ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ క్షమాపణలు.. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తన భావం అది కాదంటూ వివరణ..

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Dec 02, 2022 | 3:16 AM

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను వల్గర్ ప్రాపగాండ మూవీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెలీ దర్శకుడు, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్ నడవ్ లాపిడ్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. 1990వ సంవత్సరంలో..

ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ క్షమాపణలు.. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తన భావం అది కాదంటూ వివరణ..
Nadav

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను వల్గర్ ప్రాపగాండ మూవీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెలీ దర్శకుడు, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్ నడవ్ లాపిడ్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. 1990వ సంవత్సరంలో ట్రాజెడీకి బలైన కశ్మీరీ పండిట్లు, వలస వెళ్లిన పండిట్లు, వారి బంధువులను తాను కించపరచలేదని, అలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఆ కోణంలో తన వ్యాఖ్యలను ఎవరైనా తీసుకుంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలతో బాధపడిన వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తాను ఎవరినీ అవమానించాలనుకోనని, అది తన ఉద్దేశం కాదని తెలిపారు. తన మాటలకు ఎవరైనా బాధపడితే అందుకు క్షమించాలని కోరారు. చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. గోవాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో అనేక ఇతర చిత్రాలతోపాటు ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీని కూడా ప్రదర్శించారు. ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌గా ఉన్న నడవ్‌ లాపిడ్ గత నెల 28వ తేదీన మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందానని, ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌, పలువురు ప్రముఖులు సోషల్‌ ఇజ్రాయోలీ దర్శకుడిపై మండిపడ్డారు. ఇజ్రాయెల్‌లోనూ నడవ్‌ కామెంట్లపై అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో నడవ్ లాపిడ్ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలు ఎవరినో బాధపెట్టాలని చేసినవి కాదన్నారు. తనకు అలాంటి దురుద్దేశం లేదని స్సష్టం చేశారు. అయితే కశ్మీరీ పండిట్లను లేదా వారి బంధువులను కించపరచడం లేదని, బాధితులను తాను గాయపరచ లేదని చెబుతూనే తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు.తనతో పాటు తోటి జ్యూరీ సభ్యులు కూడా ఆ సినిమా ఒక వల్గర్ ప్రాపగాండగానే చూశారని, అలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌‌లో ఈ సినిమా పోటీ పడటం సరికాదని, ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పమన్నా చెబుతానని అన్నారు. అయితే, తాను కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న విషాదం గురించి మాట్లాడటం లేదని స్పష్టం చేశారు.

కశ్మీరీ పండిట్ల పట్ల తనకు సానుభూతి ఉన్నదని తెలిపారు. తాను కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, ఘటన గురించి కాదని చెప్పారు. అలాంటి ఘటనపై సీరియస్ ఫిలిం ఉండాలని పేర్కొన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే సినిమాటిక్ మ్యానిపులేషన్‌లో ఉన్నదని చెప్పారు. వాయిలెన్స్, విద్వేషం చిమ్మడానికే ఈ సినిమాను వినియోగించుకున్నట్టు తామంతా భావించామని నడవ్ లాపిడ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్ టైన్ మెంట్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu