Manna Dey: స్వర మాధుర్యంతో మనసు హత్తుకునే మధుర గీతాలకు పెట్టిన పేరు మన్నాడే!
ప్రబోధ్ చంద్రదేవ్. ఈ పేరును గుర్తుపట్టడం చాలా కష్టం. అదే మన్నాడే అంటే మాత్రం నిన్నని తరం, అభిరుచి వున్న నేటి తరం మనవాడే కదా అనుకుంటారు. అదే మన్నాడే స్పెషాలిటి.
Manna Dey 103rd Birth Anniversary: ప్రబోధ్ చంద్రదేవ్. ఈ పేరును గుర్తుపట్టడం చాలా కష్టం. అదే మన్నాడే అంటే మాత్రం నిన్నని తరం, అభిరుచి వున్న నేటి తరం మనవాడే కదా అనుకుంటారు. అదే మన్నాడే స్పెషాలిటి. ఇవాళ ఆయన జయంతి. మన్నాడే తన 60 ఏళ్ల సినీ జీవితంలో మిగతా వారితో పోలిస్తే పాడింది కొద్ది పాటలే. అయితేనేం ఆ పాటలే మన్నాడేను ఆప్తుడ్ని చేసింది. మన్నాడే కుర్రవాడిగా వున్నప్పుడే కూనిరాగాలు తీసేవాడు. అదీ రాగయుక్తంగా. మన్నాడే చిన్నాన్న కృష్ణచంద్రదేవ్ మంచి సంగీత విద్వాంసుడు. ఆయన దగ్గర సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నాడు మన్నాడే. చిన్నాన్న ప్రభావం మన్నాడేపై చాలానే ఉంది.
పిల్లోడి సంగీతాభిలాషను, స్వర మాధుర్యాన్ని గమనించిన బాబాయ్ కృష్ణచంద్రదేవ్ తనతో పాటు ముంబాయికి తీసుకెళ్లాడు. అక్కడ హెచ్‌పి దాస్ దగ్గర అసిస్టెంట్‌గా చేర్పించాడు. సహాయకుడిగా వుంటూనే ఠుమ్రీ, భజన్, ఖవాలీలను అభ్యసించాడు. సచిన్‌దేవ్ బర్మన్‌కు సహాయకుడిగా చాలా సినిమాలకు పని చేశాడు మన్నాడే. ఆ తర్వాత స్వతంత్రంగా సంగీత దర్శకత్వం వహించడం మొదలు పెట్టారు. హిందీలోనూ, బెంగాలీలలోనూ పలు చిత్రాలకు స్వరకర్తగా వ్యవహరించాడు. బ్రేక్ త్రూ కోసం ఎదురుచూస్తున్న సమయంలో రామరాజ్య సినిమాలో వాల్మీకి పాత్రధారికి పాడే అవకాశం దొరికింది. అప్పటికి మన్నాదే వయసు కేవలం 22 ఏళ్లే. పాట సూపర్ హిట్టయింది. దాంతో పాటే మన్నాడేపై ఓ ముద్ర పడింది. కేవలం పౌరాణిక సినిమాలకు, ముసలి పాత్రలకు మాత్రమే పాడాల్సి వచ్చింది. పాడి పాడి మన్నాదేకు విసుగొచ్చేసింది. ఇక లాభం లేదనుకొని హిందీ సినిమాలకు గుడ్‌బై చెప్పి కలకత్తా వెళ్లిపోదామనుకున్నాడు. అప్పుడే మషాల్ సినిమా కోసం పాడిన మార్చ్ సాంగ్ ఊపర్ గగన్ విశాల్ దేశమంతటా మారుమోగింది. అప్పట్నుంచి మన్నాదే వెనుదిరిగి చూడలేదు కానీ గాయకుడిగా స్థిరపడటానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది.
మన్నాడే సినీ రంగంలో అడుగుపెట్టే నాటికే హేమాహేమీ గాయకులున్నారు. మరికొందరు కొత్తగా చేరారు. రఫీ, తలత్, ముఖేష్, హేమంత్ కుమార్ కొన్నాళ్లకు కిశోర్ కుమార్ ఇలా చాలా మంది మన్నాడేకు పోటీ అయ్యారు. ఇంకో విషయమేమిటంటే వీళ్లందరికీ గాడ్ ఫాదర్‌లు ఉన్నారు. వాళ్లని ప్రమోట్ చేసే సంగీత దర్శకులున్నారు. రఫీకి నౌషాద్, ముఖేష్‌కి శంకర్ జైకిషన్, కిశోర్‌కు బర్మన్, తలత్‌కు అనిల్ బిశ్వాస్, హేమంత్‌కు బర్మన్‌తో పాటు స్వీయ సంగీత దర్శకత్వం. ఇలాగన్నమాట. విశేషమేమిటంటే ఈ సంగీతదర్శకులందరికీ మన్నాడే అంటే చెప్పలేని గౌరవం. కానీ ఆ గౌరవం హీరోలకు ప్లే బ్యాక్ పాడే పాటలు ఇచ్చేందుకు మాత్రం పనికిరాలేదు. బర్మన్, శంకర్ జైకిషన్‌లు ఇందుకు కాస్త మినహాయింపు. ఇంకో సమస్య కూడా వచ్చి పడింది. అప్పట్లో ఫలానా హీరోకు ఫలానా గాయకుడు పాడితేనే ఇంపుగా వుంటుందనే నమ్మకం బలంగా వుండేది. దిలీప్‌కు తలత్, దేవానంద్‌కు కిశోర్, రాజ్‌కపూర్‌కు ముఖేష్, బిశ్వజిత్‌కు హేమంత్ పాడేవారు. మన్నాదేకు మాత్రం అలాంటి ప్రత్యేకమైన హీరోలు లేరు. ఆ మాటకొస్తే ఆయన గొంతు ఏ హీరోకు నప్పుతుందో తేల్చుకోలేని పరిస్థితి. ఒక్క శంకర్ జైకిషనే రాజ్‌కపూర్‌కు ముఖేష్‌తో పాటు మన్నాడేని కూడా పాడించారు. నిజం చెప్పాలంటే హీరోలందరకీ మన్నాదే స్వరం వినసొంపుగా ఇంపుగా వుండేది. దానికి కారణం ఆయన స్వరంలో సమయానుకూలంగా పలికే భావం. ఏ వెన్నూ దన్నూ లేకపోవడంతో గాయకుడిగా తన ప్రత్యేకతను, అస్తిత్వాన్ని నిలబెట్టుకుని పాడిన ప్రతిపాట మరపురానిదిగా మన మనసులో నిలిచిపోయేలా చేయగలిగాడు మన్నాదే. ఆయన ప్రతిభ అలాంటిది.
కావాలంటే చోరీచోరిలో రాజ్‌కపూర్ పాడిన ఆజా సనమ్ మధుర్ చాంద్‌నీమే హమ్ పాటను.. చల్తీకా నామ్ గాడిలో అశోక్ కుమార్ పాడిన బాబు సంఝే ఇషారే పాటను. ఆవిష్కార్‌లో రాజేష్ ఖన్నా పాడిన హస్నేకే చాహ్‌నే ఇతనా ముఝే రులాయా పాటను, బాదల్‌లో సంజీవ్‌కుమార్ పాడిన ఆప్‌నే లియే జియేతో క్యాజియే పాటను, వక్త్‌లో బల్‌రాజ్ సహానీ పాడిన ఐ మేరీ జోహర్ జభీ తుఝే మాలుమ్ నహీ పాటను, జంజీర్‌లో ప్రాణ్ పాడిన యారీహై ఈమాన్ మేరా యార్ మేరి జిందగి పాటను విని చూడండి మీకే తెలుస్తుంది. దర్శన్ దో ఘన్ శ్యామ్ వంటి భక్తి ప్రపూర్ణమైన సంగీతం విని వెంటనే ఔలాద్‌లో జోడి హమారీ, జయేగాకైసా అని చిందులు వేసే హస్య గీతం వింటే మన్నాదే గానంలోని వైవిధ్యం అర్థమవుతుంది.
తోటి గాయకులతో పోలిస్తే మన్నాదే తక్కువ పాటలే పాడాడు కానీ ఏ సంగీత దర్శకుడికైనా శాస్త్రీయ సంగీతం ఆధారంగా పాట పాడాల్సి వస్తే చప్పున స్ఫురించే గాయకుడు మన్నాడేనే. అందుకే రఫీని ఎంతగానో ప్రేమించిన మదన్‌మోహన్ కూడా కౌన్ ఆయా మేరే మన్‌కే ద్వారే పాటను మన్నాడేకి ఇచ్చాడు. భరత్ భూషణ్ స్వరంగా బైజు బావరాతో స్థిరపడిపోయిన రఫీని కాదని బసంత్ బహార్ చిత్రంలో శంకర్ జైకిషన్ మన్నాడేకే ఎక్కువ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాలో సుర్‌న సజా క్యా గమాహై మన్నాడే పాటల్లోకి గొప్పది మాత్రమే కాదు శంకర్ జైకిషన్‌ల యుగళ గళానికి థీమ్ సంగీతం వంటిది. జైకిషన్ చనిపోయాక శంకర్ అన్ని ఇంటర్వ్యూలలో గుర్తు తెచ్చుకుని పాడిన పాట ఇది.
ఏ పాటకు ఏ గాయకుడు న్యాయం చేయగలడో నిర్ణయించడంలో దిట్ట అయిన సచిన్‌దేవ్ బర్మన్ ఎక్కువ రఫీని కిశోర్‌ని నమ్ముకున్నా మేరీ సూర్ తేరీ ఆంఖేలో శాస్త్రీయ సంగీతం ఆధారమైన పూఛోన కైసే మైనే రైన్ బితాయే మన్నాడేకి ఇచ్చాడు. ఆ పాట హిందీ గీతాల్లో తొలి వరుసలో వుంది. గాంభీర్యం, మార్దవ్యం, విషాదం ఇలాంటి వాటిల్లో రఫీతో పోటీపడే స్వరం మన్నాదేది. అల్లరి హస్య గీతాల్లో కిశోర్ జోడిగా నిలుస్తుంది. అందుకే మన్నాడే సోలోలు ఎంత ప్రసిద్ధమో ఇతను ఇతర మగ గాయకులతో పాడిన యుగళాలు కూడా అందే ప్రసిద్ధం. షీదిన్ షిదిలో రఫీతో మన్నాడే పాడిన పాట భావుకత్వానికి పరాకాష్ట బర్సాత్‌కీ రాత్‌లో నతో కారూకీ తలాష్‌హై ఖవాలీలలోనే మకుటాయమానంగా నిలిచింది. అలాగే పడోసన్‌లో కిశోర్‌తో పాడిన ఎక్ చతురనార్ కర్‌సే సింగార్ మన్నాడే మర్చిపోలేని పాట.
షోలేలో యే దోస్తీ, హమ్ నహీ ఛోడేంగే స్నేహ గీతాల్లోనే రికార్డు సృష్టించింది. మహేంద్ర కపూర్‌తో పాడిన ఐ మాతేరీ సూరత్ సే మన్నాదే ఏ స్వరంలోనైనా ఎంత అలవోకగా ఇమిడిపోతాడో చెబుతుంది. అలాగే లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, గీతా దత్, సుమన్‌కల్యాణ్‌పూర్‌లలో యుగళ గీతాలు పాడేటప్పడు ఆయా గాయనీమణుల శైలికి ధీటుగా పాడగలిగే గాయక మేథావి మన్నాడే. లతా మాధుర్యాలతో జత చేసి దిల్‌కి గిరహ్ ఖోల్‌దో, యేరాత్ భీగి భీగి అంటూ పాడటం, గీతాదత్ చిలిపితనంతో చేరిపోయి మై తేరి ప్యార్‌మే అనడం, ఆశా నాటకీయ ఫక్కిన అనుకరిస్తూ జుల్ఫోంకి ఘటా లేకర్ అంటూ స్వర విహారం చేయడం మన్నాడేకు మాత్రమే చెల్లింది.
ఇక తాత్విక పాటల్లో మన్నాదేకు మించిన వారు లేరు కావాలంటే కినారే కినారేలోని చల్ జారహై పాటను కానీ సఫర్‌లో నదియా చలే చలేర ధార పాటను కానీ ఉపకార్‌లో కస్మే వాదే ప్యార్ వఫా పాటను కాని విని చూడండి. కాబూలీవాలలో ఐ మేరీ వతన్ ఐ మేరీ బిఛ్‌డే చమన్ పాటను వింటే ఎవరికైనా గుండెలు పిండేస్తాయి. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. గాయకుడిగానే కాదు వ్యక్తిగా కూడా మన్నాడే టాపే.. హిందీలో రఫీ బెంగాలీలో హేమంత్‌లు మన్నాడేకు రావాల్సిన అవకాశాలు చాలా మట్టుకు రాకుండా చేశారు. అయినా వారిద్దరిపై మన్నాడే అమితమైన గౌరవం చూపించేవాడు. రఫీ అంటే మన్నాదేకు అమితమైన అభిమానం. నేను రఫీ కంటే ఎక్కువ సంగీత శిక్షణ తీసుకుంటే తీసుకోవచ్చు. సంగీతంపై నాకే పట్టు వుంటే వుండవచ్చు. కానీ రఫీ గొంతులో వున్న మాధుర్యం నాకెక్కడిది. నా గొంతులో వణుకు వుంటుంది. రఫీ స్వరంలోమాధుర్యం వుంటుంది. ఏ స్థాయిలో పాడిన ఆ స్వరం చెక్కు చెదరదు. అందుకే ఆయన నాకంటే గొప్పవాడయ్యాడు అంటాడు మన్నాడే.. ఇదొక్కటి చాలదు మన్నాదే వ్యక్తిత్వాన్ని చెప్పడానికి. దటీజ్.. దాదాసాహెబ్ మన్నాడే.
Read Also…. Travel: భారతదేశంలోని ఈ 5 సరస్సుల అందాలను చూసి మీరు మైమరచిపోతారు