Pawan Kalyan: మరోసారి మంచి మనసు చాటుకున్న జనసేనాని.. కిన్నెర కళాకారుడు మొగులయ్యకు ఆర్థిక సాయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కళాకారుల ప్రోత్సహించడంలో తనకున్న గొప్ప మనసును మరోసారి రుజువు చేసుకున్నారు.
Pawan Kalyan financial help: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కళాకారుల ప్రోత్సహించడంలో తనకున్న గొప్ప మనసును మరోసారి రుజువు చేసుకున్నారు. భీమ్లా నాయక్’ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తునట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. ఆయనకు ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని అందించాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందచేయనున్నారు.