Pochamma : పోచమ్మ వెబ్ సిరీస్ రివ్యూ.. ఆహాలో వచ్చిన అద్భుతమైన మిస్టికల్ థ్రిల్లర్.
ఎప్పటికప్పుడు సరికొత్త షోలు, సిరీస్, సినిమాలతో అలరించే ఆహా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మిస్టికల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ. 5 ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సిరీస్‌ను రమేష్ ఇంద్ర తెరకెక్కించారు. అంబటి అర్జున్, స్నేహల్ కామత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఇది ఎలా ఉంది.. మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

సిరీస్ రివ్యూ: పోచమ్మ
నటీనటులు : రమేష్ ఇందిరా, అచ్యుత్ కుమార్, అర్జున్ అంబటి, స్నేహల్ కామత్ తదితరులు
సంగీతం : ఎల్.వి. ముత్తు గణేష్
సినిమాటోగ్రఫీ : శ్రీశ కుడువల్లి
ఎడిటింగ్ : నవీన్ నజోస్
దర్శకుడు : రమేష్ ఇంద్రా
నిర్మాత: శృతి నాయుడు
OTT: ఆహా (ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్)
కథ:
ఒక ఊరిలో ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే పోచమ్మ తల్లి విగ్రహం ఒక బంగ్లా ఆవరణలో ఉంటుంది. ఆ బంగ్లాకు మేనేజర్ రఘుపతి (అచ్యుత్ కుమార్). తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటాడు. అయితే ఆ బంగ్లా యజమాని ఫ్రెడ్రిక్ (రమేష్ ఇంద్ర) తన స్వార్థం కోసం, అహంకారంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి బలవంతంగా తొలగిస్తాడు. పోచమ్మ విగ్రహాన్ని అలా అగౌరవపరిచి తీసేసిన తర్వాత ఆ ఇంటి యజమానితో పాటు ఆ బంగ్లాలో ఉండే వారికి వరుసగా ఊహించని, భయానకమైన సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫ్రెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ (స్నేహల్ కామత్) అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. కుటుంబంలోనూ వరసగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొందరు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతారు. అసలు ఆ బంగ్లాలో జరుగుతున్న ఆ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అవన్నీ పోచమ్మ తల్లి ఆగ్రహం వల్ల జరుగుతున్నాయా? లేక ఎవరైనా కావాలనే ఈ హత్యలు చేస్తున్నారా? ఈ క్రైమ్‌కు, గతంలో జరిగిన ఒక మోసానికి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సిరీస్ పూర్తి కథ.
కథనం:
దర్శకుడు రమేష్ ఇంద్ర ఈ సిరీస్ కథనాన్ని చాలా వరకు వేగంగా, ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించే ప్రయత్నం చేశాడు. మొదటి ఎపిసోడ్ లోనే కథా నేపథ్యాన్ని, బంగ్లా వాతావరణాన్ని, పోచమ్మ తల్లి విగ్రహం తొలగింపు ద్వారా వచ్చే కాన్ ఫ్లిక్ట్ ను చాలా ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేశాడు. దేవుడి ఆగ్రహం అనే మిస్టికల్ పాయింట్‌కు, ఒక రివేంజ్ క్రైమ్ డ్రామాకు ముడిపెట్టిన విధానం బాగుంది. ఈ హత్యలు దేవుడి వల్ల జరుగుతున్నాయా లేక మనుషుల వల్ల జరుగుతున్నాయా అనే సస్పెన్స్‌ను దర్శకుడు స్క్రీన్ ప్లే ద్వారా ప్రేక్షకుల్లో మెయింటైన్ చేయగలిగాడు. కథను మొదలుపెట్టిన విధానం బాగుంది.. ప్రతీ సీన్ కూడా అమ్మవారిని ఎలివేట్ చేసుకుంటూ వెళ్లిపోయారు.. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి.. కథను ముందుకు వెనక్కీ జరుపుకుంటూ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసాడు దర్శకుడు రమేష్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 5వ ఎపిసోడ్ వరకు కూడా ఎక్కడా కథనం నెమ్మదించలేదు. ముఖ్యంగా నిడివి కూడా తక్కువగానే ఉండటంతో బోర్ కొట్టదు. అక్కడక్కడా చిన్నచిన్న లోపాలున్నా పెద్దగా కనబడవు. ప్రధానంగా ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ కథనంలో ఆసక్తి పెరిగింది.
మధ్యలో కొన్ని ట్విస్టులను ముందుగానే పసిగట్టేలా ఉన్నా కూడా కథనం బాగానే ఉంది. హారర్ థ్రిల్లర్స్ రెగ్యులర్‌గా చూసేవారికి ఇందులో ట్విస్టులు అర్థం అవ్వొచ్చు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎందుకో కాస్త రాసుకున్నట్లు అనిపిస్తుంది. పాత్రల మధ్య బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు.. పాత్రల నేపథ్యాలను ఇంకాస్త లోతుగా రాసుకుని ఉంటే సిరీస్ రేంజ్ మరింత పెరిగేది. పోచమ్మ తల్లి ఆగ్రహం గురించి మరికొన్ని బలమైన సన్నివేశాలు పడుంటే సిరీస్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లుండేది.. అయినా కూడా చాలా వరకు అద్భుతమైన కథనంతో ముందుకెళ్లింది. ముఖ్యంగా 4,5 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి.. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నాడు దర్శకుడు రమేష్. అచ్యుత్ కుమార్ క్యారెక్టరైజేషన్ సిరీస్‌కు ప్లస్ అయింది.. అలాగే స్నేహల్ కామత్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఓ మంచి మిస్టికల్ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్లకు పోచమ్మ బెస్ట్ ఛాయిస్.
నటీనటులు:
దర్శకుడు రమేష్ ఇంద్ర ఇందులో కీలకమైన బంగ్లా ఓనర్ పాత్ర చేసారు. ఆయన తన పాత్రకు న్యాయం చేసారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ఈ సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. తన లుక్, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఆ పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఫీమేల్ లీడ్‌గా చేసిన స్నేహల్ కామత్ తన పరిధి మేరకు మెప్పించింది. కన్నడ సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ నటన సిరీస్‌కు ప్లస్ అయ్యింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసారాయన. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
ఈ సిరీస్‌కు ప్రధాన బలం ఎల్.వి. ముత్తు గణేష్ అందించిన నేపథ్య సంగీతం. హారర్, మిస్టికల్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన BGM సిరీస్ స్థాయిని పెంచింది. వాతావరణాన్ని భయానకంగా మార్చడంలో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. లైటింగ్, కెమెరా యాంగిల్స్ తో బంగ్లాను, రాత్రి పూట జరిగే సన్నివేశాలను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. అనవసరమైన సాగదీతలు లేకుండా కేవలం 5 ఎపిసోడ్లకే పరిమితం చేయడం మంచి నిర్ణయం. దర్శకుడు రమేష్ ఇంద్ర కథను బాగా డీల్ చేసారు. ఆహాలో మంచి సిరీస్ వచ్చిందనే చెప్పాలి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా పోచమ్మ.. ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..!




