AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trimukha Movie Review: త్రిముఖ రివ్యూ.. సన్నీ లియోన్ తెలుగు సినిమా ఎలా ఉందో తెలుసా..?

గ్లామర్ క్వీన్ సన్నీలియోన్ పోలీస్ ఆఫీసర్‌గా, పాపులర్ హిందీ సిరీస్ 'CID' ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ కీలక పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రిముఖ. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ త్రిముఖ మిస్టరీని ఆడియన్స్ ఛేదించారా..? సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

Trimukha Movie Review: త్రిముఖ రివ్యూ.. సన్నీ లియోన్ తెలుగు సినిమా ఎలా ఉందో తెలుసా..?
Trimukha Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 10:03 PM

Share

మూవీ రివ్యూ: త్రిముఖ

నటీనటులు: సన్నీ లియోన్, యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, ఆదిత్య శ్రీవాస్తవ (CID ఫేమ్), అషు రెడ్డి, మొట్టా రాజేంద్రన్, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు.

సంగీతం: వినోద్ యాజమాన్య

ఎడిటింగ్: రాము

దర్శకత్వం: రాజేష్ నాయుడు

నిర్మాతలు: శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి

గ్లామర్ క్వీన్ సన్నీలియోన్ పోలీస్ ఆఫీసర్‌గా, పాపులర్ హిందీ సిరీస్ ‘CID’ ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ కీలక పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రిముఖ. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ త్రిముఖ మిస్టరీని ఆడియన్స్ ఛేదించారా..? సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

సిటీలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తుంటాయి. మూడు ముఖాలున్న ఒక విచిత్రమైన మాస్క్ ధరించిన వ్యక్తి ఈ ఘాతుకాలకు పాల్పడుతుంటాడు. ఈ సీరియల్ కిల్లర్ కేసును డీల్ చేసే బాధ్యత ఏసీపీ శివాని రాథోడ్ (సన్నీ లియోన్) తీసుకుంటుంది. మరోవైపు డాక్టర్ యోగి (యోగేష్ కల్లె) మూఢనమ్మకాలకు వ్యతిరేకం. దెయ్యాలు, ఆత్మలు లేవంటూ.. వాటి పేరుతో మోసాలు చేసే బాబాల గుట్టు రట్టు చేస్తుంటాడు. యోగి టాలెంట్ చూసిన ఒక ప్రొఫెసర్ (ఆదిత్య శ్రీవాస్తవ).. అతనికి మూడు క్లిష్టమైన కేసులను అప్పగించి, దమ్ముంటే ఆ ఆత్మల మిస్టరీని సాల్వ్ చేయమని సవాల్ విసురుతాడు. ఆ సవాల్‌ను స్వీకరించిన యోగికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి..? అసలు ఆ ప్రొఫెసర్ ఇచ్చిన కేసులు ఎవరివి? ఆ మాస్క్ వేసుకుని హత్యలు చేస్తున్నది ఎవరు? ఈ కథలో యాక్సిడెంట్ అయిన వ్యక్తికి సంబంధం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే..

కథనం:

సన్నీ లియోన్ తెలుగులో నటిస్తుండటం.. అదీ ఒక మర్డర్ మిస్టరీ కావడంతో త్రిముఖ సినిమాపై ఓ రకమైన ఆసక్తి ఉంది. దర్శకుడు రాజేష్ నాయుడు ఎంచుకున్న పాయింట్, ట్విస్టులు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం చుట్టూ తిరుగుతుంది. ఇది కాస్త సాగదీసినట్టు అనిపించినా, ప్రొఫెసర్ ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే సెకండాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఒకపక్క హీరో ఆత్మల కేసును విచారించడం, మరోపక్క సన్నీ లియోన్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం.. ఇలా రెండు ట్రాక్‌లను ప్యారలల్‌గా నడపడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగున్నప్పటికీ, సినిమాను పూర్తిగా ముగించకుండా అనేక ప్రశ్నలను వదిలేసి ‘పార్ట్-2’కి లీడ్ ఇవ్వడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టి, అనవసరమైన సీన్స్ కట్ చేసి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. సన్నీ లియోన్ కారణంగా ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

నటీనటులు:

సన్నీ లియోన్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించినా, ఆమె పాత్రకు తగినంత నిడివి, ప్రాధాన్యత దక్కలేదనిపిస్తుంది. ఒక పాటలో మెరిసింది కానీ, నటిగా ఆమెను ఇంకా బాగా వాడుకునే స్కోప్ ఉంది. యోగేష్ కల్లె యోగి పాత్రలో బాగానే నటించాడు. ముఖ్యంగా మిస్టరీలను ఛేదించే సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. సిఐడి ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ ప్రొఫెసర్ పాత్రలో చాలా హుందాగా నటించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఆకృతి అగర్వాల్ గ్లామర్‌తో పాటు నటనతోనూ మెప్పించింది. ప్రవీణ్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. అషు రెడ్డి, షకలక శంకర్ తదితరులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ టీం:

పాటలు వినడానికి పర్లేదనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మరీ లౌడ్‌గా ఉంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో వాడిన AI విజువల్స్ కొత్తగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ ఓకే కానీ, నైట్ ఎఫెక్ట్ షాట్స్‌లో లైటింగ్ ఇంకాస్త క్లియర్‌గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ పర్లేదు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా త్రిముఖ.. ట్విస్టులున్నాయి.. కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ..