శుభకార్యాలపై బంగారం బాంబ్..!పెళ్లి చేయాలంటే భయపడుతున్న పేరెంట్స్.. రెట్టింపు ఖర్చులతో..
రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు శుభకార్యాలను ఆర్థిక భారంగా మారుస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్లకు వెనకడుగు వేస్తున్నాయి, ఆభరణాల తయారీ ఆర్డర్లు తగ్గిపోయాయి. స్వర్ణకారులు పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవడమే ప్రధాన ఆలోచనగా మారింది, ఆనందం కరువై ఖర్చుల భయం పెరిగింది.

రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు శుభకార్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెళ్లిళ్లు అంటేనే మధ్యతరగతి కుటుంబాలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. మంచి ముహూర్తాలు దగ్గర పడుతున్నా బంగారు దుకాణాల్లో సందడి తగ్గింది. ఆభరణాల తయారీకి హడావిడి కరువైంది. ఆకాశాన్ని తాకుతున్న బంగారం.. చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. శుభకార్యాల ఆనందాన్ని ఖర్చుల భయంగా మార్చేశాయి. బంగారం తులం రూ.1,57,160లు ఉండగా, వెండి కిలో మూడు 40వేలు దాటింది. (3,40,100)(శనివారం ఉదయం 8 గంటల వరకు ఉన్న ధరల ప్రకారం..) దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో గుబులు మొదలైంది. గతంలో మంచి ముహూర్తాలు దగ్గరపడగానే పెళ్లికి కనీసం నెల రోజుల ముందే వధూవరుల కుటుంబ సభ్యులు బంగారు దుకాణాల చుట్టూ తిరిగేవారు. మధ్యతరగతి కుటుంబాలే 15 నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు వధువుకు చేయించేవారు. వెండి ఆభరణాలు కూడా కిలో నుంచి రెండు కిలోల వరకు ఆడబిడ్డలకి అందించేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో ఆభరణాలు చేయించాలంటేనే కుటుంబాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. పెళ్లి అంటే సంతోషం కాకుండా భారంగా మారుతోందని మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లకు ఐదు తులాల బంగారం పెట్టడమే భారం అవుతోందని చెబుతున్నారు. అందుకే గతంలో మాదిరిగా భారీ ఆభరణాల తయారీకి ఎవరూ ముందుకు రావడం లేదు. మంచి శుభదినాలు వచ్చినా బంగారు దుకాణాల్లో మునుపటి సందడి కనిపించడంలేదు. ఆభరణాల తయారీ ఆర్డర్లు తగ్గడంతో షాపుల్లో హడావిడి కరువైంది. వ్యాపారులూ ఇదే మాట చెబుతున్నారు. ఇక పేద కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పుస్తె, మట్టెలు చేయించడమే పెద్ద సవాలుగా మారిందని వారు వాపోతున్నారు. అవసరమైన ఆభరణాలు తగ్గించుకొని పెళ్లి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలన్నదే ఇప్పుడు ప్రధాన ఆలోచనగా మారింది.
మొత్తానికి… బంగారం, వెండి ధరల పెరుగుదల శుభకార్యాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఆనందాన్ని ఆర్థిక ఒత్తిడిగా మార్చేస్తోంది. శుభకార్యాల సందడి స్థానంలో ఇప్పుడు ఖర్చుల భయం నెలకొంది. ముందుగా బంగారం కొనుగోలు చేసి..ఆభరణాలు తయారు చేయించేవారు..కావాల్సిన డిజైన్ ఆర్డర్ ఇచ్చే వారు.. ఇప్పుడు..ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వడం లేదు.. ఆభరణాలు తయారు చేసే వారు కూడా పని లేక ఖాళీగా ఉంటున్నారు..
రోజు..రోజు కు బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. పెళ్లిళకు..బంగారం కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారని అంటున్నారు. ఈ సమయానికి చాలా సందడిగా ఉండేదాని..బంగారం వ్యాపారులు చెబుతున్నారు..ఈ నెల చివరి వారం నుంచి..ముహూర్తలు మొదలవుతున్నాయని అంటున్నారు. బంగారం, వెండి ధర పెరగడం తో.. కొనుగోళ్లు తగ్గాయని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




