Rajinikanth: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్.. 37 ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్న సూపర్ స్టార్ సినిమా!
భారతీయ సినీ యవనికపై ఆయన ఒక ధృవతార. స్టైల్ అన్నా, మేనరిజం అన్నా అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఆయనే. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు.. దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే సాధారణంగా రజనీకాంత్ కొత్త సినిమాల గురించి మనం వింటుంటాం,

కానీ మీకు తెలుసా? ఆయన నటించిన ఒక పవర్ ఫుల్ బాలీవుడ్ యాక్షన్ సినిమా సుమారు 37 ఏళ్లుగా డబ్బాలోనే ఉండిపోయింది. 1989లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కొన్ని అనుకోని కారణాల వల్ల ఇన్నేళ్లుగా వెలుగు చూడలేదు. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు 4K టెక్నాలజీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. అప్పటి టాప్ స్టార్లందరూ నటించిన ఈ చిత్రం అసలు ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు విడుదల చేయడానికి దారి తీసిన పరిస్థితులేంటో తెలుసుకుందాం.
అరుదైన మల్టీస్టారర్..
ఈ సినిమా పేరు ‘హమ్ మేన్ షాహెన్‌షా కౌన్’. నిర్మాత రాజా రాయ్ ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రజనీకాంత్‌తో పాటు శతృఘ్న సిన్హా, హేమమాలిని, అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా వంటి అప్పటి స్టార్లందరూ నటించారు. విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన హర్మేష్ మల్హోత్రా తో పాటు, విలక్షణ నటుడు అమ్రిష్ పూరి, హాస్యనటుడు జగదీప్, కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వంటి దిగ్గజాలు ఇప్పుడు మన మధ్య లేరు. వారు వెండితెరపై చేసిన ఆఖరి మేజిక్‌ను ఇన్నేళ్ల తర్వాత చూసే అవకాశం ఇప్పుడు కలగబోతోంది.
వాయిదా వెనుక విషాదం..
1989లో షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ లేవు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఇది ఆగిపోయింది. షూటింగ్ ముగిశాక నిర్మాత రాజా రాయ్ తన వ్యాపార పనిపై లండన్ వెళ్లారు. అక్కడ తన చిన్న కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో ఆయన తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ బాధ నుండి కోలుకోవడానికి ఆయనకు చాలా ఏళ్లు పట్టింది. కొంతకాలం తర్వాత సినిమాను విడుదల చేద్దామని అనుకుంటున్న సమయంలో దర్శకుడు హర్మేష్ మల్హోత్రా కన్నుమూశారు.
ఇలా వరుస విషాదాల వల్ల సినిమా విడుదల నిరంతరం వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత విడుదల చేస్తున్నందున, నేటి కాలానికి తగ్గట్టుగా ఈ సినిమాను మారుస్తున్నారు. సహ నిర్మాత అస్లాం మిర్జా ప్రకారం.. పిక్చర్ క్వాలిటీ కోసం 4K టెక్నాలజీని మరియు ఆడియో నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. కథలో ఎటువంటి మార్పులు చేయకుండా, ఆ కాలం నాటి కలర్, విజువల్స్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
“మేము ఎప్పుడూ ఆశలు వదులుకోలేదు. ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత విధి రాత వల్ల ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు నోచుకుంటోంది. మా కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది” అని నిర్మాత రాజా రాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పాత సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఈ అరుదైన సినిమా థియేటర్లలో ఎటువంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. నలభై ఏళ్ల క్రితం నాటి రజనీకాంత్ స్టైల్ ను మళ్లీ వెండితెరపై చూడటం అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. మన మధ్య లేని ఎందరో మహానుభావుల నటనను మరోసారి చూసే ఈ అరుదైన అవకాశం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
