Actor Nani: అందరి ముందు నానిని అవమానించిన డైరెక్టర్.. మనోవేదనకు గురయ్యానన్న న్యాచురల్ స్టార్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాలు.. కొద్ది రోజులుగా తన వ్యాఖ్యలపై వస్తోన్న ట్రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ మొదట్లో తనను ఓ డైరెక్టర్ అందరి ముందు అవమానించాడని.. ఆ సమయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ చెప్పుకొచ్చారు.
అతి తక్కువ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్డమ్ సంపాదించుకున్నారు హీరో నాని. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన న్యాచురల్ స్టార్ .. ఇప్పుడు దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు . నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదేల రూపొందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మార్చి 30న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాలు.. కొద్ది రోజులుగా తన వ్యాఖ్యలపై వస్తోన్న ట్రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ మొదట్లో తనను ఓ డైరెక్టర్ అందరి ముందు అవమానించాడని.. ఆ సమయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ చెప్పుకొచ్చారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు కదా.. మొదట్లో ఏమైనా కష్టంగా అనిపించిందా ? అని విలేకరి అడగ్గా.. నాని స్పందిస్తూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కష్టంగా అనిపించిందని అన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. ఎలా జరుగుతుంది తనకు అర్థమయ్యేది కాదని.. ఆ సమయంలో సాయం చేయడానికి కూడా ఎవరూ లేరని అన్నారు. నేర్చుకుంటున్న సమయంలోనే అన్ని ఇబ్బందులు ఉంటాయని.. కానీ తర్వాత వచ్చే సక్సెస్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుందన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని.. చాలా మంది తనను తిరస్కరించారని అన్నారు. ఆ విషయాలు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదని అన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే.. అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుందని అన్నారు. ఎవరైనా సరే ఏదానా చెప్పేయవచ్చునని అనుకుంటారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని.. అయితే వారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా అన్నింటిని దిగమింగక తప్పదని అన్నారు. క్లాప్ బోర్ట్ ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారని .. మాటలు పడినందుకు తానెప్పుడూ బాధపడలేదని అన్నారు. కానీ ఓ దర్శకుడు మాత్రం సెట్ లో అందరి ముందు తనను అవమానించాడని.. ఎప్పటికీ దర్శకుడివి కాలేవురా అని అన్నాడని గుర్తుచేసుకున్నారు. ఆ మాటతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యాయని.. స్టార్ హీరో అయ్యాక ఆ దర్శకుడిని కలిసినప్పటికీ ఇంకా అతనిలో ఈగో మాత్రం తగ్గలేదని అన్నారు. ఇప్పటికీ అతని దగ్గర ప్రతికూల వాతావరణమే ఉందన్నారు.