AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 2 Movie Review: ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీగా హిట్ 2.. ఫుల్ రివ్యూ

సెకండ్ కేస్ పేరుతో శైలేష్ కొలను చేసిన సినిమా హిట్ 2. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తాజాగా విడుదలైంది.

HIT 2 Movie Review: ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీగా హిట్ 2.. ఫుల్ రివ్యూ
Hit 2
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 02, 2022 | 1:04 PM

Share

సినిమా రివ్యూ: హిట్ -2

న‌టీన‌టులు: అడివి శేష్, మీనాక్షి చౌద‌రి, ప్రత్యేక పాత్రలో నాని, కోమ‌లి ప్ర‌సాద్, సుహాస్, శ్రీనాత్ మాగంటి, రావు ర‌మేష్,

పోసాని, త‌నికెళ్ల భ‌ర‌ణి తదితరులు

ఇవి కూడా చదవండి

సంగీతం: సురేష్ బొబ్బిలి. ఎంఎం. శ్రీలేఖ‌

ఎడిటర్: గ్యారీ బిహెచ్

సినిమాటోగ్రఫర్: మణికందన్

నిర్మాత: నాని

దర్శకుడు: శైలేష్ కొల‌ను

విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. అలా వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. తాజాగా హిట్ కొనసాగింపుగా.. సెకండ్ కేస్ పేరుతో శైలేష్ కొలను చేసిన సినిమా హిట్ 2. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

KD అలియాస్ కృష్ణదేవ్ (అడివి శేష్) హిట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. వైజాగ్‌లో హాయిగా తన డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. ఆర్య (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో ఉంటాడు. ఇద్దరూ సహ జీవనం చేస్తుంటారు. పర్సనల్, ప్రొఫెషనల్‌గా సాఫీగా సాగిపోతున్న కేడీకి వైజాగ్‌లో ఓ మర్డర్ కేసు వస్తుంది. సంజన అనే అమ్మాయిని అతి దారుణంగా ముక్కలు ముక్కలు చేసి చంపేస్తాడు ఓ సైకో. ఆ కేసులో తల మాత్రమే సంజనది అయితే.. బాడీ పార్ట్స్ మిగిలిన వాళ్లవి అని తెలుస్తాయి. అప్పుడు తన టీం (కోమలి ప్రసాద్, శ్రీకాంత్ మాగంటి)తో కలిసి కేసు ఇన్వెస్టిగేట్ మొదలు పెడతాడు. మరి ఈ కేసులో కేడీకి లీడ్ ఎలా దొరికింది.. అసలు ఈ మర్డర్ చేసిందెవరు..? హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ..

కథనం:

సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ కొత్తేం కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనే బోలెడన్ని వచ్చాయి. చిన్న పాయింట్ చుట్టూ వాటిని అల్లేస్తుంటారు దర్శకులు. హిట్ 2 కూడా అలా రాసుకున్న కథే.. కథంతా క్లైమాక్స్‌లో చిన్న చిక్కుముడితో విడిపోతుంది. ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ అన్నపుడు కచ్చితంగా ఆ ప్రెజర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి.. అంచనాలు అందుకుంటేనే రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. ఈ విషయంలో ‘హిట్’ దర్శకుడు శేలేష్ కొలనును మెచ్చుకోవాల్సిందే. ‘హిట్’ అనే యూనివర్స్ క్రియేట్ చేసి.. రెండోసారి సక్సెస్ ఫుల్‌గా కేస్ సాల్వ్ చేసారు ఈ దర్శకుడు. దానికి అడివి శేష్ లాంటి నటుడు తోడు కావడంతో.. దర్శకుడి పని సగం ఈజీ అయిపోయింది. ఫస్టాఫ్ అంతా సస్పెన్స్‌తోనే నడిచిపోతుంది.. అందరిపై అనుమానాలు వచ్చేలా కథ రాసుకున్నాడు. ఓ దశలో హీరోయిన్‌పై కూడా అనుమానాలు వచ్చేస్తుంటాయి. మంచి ట్విస్టుతో ఇంటర్వెల్‌ కార్డ్ పడుతుంది.

అప్పటి వరకు ఉన్న కథ అంతా ఒక్కసారిగా మరింత ఆసక్తికరంగా మారిపోతుంది. సెకండాఫ్‌లో తొలి అరగంట సస్పెన్స్ డ్రామా ఆకట్టుకుంటుంది. మర్డర్ చేసిందెవరు.? అనే కోణంలో కేడీ అండ్ టీం చేసే ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా సాగుతుంది. ఇంత సస్పెన్స్ ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం ఎందుకో అంతగా అంచనాలు అందుకోలేదనిపించింది. ముందు జరిగిన మిస్టరీ డ్రామాకు.. క్లైమాక్స్ తేలిపోయినట్లు అనిపించింది. చిన్న పాయింట్ చుట్టూ కథనంతా ముడి పెట్టేసాడు. హిట్ 2లోని కేసుకు.. మొదటి భాగంలో విశ్వక్ సేన్ టేకప్ చేసిన కేస్ సీన్స్ యాడ్ చేయడం దర్శకుడి బ్రిలియన్స్ చూపిస్తుంది. మధ్యలో విశ్వక్ సేన్ రావడం.. చివర్లో నాని రావడంతో హిట్ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగిపోయింది.

నటీనటులు:

అడివి శేష్ మరోసారి అద్భుతంగా నటించాడు.. స్క్రీన్ మీద హిట్ ఆఫీసర్‌గా సూపర్ హిట్ అయ్యాడు. పోలీస్ డ్రామాలకు తానెందుకు పర్ఫెక్ట్ అనేది మరోసారి నిరూపించాడు శేష్. ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది. మీనాక్షి చౌదరి బాగుంది.. కీలకపాత్రలో కోమలి ప్రసాద్ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో మరో కీలక పాత్రలో ‘కలర్ ఫోటో’ సుహాస్ అద్భుతంగా నటించాడు. తాను కేవలం కామెడీ కోసమే కాదని.. సినిమా సినిమాతో నిరూపిస్తున్నాడు ఈయన. ఈ సినిమాతో కంప్లీట్ నటుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. శ్రీకాంత్ మాగంటి యాక్షన్ బాగుంది. రావు రమేష్, తణికెళ్ళ భరణి ఉన్నంతలో బాగా చేసారు.

టెక్నికల్ టీం:

హిట్ 2 సినిమాలో ఉన్న ఒక్క పాట బాగుంది. ఉరికే ఉరికే రొమాంటిక్‌గానే కాకుండా.. విజువలైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా నీట్‌గా ఉంది. రెండు గంటలు చాలా షార్ప్‌గా కట్ చేసారు. సినిమాటోగ్రఫీ వర్క్ రిచ్‌గా ఉంది. నాని ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు పేరు పెట్టాల్సిన పనిలేదు. దర్శకుడు శేలేష్ కొలను కథ సింపుల్‌గానే తీసుకున్నా.. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని చెప్పలేం కానీ మంచి ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ అయితే ఇచ్చాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా హిట్ 2.. అడివి శేష్ మార్క్ ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ డ్రామా..