మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా.. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల గురించి పక్కా తెలుసుకోండి..
National Girl Child Day 2026: ఇంటికి వెలుగు ఆడపిల్ల.. ఆ వెలుగుకు చదువు తోడైతే ఆ కుటుంబమే కాదు, దేశమే వెలుగుతుంది. ఇవాళ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి తరం ఆడబిడ్డల కలలకు రెక్కలు తొడిగే రోజు. వివక్షను వీడి, సమానత్వాన్ని కోరుతూ.. అభం శుభం తెలియని పసి ప్రాణాల నుంచి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న అమ్మాయిల వరకు అందరికీ అండగా నిలబడేలా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడపిల్ల, నేడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాం. నేటికీ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, బాల్య వివాహాలు, విద్యా రాహిత్యం వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందనే సత్యాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తోంది. 2008లో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలను సాధికారత కల్పించడం అనే నినాదంతో వేడుకలు నిర్వహిస్తున్నారు.
బాలికలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడం, వారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడటం దీన్ని ప్రధాన ఉద్దేశ్యం. కేవలం సమస్యల గురించి మాట్లాడటమే కాకుండా వివిధ రంగాల్లో బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగం. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా గౌరవం, స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ దినోత్సవం మనకు గుర్తుచేస్తుంది.
అండగా నిలుస్తున్న ప్రభుత్వ పథకాలు
బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తోంది..
బేటీ బచావో – బేటీ పఢావో – లింగ వివక్షను అరికట్టడం, బాలికా విద్యను ప్రోత్సహించడం.
సుకన్య సమృద్ధి యోజన – బాలికల ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం ఆర్థిక పొదుపు.
ఉడాన్ – ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో బాలికల ప్రవేశాన్ని పెంపొందించడం.
పోషణ్ అభియాన్ – బాలికల్లో పోషకాహార లోపం సమస్యను అధిగమించడం.
కౌమార బాలికల పథకం – పాఠశాలకు వెళ్లని 11-14 ఏళ్ల బాలికలకు పోషకాహార మద్దతు.
సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి..
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, గ్రామీణ భారతంలో ఇప్పటికీ పీరియడ్స్ పరిశుభ్రత పై సరైన అవగాహన లేకపోవడం, SC, ST వర్గాల బాలికలు మధ్యలోనే చదువు మానేయడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ రూపుమాపడానికి ప్రభుత్వంతో పాటు సమాజం, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ వంతు బాధ్యత వహించాలి. బాలికల కలలకు రెక్కలు తొడిగితే, వారు నవ భారత నిర్మాణంలో కీలక భాగస్వాములవుతారు. ఆడపిల్లలకు కేవలం రక్షణ మాత్రమే కాదు అబ్బాయిలతో సమానమైన గౌరవం, స్వేచ్ఛ, అవకాశాలు లభించినప్పుడే ఈ బాలికా దినోత్సవం నిజమైన అర్థాన్ని పొందుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
