందవుడు’ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక కాగా, నంది ఉత్తమ నటుడిగా చిరంజీవి రెండవ సారి ఎంపికయ్యారు.

మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాత.. తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన వ్యక్తికి ఏడిద నాగేశ్వర రావుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వలేదు.. దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. ఓర‌కంగా ప్రభుత్వాల కంటే ప్ర‌యివేటు సంస్థ‌లే ఏడిద సినీ అభిరుచిని గౌరవించాయి . కళా సాగర్ వారు దశాబ్తపు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, ‘సంతోషం’ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి.  ప్రభుత్వాలు గుర్తించకపోయినా ఆయన నిర్మించిన సినీ కళాఖండాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని తీపిజ్ఞాపకంగా కలకాలం ఉండిపోతారు అనడంలో సందేహం లేదు.

Also Read:  నాకు గన్ మెన్లు తగ్గించారు.. ఆ తేదీ వస్తుందంటే అనుమానం వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటెల సంచనలన కామెంట్స్