Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ తండ్రి సమానులుగా భావించింది.. అదే గౌరవం ఇచ్చింది ఆయనకే..
విజయా ప్రొడక్షన్స్ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణితో నటరత్న ఎన్టీఆర్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. పాతాళభైరవి వంటి అద్భుత చిత్రాలతో ఎన్టీఆర్ స్టార్‌గా ఎదగడానికి విజయా సంస్థ పునాది వేసింది. నాగిరెడ్డిని.. నాన్నగారు అని పిలిచేంత ఆత్మీయత వారి మధ్య నెలకొంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాగిరెడ్డికి తన కృతజ్ఞతను చాటుకోవడం వారి బంధానికి నిదర్శనం.

టాలీవుడ్‌లో విజయా ప్రొడక్షన్స్ ఎంతటి ఘనచరిత్ర ఉందో.. వారి సినిమాల నిర్మాణం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంస్థ తీసిన సినిమాలు ఘనవిజయం సాధించడంతోనే.. ఎన్టీఆర్ స్టార్‌గా ఎదిగారు. తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నారు. నా జీవితాన్ని రూపుదిద్దుకుంది, చిత్ర నిర్మాణంలోని విలువల స్థాయి తెలుసుకుంది.. విజయా సంస్థ నీడలో ఉన్న ఆ రెండేళ్ల కాలంలోనే అని కృతజ్ఞతతో చెప్పేవారు. 1949 నుంచి విజయా సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది. మన దేశం చిత్రంతో ఎన్టీఆర్ పరిచయమైనప్పటికీ, ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. అయితే, దానికంటే ముందు విజయా వారి షావుకారు 1949 నవంబర్ 5న విడుదలైంది. షావుకారు కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా, నాగిరెడ్డి, చక్రపాణిలు చిత్ర నిర్మాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు తీయాలని భావించి, మొదటి సినిమాగా పాతాళభైరవిని ఎన్నుకున్నారు. దర్శకుడిగా కె.వి.రెడ్డిని నియమించి, తమ తొలి చిత్రంలో హీరోగా నటించిన ఎన్టీఆర్‌ను పిలిపించారు. రెండేళ్లపాటు తాము నిర్మించే చిత్రాల్లోనే నటించాలని, బయట ఎక్కడా నటించకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్టీఆర్ దీనికి అంగీకరిస్తూ, విజయా వారు నిర్మించే నాలుగు చిత్రాల్లో తననే హీరోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డి, చక్రపాణిలు దీనికి అంగీకరించారు. అయితే, దర్శకుడు కె.వి.రెడ్డి మాత్రం అభ్యంతరం చెప్పారు. పాతాళభైరవిలో ఏఎన్ఆర్‌ను తీసుకోవాలని ఆయన భావించారు, ఎందుకంటే బాలరాజు, కీలుగుర్రం వంటి చిత్రాలతో ఏఎన్ఆర్ అప్పటికే బాగా పాపులర్. కొత్త హీరో ఎన్టీఆర్‌తో జానపద చిత్రం తీయడం రిస్క్ అవుతుందని కె.వి.రెడ్డి వాదించినా, నాగిరెడ్డి, చక్రపాణిలు ఒప్పుకోలేదు. విజయా వారి ఒప్పందం ప్రకారం, ఎన్టీఆర్‌కు మొదటి ఏడాది నెలకు 500 రూపాయలు, సినిమాకి 5,000 రూపాయలు ఇచ్చారు. రెండవ ఏడాది నెలకు 750 రూపాయలు, సినిమాకు 7,500 రూపాయలు చెల్లించారు.
పాతాళభైరవి నిర్మాణ సమయంలో ఎన్టీఆర్ సన్నగా ఉండటంతో, వ్యాయామం చేసి ఒళ్లు పెంచమని నాగిరెడ్డి, చక్రపాణిలు సలహా ఇచ్చారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు వాహిని స్టూడియోకి వెళ్లి రెండు గంటలసేపు కర్రసాము, కత్తి ఫైటింగ్ నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఒక రోజు ఉదయం, నాగిరెడ్డి దగ్గరికి వెళ్లి.. క్యాంటీన్‌లో పెడుతున్న టిఫిన్ నాకు సరిపోవడం లేదు. ఎక్కువ సేపు వ్యాయామం చేస్తుండటం వల్ల బాగా ఆకలి వేస్తోంది. మరో రెండు ఇడ్లీలు పెట్టమని మీరు చెబుతారా?” అని ఇబ్బంది పడుతూ అడిగారు. నాగిరెడ్డి మీకు ఏవి కావాలన్నా అడిగి తీసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఎన్టీఆర్ చక్రపాణిని చక్కన్న అని, నాగిరెడ్డిని నాన్నగారు అని ఆప్యాయంగా పిలిచేవారు. నాగిరెడ్డి, చక్రపాణిలు కూడా ఎన్టీఆర్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. పాతాళభైరవి చాలా కేంద్రాల్లో వంద రోజులు ఆడడంతో, సినిమాలో నటించిన ఎన్టీఆర్, ఎస్వీఆర్, రేలంగిలకు బ్యూక్ కార్లను బహుమతిగా ఇచ్చారు. దాని ఖరీదు ఆ రోజుల్లో 6000 రూపాయలు. మా నాన్నగారు ఇచ్చిన కారు అని ఆ కారును చాలాకాలం పదిలంగా చూసుకున్నారు ఎన్టీఆర్.
1952లో విజయా సంస్థతో ఎన్టీఆర్ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత, నాగిరెడ్డి “వేరే సినిమాల్లో మీరు నటించవచ్చు” అని చెప్పగానే, ఎన్టీఆర్ “కాల్ షీట్ల కోసం నా దగ్గరికి ఎవరు వచ్చినా, విజయా వారు పిలిస్తే వెంటనే వెళ్లిపోతాను అని చెబుతాను నాన్నగారూ” అన్నారు. ఆ మాట మీద నిలబడ్డారు. వారు ఎప్పుడు పిలిచినా కథ ఏమిటి, దర్శకుడు ఎవరు అని అడగకుండానే వెంటనే డేట్స్ ఇచ్చేవారు. మాయాబజార్ చిత్రం విడుదలైనప్పుడు కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ క్యాలెండర్లు 40,000 ప్రింట్ చేసి అమ్మారు. జనం వాటిని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో ఉంచుకున్నారు, కొందరైతే పూజాగదిలో పెట్టుకుని పూజలు కూడా చేసేవారు. విజయా సంస్థతో సినిమాలు తీయకపోయినా, నాగిరెడ్డి, చక్రపాణితో ఎన్టీఆర్ అనుబంధం కొనసాగించారు. 1983లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు నాగిరెడ్డిని హైదరాబాద్ పిలిపించారు. ప్రమాణ స్వీకారం అయ్యాక, ఆయన్ని తనతో పాటు సెక్రటేరియట్ కు తీసుకెళ్లి, తన సీటులో కూర్చుని ఎదురుగా ఉన్న నాగిరెడ్డితో “ఒకప్పుడు మీరు ఇచ్చిన చేయూతతోనే నేను ఇంతవాణ్ని కాగలిగాను. ఈ విజయం మీదే. ఈ రాజ్యం మీదే. నా చేత మంచి పాలనను తెలుగువారికి ఇప్పించండి” అని ఎన్టీఆర్ చేతులు జోడించేసరికి, నాగిరెడ్డి ఆనందం పట్టలేక ఆయన్ని కౌగలించుకున్నారట. ఇది వారి మధ్య ఉన్న అపూర్వమైన బంధానికి నిదర్శనం అని అందరూ చెబుతుంటారు.
(ఈ సమాచారం సీనియర్ జర్నలిస్టులతో పాటు ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది)
Also Read: టెన్త్, ఇంటర్‌లో హైపర్ ఆది మార్క్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
