SP Balu: బాలు ఎప్పటికీ మనతోనే ఉంటారు.. మా చెవులు రింగుమని మారుమోగేదాక ఆయనే పాటలే పాడుకుంటాం!

S.P.Balasubrahmanyam: అసలు ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. మనకందరికీ ఆత్మీయుడైన గాన గంధర్వుడు అమరలోకాలకు వెళతారని ఏనాడూ ఊహించలేదు..ఎలా ఊహిస్తాం.. ఆయన మన స్థిరాస్తి అయినప్పుడు..ఇలలోనే ఉండి ఉంటే ఇవాళ....

SP Balu: బాలు ఎప్పటికీ  మనతోనే ఉంటారు.. మా చెవులు రింగుమని మారుమోగేదాక ఆయనే  పాటలే పాడుకుంటాం!
Spb
Follow us
Balu

| Edited By: Sanjay Kasula

Updated on: Jun 04, 2021 | 10:55 AM

SP Balasubramanyam: అసలు ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. మనకందరికీ ఆత్మీయుడైన గాన గంధర్వుడు అమరలోకాలకు వెళతారని ఏనాడూ ఊహించలేదు..ఎలా ఊహిస్తాం.. ఆయన మన స్థిరాస్తి అయినప్పుడు..ఇలలోనే ఉండి ఉంటే ఇవాళ ఎన్ని కొత్త విషయాలు చెప్పేవారో.. ఎన్ని పాటల అనుభవాలను పంచుకునేవారో … అయినా బాలు జయంతి అనడానికి ఎందుకో మనసొప్పడం లేదు.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలనే అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఇంకా మన మధ్యనే ఉన్నారు కాబట్టి.. ఇంకెన్నేళ్లయినా మనతోనే ఉంటారు కాబట్టి. మన చెవులు రింగుమని మారుమోగేదాక ఆయన పాటలే పాడుకుంటాం కాబట్టి.. బాలు అనే స్వర గంధర్వుడు చిరంజీవి కాబట్టి..!

ఆ స్వరం ఎప్పుడు మూగబోయింది కనుక.. ? ఆ గొంతులోని మాధుర్యాన్ని ఇప్పటికీ మనం ఆస్వాదిస్తూనే ఉన్నాం.. బాలు గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది..? ఆయన ప్రతిభ ఏపాటిదో తెలియంది కాదు,. ఆయన మంచి మాటకారి అని, చమత్కారి అని, మంచి నటుడని, మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అని, మంచి ప్రొడ్యూసర్‌ అని, మంచి డబ్బింగ్ ఆర్టిస్టని, మంచి సంగీత కార్యక్రమ నిర్వాహకులని.. కొత్తగా ఎలా చెబుతాం! ఇవన్నీ మనకు తెలియకపోతే కదా! శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం….మనం ముద్దుగా బాలు అని పిల్చుకున్నాం.. క్షమించాలి…..పిల్చుకుంటున్నాం.. ఆయన పాతతరానికి కొత్త తరానికీ సంధానకర్తగా పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. తెలుగు పాటలో కొత్త ఒరవడులు సృష్టించారు. సినీ సంగీతాన్ని పరవళ్లు తొక్కించారు.

గాయకులు కాలానికి అతీతులు కారు. ఎంత గొప్ప సింగరైనా కొంతకాలానికి పాతబడిపోతారు. విన్న గొంతునే వినిపిస్తూ శ్రోతలకి విసుగు కలిగిస్తారు. కానీ బాలు సంగతి వేరు. ఆయన దశకంఠుడు. ఆ మాటకొస్తే శత కంఠుడు, సహస్రకంఠుడు. ఆ గొంతు ఎప్పటికీ నిత్యనూతనం. ఎన్నిసార్లూ విన్నా ఆ స్వరంలో ఏదో కొత్తదనం వినిపిస్తుంది. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో బాలు ఎప్పటికీ ఓ స్టాండర్డ్ గా నిలిచిపోవడానికి కారణం… తొలినాళ్లలో పడిన బలమైన పునాది.. తిరుగులేని కృషి…ఆయనేమీ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు.. అయితేనేం…విన్న వెంటనే ట్యూన్‌ పట్టేసే అద్భుతమైన ప్రతిభ ఆయనది… అనుభవమే ఆయనకి సంగీత పాఠాలు నేర్పింది. అందుకే అలవోకగా అన్నేసి పాటలు అందరికీ పాడగలిగాడు…పాడుతూ వుండగలిగాడు. కఠినమైన పదబంధాలతో సాగే పాటలనైనా సింగిల్‌ టేక్‌లోనే ఓకే చేయగల సమర్థుడు కాబట్టే మ్యూజిక్‌ డైరెక్టర్లకు ఇష్టుడయ్యాడు…రచయితలూ సంతుష్టులయ్యారు.

నాలుగు తరాల హీరోలకు పాడే అవకాశం ఒక్క బాలుకే దక్కింది…ప్రపంచంలో మరే గాయకుడికీ దక్కని అరుదైన అదృష్టమిది…అలాగని స్వరంలో మాధుర్యమేమైనా తగ్గిందా ..ఊహూ…అదే తీయదనం…అదే ఆయన గొప్పదనం…బాలులో ఉండే ప్రత్యేకమైన శైలి.. ఎవరినీ అనుకరించని ఓ విశిష్టమైన బాణీయే ఆ గాన గంధర్వుడికి పాటల పట్టాభిషేకాన్ని చేసి పెట్టాయి. వారసుల కాలం వచ్చినా .. బాలు కంఠంలో యూత్ ఫుల్ నెస్ తగ్గలేదు. హీరోలకే కాదు… హీరోల వారసులకీ, ఆ తరవాతి తరానికీ కూడా పాటలు పాడిన ఘనుడు బాలు. తరాలు మారినా బాలు పాటలో హుషారు తగ్గలేదు సరికదా.. ఆ స్వీట్ నెస్ మరింత పెరుగుతూ వస్తోందేమోననిపిస్తుంది. కేవలం టాలెంట్ తో అన్నిటా నెగ్గుకొస్తూ సినీ సంగీత ఆకాశంలో నెలబాలుడిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చాడు. బాలుడిగా ఉన్నప్పుడే బాలు బహుముఖ ప్రతిభ వికసించింది. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా దక్షిణ భారతపు నాలుగు భాషల్లోనూ తన పాటల పిట్టలను విహరింపచేశాడు. ఏ పాట పాడినా సహజంగా ఉండాలి. ఏ భాష మాట్లాడినా అది మాతృ భాషలా ఉండాలి. ఇదీ బాలు సిద్ధాంతం. అందుకే ఎంతో కృషి చేశాడు. ప్రతి భాష ఉచ్చారణలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. ఇదే ఆయన్ను అందరివాణ్ని చేసింది. బాలు దివికేగారన్న వార్త వినగానే కన్నడలోకం ఎంతగా దుఃఖించిందో, తమిళులు ఎంతగా రోదించారో, మలయాళీలు ఎంతగా ఆవేదన చెందారో మనం చూశాం.. అంతెందుకు యావత్‌ భారతమే శోకించింది.

తెరముందు ఎందరు హీరోలున్నా… తెర వెనుక ఒకడే హీరో… బాలు! హీరోలకి పాడారు. కమెడియన్లకి పాడారు. ఒక్కో హీరోకి ఒక్కోలా పాడారు. ఒక్కో కమెడియన్ కి ఒక్కోలా పాడారు. వంద కంఠాలతోనైనా పాడగలిగే అద్భుత ప్రతిభాశాలి. అయినా బాలు ఎప్పుడూ దర్పం చూపలేదు. గర్వం ప్రదర్శించలేదు. ప్రతిభనీ వినయాన్నీ అనులోమానుపాతంలో పెంచుకున్న వినయశీలి ఆయన! ఆకాశమంత ఎత్తు ఎదిగినా … తనకి ఏమీ రాదని చెప్పే నిరహంకారం ఎవరికోగానీ సాధ్యం కాదు.

ఆ మాటకొస్తే ఒకోసారి ఈయన తనని తాను మరీ తక్కువ చేసుకున్నాడేమో అనీ డౌటొస్తుంది. 1967 సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన బాలు గొంతు కొత్తగా లేతగా వినిపించడంతో అందరూ ఆయనను ఆదరించారు. శాస్త్రీయ సంగీతం తీసుకురాని లలిత మాధుర్యాన్ని బాలు తెచ్చారు. అందుకే ఆ గొంతు అందరికి నచ్చేసింది. 19 ఏళ్ళ వయస్సులో… ఏ మాత్రం శాస్త్రీయ సంగీతం తెలియని బాలు అతి తొందరలోనే తనదంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని తయారుచేసుకోగలిగారు.

బాలు మొదట్లో పాడిన పాటలు చాలా మధురంగా వినిపిస్తాయి.. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా పాటను ఇప్పటికీ ఎంతో మంది పాడుకుంటూ ఉంటారు. సంక్రాంతి వస్తే చాలు ఈ పాట అన్ని మాధ్యమాలలో మారుమోగుతుంటుంది. ఏ దివిలో విరిసిన పారిజాతమో, మేడమంటే మేడా కాదు, ఏ పారిజాతమ్ములీయగలనో చెలీ వంటి పాటలు వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఘంటసాల స్వర్గస్తులయ్యాక కొంతకాలం బాలు చాలా కష్టపడ్డారు.. వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. హీరో కృష్ణలాంటి వారు తప్ప మిగతా వారు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు.

ఘంటసాలకి ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ మద్దతు ఇలా లభించిందో హీరో కృష్ణ మద్దతు బాలుకు ఉండేది. బాలు గొంతు హీరో కృష్ణ గొంతు కి అతికినట్టు సరిపోయేది. అయితే ఘంటసాల పోయిన తర్వాత రామకృష్ణకే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తమిళంలోనూ బాలుకు అవకాశాలు తగ్గిపోయాయి.. ఒకానొక దశలో భుక్తి కోసం ఆర్కెస్ట్రా పెట్టుకుని ప్రోగ్రాంలు ఇస్తూ ఊరూరూ తిరిగారు కూడా! అయినప్పటికీ ఏడో దశకం మధ్యలో కొన్ని అద్భుతమైన పాటలను పాడారు బాలు.. ఆ పాటలు ఎస్పీబీ తప్ప మరొకరు పాడలేరు. పాడినా అంత గొప్పగా ఉండేవి కావేమో! సిరిమల్లె నీవె, మావి చిగురు తినగానే మధుమాస వేళలో, శివరంజని నవరాగిణి లాంటి పాటలు కొన్ని మెచ్చు తునకలు మాత్రమే.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.

ప్రారంభంలో కోదండపాణితో పాటు మహదేవన్‌ కూడా బాలును బాగా ప్రోత్సహించారు. అసలు బాలుకు ఎన్టీఆర్‌కు, ఎఎన్‌ఆర్‌లకు పాడే అవకాశం ఇచ్చింది కూడా మహదేవనే! ఏకవీరలో ఎన్‌టీఆర్‌కు, ఇద్దరు అమ్మాయిలో ఎఎన్‌ఆర్‌కు మహదేవన్‌ బాలుతో పాడించారు. ఎంజీఆర్‌కు తొలిసారిగా బాలుతో పాడించింది కూడా మహదేవనే! శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న తర్వాత మూగజీవులో సినిమాలో దయలేని లోకాన అనే పద్యాన్ని పాడారు బాలు. దాన్ని మహదేవన్‌కు వినిపించారు కోదండపాణి. బాలు స్వరాన్ని మెచ్చుకున్న మహదేవన్‌ తన ప్రైవేట్ మాస్టారు సినిమాలో పాడుకో పాడుకో పాడుతూ చదువుకో అనే పాటను పాడించారు. అప్పుడే విశ్వనాథ్‌తో బాలుకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత కోదండపాణి సంగీతంలో వచ్చిన సుఖ దుఃఖాలులో మేడంటే మేడా కాదు , అందాలు చిందే ఆ కళ్లలోనే బంగారుకలలే దాగున్నవి అన్న పాటలు పాడారు బాలు. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప పాటలు బాలుకు గొంతు నుంచి జాలువారాయి. 75 తర్వాత ఎన్‌టిఆర్‌కు, ఎఎన్‌ఆర్‌కు కూడా బాలునే గొంతునిచ్చారు. ఆయన గొప్పతనమేమిటంటే ఏ హీరోకు ఆ హీరోలా పాడటం.. బాలులో మంచి మిమిక్రి ఆర్టిస్టు ఉన్నారు..

అసలు బాలసుబ్రహ్మణ్యం గొంతులో వైరుధ్యాలు ఉన్నాయని, ఆయనతో మిమిక్రీ చేయించవచ్చని ముందుగా పసికట్టింది టీవీ రాజు.. కోడలు దిద్దిన కాపురం సినిమాలో అమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడివి అనే పాట ఉంది. అందులో మాయలఫకీరు ప్రాణము చిలకలోనే ఉన్నది… మా నాన్న ప్రాణము నా పిలకలోనే ఉన్నది అన్న వాక్యాన్ని బాలు అచ్చుగుద్దినట్టుగా పద్మనాభం గొంతులాగే పాడారు. ఇక అప్పట్నంచి ఏ నటుడికి ఆ నటుడి గొంతును అనుకరించసాగారు బాలు.

దాసరి నారాయణరావు తీసిన చిల్లరకొట్టు చిట్టెమ్మలో పేడి పాత్ర వేసిన నటుడు మాడా కోసం చూడు పిన్నమ్మా పాడు పిల్లోడా పాట పాడారు. ఆ పాట బాలూకు, మాడాకు చిరకాల కీర్తి తెచ్చి పెట్టింది. మాడాకు జీవితకాలం ఆ పాత్రే భుక్తి కల్పించిందని చెప్పవచ్చు. మేడమ్‌ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ చాలా సేపు స్త్రీ వేషంలో ఉంటారు. అందులో ఓ పాటను స్త్రీ గొంతుతో బాలు పాడారు. ఇలా ఓ గాయకుడు పూర్తిగా గాయనిలా పాట పాడటం ఓ విశేషం. అల్లు రామలింగయ్య కోసం బాలు పాడిన ముత్యాలు వస్తావా పాట ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే . రాజబాబుకు కుడా చాలా పాటలు పాడారు. ప్రతిఘటనలో సుత్తి వేలుకు పాడారు.

బాలు అద్భుతమైన గాయకుడే కాదు, మంచి స్వరకర్త కూడా ! ఇది తొలి పాట.. ఒక చెలి పాట వినిపించనా ఈ పూట … అప్పట్లో రేడియోలో ఈ పాట తరచూ వినిపించేది.. ఈ పాట కన్య-కుమారి అన్న సినిమాలోది.. దాసరినారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సంగీతాన్ని అందించింది బాలునే! మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అది బాలుకు మొదటి సినిమా! ఆ తర్వాత ఎన్నో సినిమాలు.. ఎన్నో మంచి పాటలు.. బాపు, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు దర్శకుల దగ్గర సంగీతం ఇచ్చారు. కెప్టెన్‌ కృష్న సినిమాలో కలకాలం ఇదే పాడనీ, నీలో నన్నే చూడనీ పాటను మర్చిపోవడం సాధ్యమవుతుందా? మీకో సంగతి తెలుసా? బంగారు పిచ్చికలో బాలుతోనే హీరో వేషం వేయిద్దామనుకున్నారు బాపు. అప్పుడెందుకో అది కుదరలేదు.. దాంతో ఆ పాత్ర చంద్రమోహన్‌కు దక్కింది.

హీరో ఛాన్స్‌ పోతే పోయింది కానీ బాలుతో తూర్పు వెళ్లే రైలుకు సంగీతం చేయించుకున్నారు బాపు. అందులో అన్ని పాటలు బాగా హిట్టయ్యాయి. బాపుకు మెహదీహసన్‌ అంటే చాలా ఇష్టం.. బాపు కోరిక మేరకు మెహదీహసన్‌ ఓ గజల్‌ను తీసుకుని చుట్టూ చెంగావి చీర పాటను స్వరపరిచారు బాలు. ఎఎన్‌ఆర్‌, కృష్ణలతో దాసరి తీసిన ఊరంతా సంక్రాతికి కూడా బాలునే సంగీతాన్ని అందించారు. సంగీత దర్శకుడిగా బాలు మీద చాలా మంది సంగీత దర్శకుల ప్రభావం ఉంది. బాలు సంగీతం ఒక్కోసారి సత్యంలా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రమేశ్‌నాయుడులా అనిపిస్తుంది. కొన్నిసార్లు మహదేవన్‌ ఛాయలు కూడా కనిపిస్తాయి. శోభన్ బాబు హీరోగా వచ్చిన జాకీ మూవీలో అలా మండిపడకే జాబిలీ సాంగ్ లో ఇంటర్ లూడ్ వింటే చాలా కొత్తగా అనిపిస్తుంది.. శివరంజని రాగంలో స్వరపరిచిన ఆ పాట ఇప్పటికీ రేడియోలో మనల్ని పలకరిస్తూనే ఉంటుంది..అన్నట్టు వంశీ తీసిన లాయర్‌ సుహాసిని సినిమాకు కూడా బాలునే స్వరకర్త. కళ్లు, మయూరి, పడమటి సంధ్యారాగం, జైత్రయాత్ర, కొంగుముడి, భార్యామణి ఒకటా రెండా చాలా సినిమాలను చెప్పుకోవచ్చు.. గాయకుడిగా తీరిక లేనందువల్లే ఎక్కువ సినిమాలకు సంగీతాన్ని అందించలేకపోయారేమో!

బాలును డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మార్చించి సంగీత దర్శకుడు చక్రవర్తి. 1976లో వచ్చిన మన్మథలీల సినిమాకు కమలహాసన్‌కు గొంతు అరువిచ్చారు బాలు. ఆ తర్వాత కమలహాసన్‌కు బాలు పర్మనెంట్ డబ్బింగ్‌ ఆర్టిస్టయ్యారు. కల్యాణరాముడు, వసంతకోకిల, నాయకుడు, డాన్స్‌మాస్టర్‌, గుణ, మైకేల్‌ మదనకామరాజు, విచిత్రసోదరులు.. ఈ సినిమాలో కమల్‌కు డబ్బింగ్‌ చెప్పింది బాలునే! దశావతారం సినిమాలో కమల్‌ పది పాత్రలకు పది రకాలుగా కేవలం రెండు రోజుల్లోనే డబ్బింగ్‌ చెప్పారు బాలు.. నరేశ్‌కు, భాగ్యరాజాకు, విసుకు, జెమినీగణేశన్‌కు, సుమన్‌కు కూడా బాలు గాత్రమిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అటెన్‌బరో గాంధీ చిత్రం ఒక ఎత్తు. ఆ సినిమా తెలుగులో డబ్‌ అయినప్పుడు గాంధీ పాత్రకు అద్భుతంగా డబ్బింగ్‌ చెప్పారు బాలు.

బాలులో చక్కటి నటుడు ఉన్నారు. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ సినిమాలో ఓ పాటలో తళుక్కున మెరిసిన బాలు తర్వాత హీరోగా నటించే స్థాయికి ఎదిగారు. తమళంలో వచ్చిన కేలడి కన్మణిలో బాలునే హీరో.. తెలుగులో ఓ పాపా లాలి పేరుతో డబ్‌ అయ్యింది. ఒక టీవీ కార్యక్రమాల గురించి ఏం చెబుతాం? ఇక బిరుదులు సత్కారాలు పురస్కారాలకు అయితే లెక్కే లేదు.. ఆరు జాతీయ అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఈయనకు లభించాయి..భారత ప్రభుత్వం పద్మశ్రీ, ,పద్మభూషన్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. బాలు లాంటి గాయకుడు … భారతదేశం మొత్తం వెతికినా దొరకరు. భారతదేశమే కాదు… ప్రపంచంలోనే అలాంటి సింగర్ లేడనడానికి మొహమాటపడాల్సిన పని లేదు. బాలు లాంటి వ్యక్తులు చాలా చాలా అరుదు.. అలాంటి విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వారు కోటికొక్కరు పుడతారేమో! బాలు…మళ్లీ మా చెంతకు రారాదూ..! మీ దగ్గర్నుంచి ఇంకా బోలెడన్ని విషయాలు తెలుసుకోవాలి.. వెంటనే వచ్చేయ్‌! ఎదురుచూస్తుంటాం!

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..