Malliswari @ 70: ఏడుపదుల వయసులో కూడా పదహారేళ్ల పడుచులా తుళ్లి పడుతున్న మల్లీశ్వరి

మల్లీశ్వరి.. ఓ దృశ్యకావ్యం. వెండి తెరమీద విరిసిన కవన పుష్పం. ఆనాడెప్పుడో తీసిన ఈ సినిమా. విడుదలై 70 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంకా నిత్య నూతనంగా వుండటమే మళ్లీ మళ్లీ ఆ చిత్రకావ్యాన్ని స్మరించుకోవడానికి కారణం.

Malliswari @ 70: ఏడుపదుల వయసులో కూడా పదహారేళ్ల పడుచులా తుళ్లి పడుతున్న మల్లీశ్వరి
Malliswari 1
Follow us

|

Updated on: Dec 20, 2021 | 4:39 PM

మల్లీశ్వరి @ 70. మల్లీశ్వరి.. ఓ దృశ్యకావ్యం. వెండి తెరమీద విరిసిన కవన పుష్పం. ఆనాడెప్పుడో తీసిన ఈ సినిమా. ఇంకా నిత్య నూతనంగా వుండటమే మళ్లీ మళ్లీ ఆ చిత్రకావ్యాన్ని స్మరించుకోవడానికి కారణం.

మ‌హాన‌టి భానుమతి నవరసన నటన.. మ‌హాన‌టుడు ఎన్టీఆర్ అద్భుత ప్రదర్శన.. దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి తపన. బి. ఎన్. రెడ్డి దర్శకచింతన మల్లీశ్వరిని మరపు రాని మహోత్తరంగా మలచాయి. అది డెబ్భై ఏళ్ల మల్లీశ్వరే అయినా- ఇరవైలకు తగ్గకుండా తుళ్లిపడుతూనే వుందింకా. ఏంటందులో దాగిన సొగసు- సౌందర్యం- నాణ్యతా- నైపుణ్యం.. ? అసలు ఆ సినిమాను మల్లీశ్వరి అనడం కన్నా ‘మళ్లీశ్వరి’ అంటే బావుంటుందేమో. ఎందుకంటే, మళ్లీ.. మళ్లీ.. చూడాలనిపించే మహత్తరమైన చిత్రమది. మల్లీశ్వరి అంతటి చిత్రరాజమే. ఇందులో అనుమానమే లేదు. ”పిలిచిన బిగువటరా’ అన్న భానుమతి బంగారు గొంతు వినబడగానే, ”మల్లీశ్వరి కదూ?!” అని ఈ తరం వారు కూడా అంటుంటారు. అది ఆ సినిమా గొప్పతనం.

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కథ… రాయలవారి గురించి అబాలగోపాలమూ చెప్పుకుంటూ వచ్చిన కథల్లోంచి పుట్టుకొచ్చిందే మల్లీశ్వరి. రాయలవారి సామ్రాజ్యంలో వీరాపురం అనే చిన్న పద్మశాలీ గ్రామం అది. మల్లి-నాగరాజులు బావమరదళ్లు. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగారు. మల్లి తల్లిదండ్రులు కలిగినవాళ్లు. నాగరాజుది నిరుపేద కుటుంబం. బావమరదళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యారు. మల్లి తల్లికి డబ్బు పిచ్చి. సంపద తప్ప మరోటి ఆమెకు పట్టదు. పట్టించుకోదు కూడా. వరసకు బావే అయినా నాగరాజుతో మల్లి తిరగడం ఆవిడకు నచ్చదు. పైగా ఈడొచ్చిన పిల్లాయే! నాగరాజు మంచి శిల్పి. అతని ఉలి తగిలిన ఏ రాయి అయినా సౌందర్యాన్ని సంతరించుకుంటుంది.. అయితే, కళ కూడు పెట్టదుగా! ఓ రోజు మల్లి నాగరాజులిద్దరూ తిరునాళ్లకెళతారు. వచ్చేటప్పుడు వర్షం కురుస్తుంది. దాంతో ఓ శిథిల సత్రంలో తలదాచుకుంటారు. సరిగ్గా అదే సమయానికి అక్కడ రాయలవారు తమ ఆస్థాన కవితో అక్కడికి వస్తారు. వచ్చినవారెవరో మల్లి, నాగరాజులకు తెలియదు. బావ కోసం మల్లి ఆడిపాడుతుంది. మల్లి నృత్యగానాలు రాయలవారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రేమికులిద్దరిని చూసి విజయనగర సామ్రాజ్యాధీశుడు ముచ్చటచెందుతాడు. మాటల సందర్భంలో రాయలవారే గనుక తన మల్లి నాట్యం చూస్తే రాణివాసపు పల్లకి పంపేవాడంటాడు నాగరాజు. తమకు రాయలవారు తెలుసని, పల్లకి పంపే ఏర్పాటు చేస్తానని ఆస్థాన కవి చెబుతాడు. ఇదంతా పరాచికమనుకుంటాడే తప్ప అదే నిజం అవుతుందని నాగరాజు ఊహించడు..

ఇలావుంటే అన్నయ్య కోసం మల్లి ఇంటికి వెళ్లిన నాగరాజు తల్లికి అక్కడ అవమానం జరుగుతుంది.. మల్లి తల్లి చిల్లి గవ్వ కూడా సంపాదించలేని నాగరాజుకు తన కూతురునిచ్చే ప్రసక్తే లేదని మల్లి తల్లి చెప్పేస్తుంది. ఈ విషయం నాగరాజుకు కూడా తెలుస్తుంది. చేతిలో డబ్బుంటే తప్ప మల్లి తనకు దొరకదని తెలుసుకుంటాడు నాగరాజు.. పని కోసం ఊరు వదిలివెళతాడు. నాగరాజు ఊరు వదిలి వెళ్లిన తర్వాత మల్లీశ్వరి కోసం అంత:పురం నుంచి రాణివాసపు పల్లకి వస్తుంది. తల్లి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. మల్లికి మాత్రం ఇష్టం వుండదు. మల్లి సర్వస్వమూ నాగరాజేగా! రాణివాసంలో మల్లి జీవితం పంజరంలో చిలుకలా అవుతుంది.. అక్కడ మల్లీశ్వరికి పరిచారిక జలజే తోడు, నీడ, నెచ్చెలి, సర్వస్వమూనూ!

మరోవైపు, నాగరాజు సంపాదనపరుడై ఊరికి తిరిగివస్తాడు. వచ్చి రావడంతోనే మల్లి రాణివాసానికి వెళ్లిందన్న వార్త తెలుస్తుంది. మల్లి దూరం కావడంతో నాగరాజు పిచ్చివాడవుతాడు. కనిపించిన ప్రతి శిలపై మల్లి ప్రతిరూపాన్ని చెక్కి వాటిని బేలగా చూస్తూ గడిపేస్తుంటాడు. విరాగిలా తిరుగున్న నాగరాజును రాచకోటకు చెందిన రాజశిల్పి చూస్తాడు. నాగరాజు శిల్ప చాతుర్యాన్ని చూసి పరమానందభరితుడవుతాడు. తన వెంట తీసుకువెళతాడు. అంత:పురంలో తయారవుతున్న నర్తనశాల మందిర నిర్మాణంలో పని ఇస్తాడు. కోటలో మల్లిని చూస్తాడు నాగరాజు. జలజ సాయంతో నదీ తీరాన ఇద్దరు కలుసుకుంటారు.. ఎన్ని నాళ్లకీ బతుకు పండెనో అంటూ మురిసిపోతారు. అక్కడ్నుంచి ఆ మరుసటి రోజు తప్పించుకుని వెళ్లిపోదామనుకుంటారు.. నాగరాజు మల్లి కోసం ఎదురుచూస్తూ వుంటాడు. మల్లి రాదు. మల్లి కోసం సాహసం చేసి కోట గోడ దూకుతాడు నాగరాజు. కోటలో ప్రవేశించిన నాగరాజును బంధిస్తారు భటులు. పురుషులతో రాణివాసపు స్త్రీ మాట్లాడకూడదు. కలవకూడదు. అలా చేస్తే ఇద్దరికి శిక్ష శిరచ్ఛేదమే. మల్లి నాగరాజులిద్దరిని రాజస్థానంలో ప్రవేశపెడతారు భటులు. ఇద్దరిని రాయలు గుర్తు పట్టేస్తాడు. మల్లి నాగరాజులు ప్రభువును వేడుకుంటారు… వర్షం కురిసిన సాయంత్రం సత్రంలో తన మనోహర నృత్యంతో తమను పరవశింపచేసిన మల్లిని… నర్తనశాలలో అపూర్వమైన శిల్పాలను సృష్టించిన నాగరాజును పెద్ద మనసుతో క్షమించేస్తారు. ప్రేమజంట ఆనందంతో రాజుగారికి వందనం చేస్తుంది…

Malliswari 6

Malliswari 6

మల్లీశ్వరి ఓ కమనీయ చిత్రం. తెలుగువారు సగర్వంగా చెప్పుకునే అద్భుత కళాఖండం. ఎటు చూసినా ఆ హోదా తగ్గకుండా నడిచే కథ బిగువు. కృష్ణశాస్త్రి సాహిత్యం. బి. ఎన్. రెడ్డి దర్శక నైపుణ్యం…సాలూరి రాజేశ్వరరావు సంగీతం.. ఘంటసాల, భానుమతి గార్ల గాత్రమాధుర్యం. ఒకరా ఇద్దరా అనేక మంది మహానుభావులు ఎంతగానో కృషి చేశారు.. బి. ఎన్. కొండారెడ్డి, ఎ. కె. శేఖర్, మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే, పసుమర్తి కృష్ణమూర్తి, ఎ.కృష్ణన్‌. మున్నగు సారథులందరూ కలసి ఓ శాశ్వత చిత్రమాధుర్యాన్ని రూపొందించేశారు. సినీప్రియుల-కళాభిరుచికి చిరునామాగా నిలిచే చిత్రశిల్పంలా తయారైంది మల్లీశ్వరి. మల్లీశ్వరి సినిమా పుట్టుక గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో వున్నాయి. బీఎన్ రెడ్డి స్వీయ ఆసక్తి వల్ల వెలుగులోకి వచ్చింది ఈ చిత్రకథాంశం. ఇది తొలుత ఓ రేడియో నాటికగా వచ్చిందని చెబుతారు. మల్లీశ్వరి మాతృక బుచ్చిబాబు రచన ”రాయల కరుణ కృతం” అంటారు. మల్లీశ్వరి ఇన్నేళ్లయినా తరగని కావ్యనిధిగా భాసిల్లుతోందంటే, కారణం.. ‘రాయల కరుణ కృత్యం’ అనే నాటికమేనన్నది నిర్వివాదాంశంగా భావిస్తారు. మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి 1947లో ప్రసారమైందీ నాటిక.

అందుకే మల్లీశ్వరి సినిమా కథలా అనిపించదు. అందులో ఏదో జీవం వుంటుంది. నిజజీవన చిత్రం అడుగడుగునా దర్శనమిస్తుంది. కుటుంబం- రాణీవాసపు వాసనలు.. రాయలవారి అభిరుచుల మీద ఓ ప్రత్యేక అవగాహన. వంటివి ఏ కాలానికైనా వర్తింపచేసుకునేలా వుంటాయి. ఎదగడం ఒదగడం మధ్య అంతరమేదో దర్శనమిస్తుంది. ఆ రెంటి మధ్య జీవనసమరమేదో కళ్లకు కడుతుంది. ఆనాడు ఆ చిత్రానికి హేమా హేమీల్లాంటి చిత్రనిపుణులు ఎక్కించిన రక్తమాంసాలు ఇప్పటికీ సజీవంగా వున్నాయి. మల్లీశ్వరీకీ- బుచ్చిబాబు రాయల కరుణ కృత్యం నాటికకు పోలికలేమిటి? రెంటిలోనూ శ్రీకృష్ణదేవరాయలే మహారాజు. రెంటిలోనూ కథానాయికలు రాణీవాసపు స్త్రీలే. రెంటిలోనూ రాణీవాసపు స్త్రీల ప్రియులు శిల్పులే. బుచ్చిబాబుగారి నాటికలో పాత్రలు మొత్తం నాలుగే. ఆ నాలుగూ మల్లీశ్వరి సినిమాలో కూడా ఇంచుమించు అవే స్వభావాలతో కనిపిస్తాయి. మరి వత్యాసాలంటారా ఎలాగూ వుంటాయి. నాలుగు పాత్రలతో నాటిక రాసినట్టు- సినిమా తీయలేం కదా. అందుకని, మార్పులూ చేర్పులూ ఎలాగూ తప్పవు. ఆ క్రమంలో తేడాలనేవి వద్దన్నా దర్శనమిస్తాయి.

Malliswari 4

Malliswari 4

నాటిక ప్రసారంలో బీఎన్ రెడ్డిగారి ముందుమాటలు వెలువడటం- నాటిక పుస్తకంగా అచ్చైనప్పుడు- ముందుమాటలో బుచ్చిబాబు మల్లీశ్వరితో కనబడే పోలిక వివరించడం.. వంటివి మల్లీశ్వరి- రాయల కరుణ కృతం కు పోలికలను తేట తెల్లం చేస్తున్నాయని చెప్పవచ్చు. నిజానికి రాయల కరుణ కృత్యం, ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ది ఎంపరర్‌ అండ్‌ ది స్లేవ్‌ గర్ల్‌ అనే కథ రెండింటినీ బి ఎన్‌ రెడ్డికి ఒకేలా అనిపించాయి. కొద్ది పాటి మార్పులు చేస్తే సినిమా తయారవుతుందని ఆయన భావించారు. బుచ్చిబాబును సంప్రదించారు కూడా! అయితే రాయల కరుణ కృత్యం నాటకం ప్రకారం మల్లీశ్వరి రాణి. సినిమాలో ఆ పాత్రను చెలికత్తెగా మార్చారు. దాంతో బుచ్చిబాబు అలిగి సినిమా నుంచి తప్పుకున్నారని కొందరు అంటుంటారు. ఏదైతేనేమీ తెలుగు సినీ సంగీతాన్ని అఖిలలోకానికి చవిచూపిన తెలుగు సినిమా మల్లీశ్వరి. ఇది మా సినిమా అని తెలుగువాడు గర్వంగా రొమ్ము విరుచుకుని చెప్పుకునే సెల్యూలాయిడ్‌ కావ్యం. మల్లీశ్వరి సినిమాతోనే తెలుగు సినీ సంగీతం కొత్త నడకలు సంతరించుకుంది.. ఆద్యంతమూ సంగీత ప్రాధాన్యత గల అపురూప చిత్రరాజం మల్లీశ్వరి. అందుకే ఇన్నాళ్లయినా, ఇన్నేళ్లయినా ఆ సినిమాను గుర్తుపెట్టుకున్నాం. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని మురిసిపోతున్నాం.

Malliswari 5

Malliswari 5

వాహినీ సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం. ఇది 1939లో విడుదలైంది. అందులో హీరో తన సహాధ్యాయులతో కలిసి హంపీ క్షేత్రానికి పిక్నిక్‌ కోసమని వెళతాడు. ఆ సన్నివేశాలను షూట్‌ చేయడం కోసం వాహినీ యూనిట్‌ అక్కడికి వెళ్లింది. ఆ సందర్భంగా హంపీలోని విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించారు దర్శకశ్రేష్ట బి.ఎన్‌.రెడ్డి. గర్భగుడిలో నిల్చుని ప్రార్థన చేస్తున్న బిఎన్‌కు ఆనాడు శ్రీకృష్ణదేవరాయులు పూజ చేసిన స్థలం ఇదే కదా అన్న విషయం స్ఫురించింది. వెంటనే ఆయన ఒళ్లంతా పులకించిపోయింది. ఆంధ్రభోజుడుగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన శ్రీకృష్ణదేవరాయల చుట్టూతా కథ అల్లుతూ అప్పటి వాతావరణాన్ని ప్రతిబించించేలా ఓ అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని నిర్మించాలని అనుకున్నారు బిఎన్‌..అలా బిఎన్‌ మనసులో మల్లీశ్వరి చిత్రానికి సంబంధించిన తొలి బీజం పడింది.

Malliswari 1

Malliswari 1

కథ తయారైంది. మరి సంభాషణలు ఎవరు రాస్తారు? ఎవరితో రాయించాలి? ఈ ప్రశ్నలు తలెత్తినప్పుడు బిఎన్‌కు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక్కరే గుర్తుకొచ్చారు. వందేమాతరం సినిమా ప్రివ్యూలో కృష్ణశాస్త్రిని కలుసుకున్నారు బిఎన్‌.. మొదటి పరిచయంలోనే ఇద్దరూ సన్నిహితులయ్యారు.. వందేమాతరం తర్వాత తను తీసిన మూడు సినిమాల్లో దేవులపల్లితో కనీసం ఒక్క పాటయినా రాయించాలనుకున్నారు బిఎన్‌.. కానీ శాస్త్రి రాస్తేగా! సరే… 1949లో కృష్ణశాస్త్రి మద్రాస్‌కొచ్చేశారు. మల్లీశ్వరి కథకు కృష్ణశాస్త్రి మాటా..పాటలుంటే తప్ప దృశ్య కావ్యమవ్వదని బిఎన్‌ గ్రహించేశారు.. అందుకే దేవులపల్లివారిని బతిమాలి.. సినిమా పద్దతులన్నీ విడమర్చి వివరించి మాటలు.. పాటలు రాయించారు.. భావ కవిత్వానికి ఆద్యుడైన కృష్ణశాస్త్రి సినీరంగ ప్రవేశంతో తెలుగు పాట సుగంధాలను అద్దుకుంది.. సాహిత్య గుబాళింపు సంతరించుకుంది. కృష్ణశాస్త్రికి శ్రీశ్రీకి తేడా ఏమిటని ఓ పెద్ద మనిషిని అడిగితే- కృష్ణశాస్త్రి సినిమా పాటలు రాస్తే తప్ప కవిగా జనంలోకి రాలేదు. శ్రీశ్రీ సినిమా పాటలు రాసినా కూడా మహాకవి స్థానాన్ని వదులుకోలేదు..అని ఛలోక్తి విసిరాడు… సరే… కృష్ణశాస్త్రి కలం విదిల్చాక మ్యూజిక్‌ కంపోజింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి.

చిన్నప్పటి మల్లి..నాగరాజులు పాడుకుంటారే ఆ పాటను మొదటగా రాశారు కృష్ణశాస్త్రి… పాట విన్నవెంటనే బిఎన్‌…కుదేల్‌ బ్రదర్‌…కుదేల్‌ అంటూ కె.వి.రెడ్డి దగ్గర తన ఆనందాన్ని వెలిబుచ్చుకున్నారు.. ఆ తర్వాత కృష్ణశాస్త్రితో ఆ పాటను సినిమాలో వాడటం లేదని చల్లగా చెప్పేశారు..కారణం సాహిత్య బరువు పెరగడమే! మల్లి..నాగరాజులు పద్మశాలీల పిల్లలు.. చదువు సంధ్యలు లేనివాళ్లు..దానికి తోడు చిన్న పిల్లలు.. వాళ్లకు తగినట్టుగా పాట వుండాలిగా… అదే చెప్పారు బిఎన్‌…కృష్ణశాస్త్రికి కూడా నిజమేననిపించింది.. అప్పుడు కోతిబావకు పెళ్లంట పాట రాశారు. ఈ పాట పాడింది వల్లూరి శకుంతల… గాదె రామకృష్ణారావు.. ఆ రోజుల్లో వీరిద్దరూ రేడియో కార్యక్రమమైన బాలానందంలో పాటలు పాడుతుండేవారు.. పిల్లల పాటలు పిల్లలతోనే పాడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బిఎన్‌… రేడియో అన్నయ్య న్యాపతి రాఘరావుకు రిక్వెస్ట్‌ చేసి పిల్లలతో పాడించారు.. అన్నట్టు మల్లీశ్వరిలో రాయలవారి ఆస్థానకవి వేషం వేసింది కూడా న్యాపతి రాఘవరావే!

మల్లీశ్వరి సాహిత్యం ఎంత గొప్పగా వుంటుందో సంగీతమూ అంతే గొప్పగా వుంటుంది.. ఆరు నెలల పాటు అహర్నిశమూ శ్రమించిన సాలూరి రాజేశ్వరరావు మాస్టారు సినిమాను సంగీత భరితంగా తీర్చిదిద్దారు.. ప్రతి పాటను రాసిన తర్వాతే బాణీలు కట్టారు.. అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా నిర్వహణ చూసుకున్నారు.. ఘంటసాల…భానుమతి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రిహార్సల్స్‌కు వచ్చేవారు..వాయిద్యకారులంతా టైమ్‌కంటే ముందే వచ్చి వాయిద్యాలను సరి చేసుకునేవారు.. అందుకే మల్లీశ్వరి సంగీతం అజరామరంగా నిలిచింది. సాలూరిని రసాలూరు రాజేశ్వరరావు అని ఎందుకంటారో మల్లీశ్వరి సంగీతం విన్నవాళ్లకి అర్థమవుతుంది. ఎంత గొప్ప సంగీతమని! శిరస్సు వంచి దండంపెట్టాలనిపిస్తుంది. సాహిత్యంతో సంగీతం పోటీ పడింది కాబట్టే ఆరు దశాబ్దాలైనా పదే పదే విని మురిసిపోతున్నాం. పాడుకుంటూ పరవశించిపోతున్నాం.. మల్లీశ్వరి సినిమాకు ముందు వరకు వాహినీ సంస్థ తీసిన ప్రతీ సినిమాలో చిత్తూరు నాగయ్య వున్నాడు.గమ్మత్తేమిటంటే మల్లీశ్వరిలో ఆయనెక్కడా కనబడడు.. కానీ ఆయన కంఠం మాత్రం వినిపిస్తుంది.. సినిమా ఆరంభంలో వచ్చే వాయిస్‌ ఓవర్‌ నాగయ్యదే! పురందర దాసు రాసిన శ్రీగణనాథ బృందగానంతో సినిమా మొదలవుతుంది… విఘ్నేశ్వర స్తుతితో సినిమాలను ఆరంభించడం బిఎన్‌కు అలవాటు.. కోతిబావకు పెళ్లంట పాట ఆ రోజుల్లో పెద్ద హిట్‌.. ఎంతగా అంటే పెళ్లికావల్సిన అమ్మాయిలు తమకు వరసైన బావను ఆటపట్టిస్తూ తెగ పాడేటంతగా. ఈ పాటలో ఓ చోట కృష్ణశాస్త్రి తురాయి అన్న పదం వాడారు. తురాయి అనేది తెలుగు పదం కాదు.. హిందీలో తురాహ్‌ అనీ.. అరబిక్‌లో తుర్రా అంటారు. మరి కృష్ణశాస్త్రి ఎందుకు వాడినట్టు? అంటే రాయలకాలంలో బహమనీ సుల్తానుల తాకిడి వుండేదని.. వారి భాష ప్రభావం తెలుగు పై పడిందని చెప్పడానికే ఆ పదం వాడారు.

ఇక పరుగులు తీయాలి పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. మధ్యమావతి.. బృందావన సారంగ రాగాల మిశ్రమంతో ఈ పాట సాగుతుంది..ఘంటసాల…భానుమతి పోటీ పడి ఆలపించిన ఈ పాటలో దేవులపల్లి సాహిత్యం వినసొంపుగా వుంటుంది.. బిర బిర… చరచర… గుంపులు గుంపులు.. బారులు బారులు… ఇవన్నీ కృష్ణశాస్త్రికి సొంతమై పద ప్రయోగాలు. పిలచిన బిగువటరా అన్న పాట అద్భుతం. అచ్చమైన జావళికి దీనికి మించిన ప్రామాణికత వుండదు.. కాఫీ రాగంలో సంపూర్ణంగా ట్యూన్‌ చేసిన సినిమా పాట ఏదైనా వుందా అని అడిగితే ఈ పాట తప్ప మరోటి గుర్తుకురాదు.

మల్లీశ్వరి పాటల్లో మీకు ఏది ఎక్కువ ఇష్టమని సాలూరిని అడిగితే ఆయన ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు అని చెప్పేవారు.. అనుభూతించడంమంటే ఏమిటో ఈ పాట వింటే తెలుస్తుంది. ఈ పాటలోని రెండు సాకీలను.. రెండు పల్లవులను.. మొదటి చరణాన్ని భీంప్లాస్‌ రాగంలోనూ.. రెండో చరణాన్ని కళింగడ, కీరవాణి రాగంలోనూ.. మూడో చరణాన్ని హంసానంది రాగంలోనూ స్వరపరిచారు మాస్టారు. ఔనా నిజమేనా పాటను మోహన రాగాన్ని ప్రధానం చేసుకుంటూ రసానుగుణంగా అన్యస్వరాలు చేరుస్తూ అమోఘంగా స్వరపరిచారు. మనసున మల్లెల మాలలూగెనె పాటను ఎప్పుడైనా గమనించారా? ఈ పాటకు పల్లవి లేదు. చరణాల విభజన వుండదు. అదే ఈ పాట ప్రత్యేకత.. యమన్‌ కళ్యాణి రాగం పాటకు ఆధారం. నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు ఈ పాట వింటుంటే ఎప్పుడు నిద్రలోకి జారుకుంటామో తెలియనంతటి సుతిమెత్తటి అనుభూతిని హాయిని కలిగించే పాట ఇది. ఎందుకే నీకింత తొందరా పాటను ఖమాస్‌ రాగంలో స్వరపరిచారు. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. భానుమతి గొంతు వినసొంపుగా వుంటుంది.

సెమీ క్లాసికల్‌ టచ్‌తో స్వరపరచిన ఈ పాటలో శాస్త్రీయత పాలు కాస్త ఎక్కువగా వున్న ఈ పాటను నేటి తరం గాయనీమణులు ప్రాక్టీసు చేస్తే ఎలాంటి పాటనైనా అవలీలగా పాడేయగలరు.. సినిమా సక్సెస్‌ అనేది నటీనటుల అభినయకౌశలం మీదే ఆధారపడి వుంటుంది. పాత్రధారులు సన్నివేశాలను రసరమ్యంగా పండిస్తేనే- కథాకథనం రక్తికడుతుంది. ఈ విషయంలో మల్లీశ్వరి చిత్రం చక్కని పాఠ్యాంశంతో సమానమని చెప్పకతప్పదు. నాయికా నాయికలకే పరిమితం కాదు. చిత్రంలోని ప్రతి పాత్ర అర్థవంతమైన నటనతో వీక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. ఈ పరిణతే మల్లీశ్వరి చిత్రాన్ని క్లాసిక్‌గా తీర్చిదిద్దింది. ఏదైనా సినిమా సక్సెస్‌ అయితే అది హీరో హీరోయిన్‌ల క్రెడిట్‌గా భావించే రోజులొచ్చాయి. లేదా డైరెక్టర్‌ ఖాతాలో పడే సందర్భం వచ్చింది. కథని బట్టి నటీనటులు అన్న పద్ధతి పోయి- హీరోలని బట్టి కథలు అల్లే కాలం వచ్చింది. అందుకే నాటి సినిమాలకి, నేటి సినిమాల్లో ప్రమాణాల్లో అంత తేడా. మల్లీశ్వరి సినిమానే తీసుకుంటే- అందులో నాయికా నాయికలే కాదు- ప్రతి పాత్ర అర్థవంతమైన నటనతో రక్తికట్టించింది. మల్లీశ్వరిలో కథానాయకుడి తల్లి పాత్రలో వెంకుమాంబ నటించారు అనేకన్నా జీవించారు అని చెప్తేనే సమంజసం.

Malliswari 7

Malliswari 7

ఈ పాత్ర నేపథ్యం ఎంతో విషాదభరితం. భర్త చనిపోతాడు. కులవృత్తి అయిన నేతపనిని కొనసాగించే నైపుణ్యం వుండదు. పేదరికం వల్ల ఏర్పడిన న్యూనత లోలోపల తొలిచేస్తుంటుంది. ఆమెకి ఒక్కగానొక్క కొడుకు. సంపన్నుడైన మేనమామ కూతురితో అతనికి పెళ్ళిచేయాలంటే- తాహతు సరిపోదు. దీంతో అతడు రెక్కల కష్టాన్ని నమ్ముకుని దేశాంతరాలు వెళ్లిపోతాడు. కొన్నాళ్లకి ఆ బిడ్డడు సంపాదనాపరుడై తిరిగొస్తాడు, కానీ- అప్పటికే అతడు కోరుకున్న పిల్ల రాజాస్థానానికి వెళ్లిపోతుంది. కొడుకు ప్రయోజనకుడై తిరిగొచ్చాడన్న ఆనందం ఒకపక్క- గడపలో అడుగుపెడుతుందనుకున్న కోడలు పిల్ల దూరమయ్యిందే అన్న బాధ మరోపక్క. ఈ మిశ్రమభావాలను మల్లీశ్వరి చిత్రంలో వెంకుమాంబ అద్భుతంగా ప్రదర్శించారు. రాయలసీమకు చెందిన వెంకుమాంబకు రంగస్థల కళాకారిణిగా అనుభవం వుండటంతో అవలీలగా పాత్రలో జీవించారు. ఇక రుష్యేంద్రమణి నటన గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. వందల చిత్రాలలో నటించి మెప్పించిన నటీమణి. మల్లీశ్వరి సినిమాలో కథానాయిక తల్లిగా రుష్యేంద్రమణి పలికించిన హావభావాలు సన్నివేశభరితంగా వుంటాయి. కథకి బలమిచ్చే ఈ పాత్రలో ఆమె చక్కగా రాణించి ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు.

డైలాగులు కూడా నప్పినట్టు వుంటాయే తప్పా- ఎక్కడా అతికినట్టుండవు. మల్లీశ్వరి చిత్రంలో మరొక మరపురాని పాత్ర- మోపర్రుదాసు. నిస్వార్థ శిల్పాచార్యుడి పాత్ర అది. కథానాయకుడు నాగరాజు హింపీనగర ప్రాంతంలో రాతికొండల వద్ద బొమ్మలు చెక్కుతుంటే చూసి- అతడి ప్రతిభని గ్రహిస్తాడాయన. రాయలవారి ఉద్యానవనంలో తాను నిర్మిస్తున్న నర్తనశాల పనులకి నాగరాజు సేవలు ఉపయోగించుకోవాలని సంకల్పిస్తాడు. ఒప్పిస్తాడు కూడా. చిత్ర కథలో ఇదొక కీలకమైన మలుపు. హరికథాగానంలో నిష్ణాతుడైన మోపర్రుదాసు ఈ పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. నర్తనశాల నిర్మాణాన్ని పర్యవేక్షించే రాజప్రతినిధి పాత్రలో కె.వి.సుబ్బారావు రాణించారు. మంచి విగ్రహం, ధీటైన కంఠస్వరం కలిగిన సుబ్బారావు ఈ పాత్రలో రాజసమొలికించారు. మల్లీశ్వరి చిత్రంలో పూజారి పాత్ర గుర్తుందా..? అదేనండీ- ప్రేమికులకు శుభం కలగాలని, వారి ప్రణయయాత్ర విజయం కావాలని దీవిస్తాడే- ఆయనే ఈ పూజారి. సి. నాగేశ్వరరావు ఈ పాత్రని పోషించి మెప్పించారు. వాహినీ వారి చిత్రాలలో చాలాచోట్ల ఈయన కనిపిస్తారు. నాగేశ్వరరావు మల్లీశ్వరి చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌ కూడా బాధ్యతలు పంచుకున్నారు. ఇక సురభి కమలాబాయి, గంగారత్నంల నటన ఆ పాత్రలకే వన్నెతెచ్చింది.

తెలుగుపల్లె సంప్రదాయాలకు అద్దంపట్టడంతోపాటు మాతృమూర్తుల మమతానురాగాల్ని వారు చక్కగా పండించారు. మల్లీశ్వరి చిత్రంలో కథానాయిక మేనమామ గుర్తున్నారా..? ఆయనేనండీ- విజయనగర పద్మశాలీ కుటుంబాలలో పెద్దమనిషిగా చెలామణి అయ్యే హనుమంతప్పగారు. ఈ పాత్రలో వంగర వెంకట సుబ్బయ్య జీవించారు. దొరస్వామిగా కూడా ఆయన సుపరిచితులు. పాత్రానుగుణమైన సంభాషణలు, మాటల్లో విరుపుతో దొరస్వామి ఆకట్టుకుంటారు. సుమారు మూడు వందల సినిమాల్లో ఆయన నటించారు. మల్లీశ్వరిలో తన వన్నెచిన్నెలతో ఆకట్టుకున్న మరో అభినేత్రి టి.జి. కమలాదేవి. ఈ చిత్రంలో మహారాణి ఇష్టసఖిగా ఆమె ప్రదర్శించిన నటన నవరసభరితం. జుంజుంజుం పాటతోపాటు ఎవరే పిలిచేరల్లన మెల్లన. వంటి బృందగీతాలలో ఆమె మెరిసిపోయారు. దృశ్యకావ్యంగా మారిన మల్లీశ్వరి ద్వారా కలకాలం గుర్తుండిపోయారు.

మొత్తం ఆరు లక్షల రూపాయలతో ఎన్నో కష్టాలు పడి సినిమాను పూర్తి చేశారు. డిసెంబర్‌ 20, 1951న మల్లీశ్వరి ప్రేక్షకుల ముందుకొచ్చింది. 12 కేంద్రాలలో విడుదలైతే అన్నింటా 70 రోజుల వరకు ఆడింది. విజయవాడ సరస్వతీ టాకీస్‌లో మాత్రమే డైరెక్ట్‌గా వంద రోజులు ఆడింది. ఇదంతా ఫస్ట్‌ రిలీజ్‌ వరకే. ఆ తర్వాత ఎప్పుడు మల్లీశ్వరి విడుదలైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1952లో బీజింగ్‌లో జరిగిన ఈస్ట్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమయ్యింది. అలా ఫారిన్‌ వెళ్లిన మొదలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. మల్లీశ్వరికే దక్కిన మరో ఘనత చైనీస్‌ భాషలో అనువాదం కావడం. 15 ప్రింట్లతో మార్చి 14, 1953లో విడుదల చేశారు. ఇంగ్లీషులో కూడా డబ్‌ చేయిద్దామనుకున్నారు బిఎన్‌. ఆయన కోరిక ఎందుకో నెరవేరలేదు. మల్లీశ్వరి ఓ కావ్యం…అనిర్వచనీయమైన భావం. సంగీత సాహిత్య సమాహారం. తెలుగు సినీ కళామతల్లి మెడలో మెరుస్తోన్న పచ్చల హారం. అదో కళాఖండం. రసజ్ఙులకు అది అమృతభాండం. మల్లీశ్వరికి సాటి మల్లీశ్వరే!

Read Also…  తండ్రి భుజాలపై కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..