Republic Day 2026: లోకల్ టు గ్లోబల్.. రిపబ్లిక్ డే వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బిహార్ మఖానా..
భారత గణతంత్ర వేడుకలకు వేదికైన 'కర్తవ్య పథ్' ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన వ్యవసాయ అద్భుతాన్ని సాక్షాత్కరించబోతోంది. బీహార్ రాష్ట్రానికి గర్వకారణమైన, ప్రపంచవ్యాప్తంగా 'సూపర్‌ఫుడ్'గా గుర్తింపు పొందిన 'మఖానా' (Makhana) ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బీహార్ ప్రభుత్వం ఈ ఏడాది తన అధికారిక శకటం కోసం 'మఖానా'ను థీమ్‌గా ఎంచుకుంది. స్థానిక మార్కెట్ల నుండి అంతర్జాతీయ స్థాయికి ఈ ఫాక్స్ నట్స్ ఎలా ఎదిగాయో ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశ్యం.

పోషకాల గనిగా పేరుగాంచిన మఖానా సాగులో భారతదేశంలోనే బీహార్ అగ్రస్థానంలో ఉంది. దేశం మొత్తం ఉత్పత్తిలో సుమారు 90 శాతం వాటా బీహార్‌దే కావడం విశేషం. మిథిలాంచల్‌లోని చెరువుల నుండి మఖానాను సేకరించడం, దానిని ప్రాసెస్ చేయడం, వేయించడం ప్యాకేజింగ్ చేయడం వరకు సాగే పూర్తి ప్రస్థానాన్ని ఈ శకటం కళ్లకు కట్టినట్లు చూపనుంది. ముఖ్యంగా ఈ సాగులో మహిళల భాగస్వామ్యం, స్థానిక కార్మికుల శ్రమ స్వదేశీ పరిజ్ఞానాన్ని హైలైట్ చేస్తూ ఈ ప్రదర్శన సాగనుంది.
‘వన్ ఇండియా – బెస్ట్ ఇండియా’ సందేశం:
ఈ ఏడాది పరేడ్‌లో మొత్తం 30 శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. వీటిలో 17 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కాగా, 13 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందినవి. ‘ఒక భారతం – శ్రేష్ఠ భారతం’ (One India, Best India) స్ఫూర్తితో బీహార్ తన సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపును తెచ్చే ప్రయత్నం చేస్తోంది. సంప్రదాయం, హార్డ్ వర్క్ ఆవిష్కరణలు కలిస్తే స్థానిక జీవనోపాధి ఎలా అంతర్జాతీయ స్థాయికి చేరుతుందో ఈ శకటం సందేశం ఇస్తుంది.
పరేడ్ విశేషాలు:
ఆత్మనిర్భర్ భారత్: ఈసారి పరేడ్ థీమ్ ‘ఆత్మనిర్భరత’ ‘వందే మాతరం’ మంత్రంపై ఆధారపడి ఉంటుంది.
కళాకారుల సందడి: సుమారు 2,500 మంది సాంస్కృతిక కళాకారులు కర్తవ్య పథ్‌పై తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
ప్రత్యేక అతిథులు: ఈ వేడుకలకు కర్తవ్య భవన్ నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం విశేషం.
ఐఏఎఫ్ ప్రదర్శన: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుభవజ్ఞులైన యోధుల (Veterans) శకటం కూడా ఈసారి పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
