తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి దారెటు..?
తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి కూటమిగా రంగంలోకి దిగుతోంది. మరి కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఎన్నికల శంఖారావం పూరించింది. తొలి ప్రచార సభలో ప్రధాని మోదీ సహా మిత్రపక్షాల పార్టీలు పాల్గొన్నాయి. అంతా బాగానే ఉంది కానీ మార్పు పేరుతో కొత్తగా పార్టీ స్థాపించిన నటుడు విజయ్ పరిస్థితి ఏంటి అన్న చర్చ మొదలైంది.

తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారం మొదలైంది. చెన్నై శివారు లోని మధురాంతకంలో ఎన్డీయే కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. సభకు మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు హాజరయ్యారు. గతంలో డీఎంకే కూటమిలో ఎక్కువకాలంగా ఉన్న పీఎంకే , టీఎంసీ పార్టీలు గత కొద్ది కాలంగా దూరంగానే ఉంటున్నాయి. అలాగే ఎండీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం ఎప్పటినుంచో అన్నాడీఎంకేలో కలవాలని ప్రయత్నాలు చేసినా అవకాశం దొరకలేదు.. బీజేపీ అన్నాడీఎంకే పొత్తు తర్వాత పీఎంకే, టీఎంసీతో పాటు టీటీవీ దినకరన్ కూడా ఎన్డీయే కూటమిలో చేరింది. బీజేపీ అగ్రనేతల చొరవ వల్లే టీటీవి దినకరన్‌ను కూటమిలోకి అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఇన్ని రోజులు పాటు అన్నాడీఎంకే, డీఎంకేకు దూరంగా ఉంటున్న పార్టీలు విజయ్‌తో కలిసి కూటమిగా బరిలోకి దిగుతారని అందరూ భావించారు. మొన్నటి వరకు విజయ్ ఏర్పాటుచేసే కూటమి బలంగా ఉంటుందని జరగనున్న ఎన్నికల్లో విజయ్ కూటమి రెండవ స్థానంలో ఉంటుందని కొన్ని సర్వేలు కూడా చెప్పాయి. అయితే ఉన్నట్టుండి పరిణామాలు మారిపోయాయి. ఇప్పటిదాకా తమిళనాడులో ప్రధాన పార్టీలుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేలు కూటమిలోని ఇతర పార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించ లేదు. టీవీకే చీఫ్ విజయ్ తాను అధికారంలోకి వస్తే ఇతర పక్షాలకు అధికారంలో చోటు కల్పిస్తానని ప్రకటించారు. అయినా ఇతర పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరడం గమనార్హం.
ఈ పరిణామాలతో విజయ్ ఇప్పుడు ఒంటరిగానే మిగిలిపోయారు. విజయ్ కాంత్ డీఎండీకేతో టీవీకే సంప్రదింపులు జరుపుతోంది. ఇంకా పొత్తు అంశంపై క్లారిటీ రాలేదు. డీఎంకే కాంగ్రెస్ సహా పలు పార్టీలతో కూటమిగా ఉంది.. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి కూడా బలంగానే కనబడుతోంది. టీవీకే పార్టీ పరిస్థితి మాత్రమే ఇప్పుడు ఎటు అర్థం కాని స్థితిలో ఉంది. బలమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించి స్పీడును పెంచింది. డీఎంకే తర్వాత తమిళనాడులో బలంగా ఉన్న అన్నాడీఎంకే సొంత ఓటు బ్యాంకు అలాగే ఉంది. కొత్తగా ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన పీఎంకే చీఫ్ అన్బుమణి రామదాస్ పార్టీకి అగ్రవర్ణాల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇప్పుడు ఈ పార్టీల తీరుతో విజయ్ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.
