Jagapathi Babu: సౌందర్య కంటే అతని మరణమే నన్ను బాగా కుంగదీసింది.. జగపతిబాబు కామెంట్స్ వైరల్
2004లో జరిగిన ఓ ఘోర హెలికాప్టర్ ప్రమాదం లో సినీ నటి సౌందర్య కన్నుమూశారు. ఈ సంఘటన యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాద సమయంలో తాను విదేశాల్లో ఉన్నానంటూ ఆమెతో కలిసి నటించిన జగపతిబాబు అప్పటి చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.

టాలీవుడ్ వెండితెరపై జగపతిబాబు, సౌందర్య లది సూపర్ హిట్ జోడీ. వీరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ జోడీ నటించిన సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కు తెగ నచ్చేశాయి. పెళ్లి పీటలు, ప్రియరాగాలు, సర్దుకుపోదాం రండి, దొంగాట, అంతఃపురం.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు సౌందర్య, జగ్గూబాయ్. సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఈ ఇద్దరికీ మంచి స్నేహం ఉండేది. ఈ నేపథ్యంలో సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో పంచుకున్నారు జగ్గూభాయ్. అయితే సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా జగపతిబాబుకు మంచి స్నేహితుడట. ఆ స్నేహం వల్లే వీరి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడిందట. ఈ విషయాన్ని స్వయంగా జగ్గూభాయే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య, అమర్నాథ్ చనిపోయినప్పటి చేదు జ్ఞాపకాలను ఓ సందర్భంలో షేర్ చేసుకున్నారు.
2004లో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు.. ‘ ఆరోజు నాకు ఫోన్ వచ్చింది.. సౌందర్య చనిపోయిందని చెప్పారు. ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను. వెంటనే నేను అమర్ (సౌందర్య సోదరుడు) ఎలా ఉన్నాడు అని అడిగాను. అతనికి ఏమైనా జరిగితే మాత్రం నాకు చెప్పొద్దు అని వెంటనే ఫోన్ పెట్టేశాను. కానీ విధి చాలా బలీయమైనది, ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు అమర్‌నాథ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం తనను సగం చంపేసినంత పని చేసింది’ అని జగపతిబాబు ఎమోషనల్ అయ్యారు.
కాగా ప్రస్తుతం సౌందర్య తల్లితో కానీ, ఆమె కుటుంబ సభ్యులతో తాను టచ్‌లో లేనని నటుడు జగపతి బాబు తెలిపారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయని ఆయన అన్నారు. అయితే సౌందర్య తల్లి ప్రస్తుత పరిస్థితి గురించి నేరుగా తెలియకపోయినా, ఆమె బాగానే ఉన్నారని విన్నానని జగ్గూభాయ్ చెప్పారు. గతంలో వారి కుటుంబంలో ఆస్తి సంబంధిత సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, అయితే అవి ఇప్పుడు పరిష్కారమయ్యాయని తాను విన్నానని జగపతి బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం సౌందర్యతో ఆమె ఫ్యామిలీపై ఈ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




