
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు ప్రముఖ నటి వై. విజయ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించారు వై. విజయ. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు వై. విజయ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించారు వై. విజయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ కెరీర్ గురించి, తన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేవిధంగా మహానటి సావిత్రి గారితో జరిగిన అనుభవాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. డాన్స్ నేర్చుకోవడం కోసం కడప నుంచి చెన్నైకి వచ్చిన వై. విజయ, తన 13వ ఏట ఊహించని విధంగా సినీ రంగంలోకి ప్రవేశించారు. తొలుత వెంపటి చిన్న సత్యం మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్న విజయ, కేవలం డాన్స్ నేర్చుకోవాలనే ఆకాంక్షతోనే సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
సినిమాల్లో నటించాలనే కోరిక లేకపోయినా, కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నిండు హృదయాలు చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత రామ విజేత ఫిలిమ్స్ ఒక కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు, ఎం.ఎస్. శైవ మాస్టర్ గారి సిఫార్సుతో వై. విజయ ఫోటో వెళ్లిందట. సుమారు 2000 మంది ఫోటోల నుంచి 13 ఏళ్ల వయస్సున్న వై. విజయను తల్లిదండ్రులు అనే చిత్రానికి ఎంపిక చేశారని తెలిపారు. ఈ చిత్రంలో నటుడు శోభన్ బాబుకు జోడీగా నటించారు విజయ. తన సినీ ప్రయాణంలో కుటుంబం నుండి అద్భుతమైన మద్దతు లభించిందని వై. విజయ పేర్కొన్నారు. షూటింగ్‌లకు తన తల్లి ఎప్పుడూ తోడు వచ్చేవారని, ఇంట్లో తన అక్కాచెల్లెళ్లు చిన్న తమ్ముళ్లను చూసుకునేవారని తెలిపారు.
అదేవిధంగా తల్లిదండ్రులు చిత్రంలో సావిత్రి గారితో కలిసి నటించేటప్పుడు జరిగిన ఒక సంఘటనను వై. విజయ గుర్తుచేసుకున్నారు. ఒక సన్నివేశంలో సావిత్రి గారు తనను కొట్టాల్సి ఉందని, ఆ సన్నివేశానికి ముందు విజయా, జాగ్రత్త! నాకు కోపం వచ్చి కొట్టానంటే నీ చెంప పగిలిపోతుంది అని సావిత్రి గారు హెచ్చరించారని తెలిపారు. ఆ సన్నివేశంలో సావిత్రి గారు నిజంగా కొట్టడంతో, చెవి వద్ద దెబ్బ తగిలి మూడు-నాలుగు సంవత్సరాల పాటు నొప్పి ఉండేదని వై. విజయ వివరించారు. సావిత్రి గారు పాత్రలో పూర్తిగా లీనమై జీవించే వ్యక్తిత్వం కలవారని, అలాగే ఆమె ఎంతో ఎమోషనల్ వ్యక్తి అని ఈ సంఘటన ద్వారా తెలుస్తుందని ఆమె అన్నారు. షూటింగ్‌లలో తాను చాలా సిగ్గుపడేదాన్ని అని, శోభన్ బాబు గారు తన వయస్సు, చదువు గురించి అడిగినప్పుడు కూడా సరిగా సమాధానం చెప్పలేకపోయానని గుర్తుచేసుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.