23 Movie Review: ప్రశ్నించే కథతో వచ్చిన 23 మూవీ.. సినిమా ఎలా ఉందంటే
మల్లేశం, 8 AM మెట్రో సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రాజ్ రాచకొండ. ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా 23. 1991 చుండూరు మారణకాండతో పాటు 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టుల నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. మరి 23 ఎలా ఉంది..? ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..

మూవీ రివ్యూ: 23
నటీనటులు: తేజ, తన్మయా, వేద వ్యాస్, ఝాన్సీ తదితరులు
ఎడిటర్: అనిల్ ఆలయం
సినిమాటోగ్రఫీ: సన్నీ కురపాటి
సంగీతం: మార్క్ కే రాబిన్
కథ: భరద్వాజ రంగవాజుల
స్క్రీన్ ప్లే, దర్శకుడు: రాజ్ రాచకొండ
నిర్మాత: స్టూడియో 99
కథ:
1991 చుండూరులో కథ మొదలవుతుంది. అక్కడ గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లో ఓ దళితుడు చూడకుండా ఒక అగ్రవర్ణ అమ్మాయి కాలు తొక్కుతాడు. వెంటనే క్షమాపణ అడిగినా కూడా అక్కడున్న అగ్ర కులం వాళ్లు ఆ దళితుడిని కొడతారు.. పైగా కేసు పెడతారు. ఆ విషయం కాస్తా పెద్దదైపోయి.. ఊళ్లో ఉన్న ఆసాములంతా ఒక్కటైపోయి ఏకంగా 8 మంది దళితులను వెంటాడి మరీ చంపుతారు. ఆ తర్వాత 1993లో గుంటూరు జిల్లాలో సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్‌కు దాస్ అనే మరో స్నేహితుడు కూడా ఉంటాడు. దళితులు కావడంతో బాగా అణగదొక్కుతుంటారు ఊళ్లో. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. దానికోసం బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. కంగారులో అంటించేస్తాడు సాగర్.. అంతే 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉంటారు. దాంతో వాళ్లకు కోర్ట్ ఉరి శిక్ష వేస్తుంది. అయితే ఇది జరిగిన నాలుగేళ్లకు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టులో 28 మంది అమాయకులు చనిపోతారు. ఈ మూడు పర్యాయాల్లో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది..? నిజంగా న్యాయం వైపు నిలబడిందా లేదా అనేది అసలు కథ..
కథనం:
అన్ని సినిమాలు సమాధానం కోసమే కాదు.. కొన్ని సినిమాలు ప్రశ్నించడానికి తీస్తారు.. 23 సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు రాజ్ రాచకొండ. మల్లేశం లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా మారిన రాజ్.. 23 కోసం అత్యంత వివాదాస్పదమైన 1993 చిలకలూరిపేట బస్సు దహనం నేపథ్యం ఎంచుకున్నాడు. తెలిసి చేసినా.. తెలియక చేసినా 23 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నేరస్తులకు బతికే హక్కు లేదు. ప్రతి నాణేనికి రెండు వైపులున్నట్టు.. ప్రతి నేరానికి రెండు వైపులు ఉంటాయి.. ఇందులో హతమైన వాళ్ల వైపు కాకుండా.. హంతకుల వైపు తన సైడ్ తీసుకున్నాడు దర్శకుడు రాజ్. రిస్కీ అని తెలిసినా.. చాలా కన్విన్సింగ్ గా ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్ళను నేరానికి ఉసిగొలిపిన కారణాలు.. ఎదురైన అవమానాలు.. ఎదుర్కొన్న పరిస్థితులు.. చివరికి వాళ్లు తీసుకున్న నిర్ణయం.. చేరుకున్న గమ్యం.. అనుభవిస్తున్న నరకం.. ఇలా ప్రతి విషయాన్ని టచ్ చేసాడు దర్శకుడు రాజ్ రాచకొండ. దానికంటే రెండేళ్లు.. అంటే 1991 చుండూరులో 8 మంది దళితులను చంపిన కేసులో.. కింది కోర్టు శిక్ష వేస్తే హైకోర్టులో అప్పీల్ చేసి నిందితులు బయటికి వచ్చిన ఘటన.. 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 26 మంది చనిపోతే.. అందులో కూడా నేరస్తులు బయటికి వచ్చిన ఘటనను.. తన కథకు లింకు చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రాజ్.
ఈ మూడు ఘటనలలో పదుల సంఖ్యలో అమాయకులు చనిపోయారు. అక్కడ పోయింది ప్రాణాలే.. ఇక్కడ పోయింది ప్రాణాలే.. కానీ వాళ్లను వదిలేసి వీళ్లను మాత్రం జైల్లో ఎందుకు పెట్టారు.. మనదేశంలో న్యాయం కూడా కులం చూస్తుంది అనేది దర్శకుడి వాదన. అలాగని 23 మంది అమాయకులను చంపిన వాళ్లను వదిలేయమని కాదు. అనుకోకుండా చేసినా.. అది కూడా క్షమించరాని నేరమే. కానీ ఇక్కడ దర్శకుడు వాళ్లను వదిలిపెట్టమని కాదు.. అగ్ర వర్ణాలను వదిలేసిన చట్టం.. వీళ్లను శిక్షిస్తుంది అనేది చూపించాడు. 32 ఏళ్లుగా ఇప్పటికీ వాళ్ళు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారట. అయితే ఎంత సమర్థించినా.. అంతమంది చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాల్సిందే.. అదే సమయంలో మిగిలిన వాళ్లకు కూడా అలాంటి శిక్ష పడాలనేది 23 సినిమా ఉద్దేశం. ఫస్టాఫ్ కాస్త స్లోగా వెళ్లినా.. సెకండాఫ్ మాత్రం చాలా ఆలోచనాత్మకంగా వెళ్లింది.
నటీనటులు:
కొత్త నటులు తేజ, తన్మయ బాగా నటించారు.. ఇద్దరికి మంచి పాత్రలు దక్కాయి. చాలా మెచ్యూర్డ్‌గా నటించారు కూడా. దాస్ అనే పాత్ర కూడా చాలా బాగుంది. అలాగే యాంకర్ ఝాన్సీ కనిపించేది కాసేపే అయినా బాగున్నారు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
మార్క్ కే రాబిన్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ కూడా ఆకట్టుకుంటుంది. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే.. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగింది. దర్శకుడిగా తన ఆలోచనను తడబాటు లేకుండా తెరకెక్కించాడు రాజ్ రాచకొండ. మూడు ఘటనలను తీసుకుని.. ఎవరికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది చూపించాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
పంచ్ లైన్: ఓవరాల్‌గా 23.. చాలా మందికి నచ్చని ఒక ప్రశ్న..!
