Chiru-Balayya: ఫ్యాన్స్ పూనకాలకు సిద్దమవ్వండి.. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు లెజెండ్స్.. అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చిన మాట
టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ కాంబినేషన్ సెట్ కాబోతోందా? మునుపెన్నడూ చూడని మల్టీస్టారర్ మనముందుకొస్తోందా? ఆహా అన్‌స్టాపబుల్‌లో అల్లు అరవింద్ కామెంట్ చాలామందిలో క్యూరియాసిటీని పెంచింది. ఒకవేళ అరవింద్ చెప్పిన కాంబినేషన్ గనుక సెట్ అయితే.. టాలీవుడ్ రికార్డులు బద్దలైపోవచ్చు. అట్లుంటది అల్లుతోని.
ఇద్దరూ లెజెండ్సే. ప్రస్తుతం తెలుగు సినిమాలో టాప్ 2 ర్యాంక్స్ ఈ ఇద్దరివి. అరవైల్లోనూ యువ హీరోలతో పోటీపడి మరీ.. సినిమాలు చేస్తున్నారు. పాటలు, ఫైట్ల అంటూ దుమ్మురేపుతున్నారు. కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారు ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు. సినిమాల్లోకి వచ్చి 40ఏళ్లవుతున్నా.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి చేసిన సినిమా లేదు. కథ కుదరకనో.. కాంబినేషన్లు సెట్ అవ్వకనో మరి ఇప్పటివరకు బాలయ్య, చిరంజీవి కలిసి సినిమా తీయలేకపోయారు. కాని.. ఇప్పడు సాధ్యపడుతుందా? అల్లు అరవింద్ ఆహా అన్‌స్టాపబుల్‌లో ఏం చెప్పారు?
అవును.. 40 ఏళ్లలో సాధ్యం కానిది. ఇప్పుడు సాధ్యపడుతుందా అన్నదే ప్రధాన ప్రశ్న. ఈ కాంబినేషన్ సెట్ అయితే అటు అభిమానులు.. ఇటు సినీ ఇండస్ట్రీలో పండగే. ఒకే వేదికపై చిరు, బాలయ్యని చూస్తేనే అంతా పండగ చేసుకుంటారు. అలాంటిది ఒకే సినిమాలో.. అదీ ఫ్రేమ్‌లో ఈ ఇద్దరు స్టార్లను ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తాయి. అల్లు అరవింద్ నవ్వుతూ అన్నా.. సీరియస్గా ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. మొన్ననే గాడ్‌ఫాదర్‌తో అదరగొట్టిన చిరు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య అంటూ మెగా సంబరానికి రెడీ అయ్యారు. బాలయ్యది కూడా అలాంటి సెకండ్ ఇన్నింగ్సే అని చెప్పొచ్చు. సింహా, లెజెండ్, అఖండ అంటూ బడా హిట్లు ఇచ్చారు. ఇప్పుడు వీరసింహారెడ్డి సంక్రాంతికి రెడీ అయింది. ఈ ఇద్దరు చాలా ఏళ్ల తర్వాత సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. ఎవరు పైచేయి సాధిస్తారో అన్న లెక్కల్లో ఫ్యాన్స్ ఉండగానే.. అల్లా అరవింద్ పేల్చిన ఈ బాంబ్ మామూలుగా లేదు.
బ్లాక్ అండ్ వైట్ కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు సర్వసాధారణం. పెద్ద స్టార్లైన ఎన్టీఆర్ – ఏఎన్నార్, ఎన్టీఆర్ – కృష్ణ, ANR – కృష్ణ.. అంతేకాదు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు ఇలా తొలి రెండు తరాల హీరోలు మల్టీస్టారర్స్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. సినిమా కథలు కూడా అలానే ఉండేవి. కథ, కథనాన్ని నమ్ముకునే ఈ సినిమాలు తెరకెక్కేవి. అలా హీరోలు కూడా ఎలివేట్ అయ్యారు. ఏమాత్రం ఇగోలకు వెళ్లకుండా మల్టీ స్టారర్స్ చేశారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి 14 మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కాని తర్వాతి తరానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున జనరేషన్ అసలు మల్టీస్టారర్ జోలికి వెళ్లలేదు. ఈ నలుగురు హీరోల్లో ఏ ఇద్దరూ కలిసి నటించలేదు. అవసరమైతే.. డబుల్ రోల్స్ చేసుకున్నారేగాని.. కాంబినేషన్ సెట్ చేసుకోలేదు. అడపా దడపా వీరికి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనా.. కథలు దొరకలేదు అని సమాధానాన్ని దాటవేసే వారు. ఇక తర్వాతి జనరేషన్‌లో మాత్రం కొన్ని కాంబినేషన్స్ సెట్ అయ్యాయి. పవన్- వెంకటేష్, మహేష్ – వెంకీ, ఎన్టీఆర్ – చరణ్ ఇలా మల్టీస్టారర్స్ తీశారు.
యువహీరోల కాంబినేషన్లు ఓకే గాని.. అభిమానులకు కిక్కిచ్చే చిరు-బాలయ్య కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు. ఇప్పుడు బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ ఇద్దర్నీ కలిపి సినిమా తీయాలనేది తన కోరిక అంటున్నారు. బాలయ్య సై అంటున్నారు. ఇదే షోలో లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. మరి రాఘవేంద్రుడే వీరిద్దరికి కథను సెట్ చేస్తారా? లేక రాజమౌళి లాంటి డైరెక్టర్ వస్తారా? చిరు బాలయ్యని బ్యాలెన్స్ చేయాలంటే కథలోనే కాదు.. కథనంలోనూ అంతే బలం ఉండాలి. అల్లు అరవింద్ సీరియస్‌గా ట్రై చేస్తే.. చిరు-బాలయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది అభిమానులు బలంగా చెబుతున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.