AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nehru-Lata Mangeshkar: ప్రధాని నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్‌ పాట

Lata Mangeshkar: భారత కోకిలగా యావత్‌ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాసవిడిచారు.

Nehru-Lata Mangeshkar: ప్రధాని నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన  లతా మంగేష్కర్‌ పాట
Nehru Lata Mangeshkar
Balu
| Edited By: |

Updated on: Feb 06, 2022 | 11:54 AM

Share

Lata Mangeshkar passes away: లతా మంగేష్కర్‌ గురించి కొత్తగా ఏం చెబుతాం.. ఆమెది దైవ స్వరం.. ఏ మేరే వతన్‌కే లోగోం పాటతో ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ( Jawahar Lal Nehru)కు కన్నీళ్లు తెప్పించిన స్వరం. నెహ్రూ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారో తెలియాలంటే ఆనాడు ఏం జరిగిందో తెలుసుకోవాలి. చైనా(China)తో యుద్ధం చైనాతో యుద్ధం ముగిసి అట్టే కాలం కాలేదు. రెండు నెలలు అవుతుందంతే.. అప్పుడే రిపబ్లిక్‌ డే(Republic Day) ఉత్సవాలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన ఆ కార్యక్రమానికి లతాను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో సినిమా పాటలను మొదలుకొని దేశభక్తి గీతాలు, భజనలు ఆలపించాలని అనుకున్నారు లత. అయితే చైనా యుద్ధంలో అమరవీరులు అయిన మన సైనికులకు అశ్రునివాళిని అర్పిస్తూ కవి ప్రదీప్‌ ఏ మేరే వతన్‌కే లోగోం అనే కరుణరసాత్మకమైన ఓ పాటను రాశారు. ఆ పాటను లతా పాడితే బాగుంటుందన్నది ప్రదీప్‌ భావన. ఆ మాటే ఫోన్‌ చేసి లతకు చెప్పారు. తనకు ఇప్పుడు తీరిక లేదని, కొత్త పాట నేర్చుకోవడానికి రిహార్సల్స్‌ చేయలేనని, గతంలో పాడినవే మళ్లీ పాడతానని జవాబిచ్చారు లత. నువ్వు ఒక్కసారి వచ్చి పాట విని అప్పుడు చెప్పు అని అన్నారు ప్రదీప్‌. గాంధేయవాది అయిన ప్రదీప్‌ మాటను కాదనలేకపోయారు లత. ప్రదీప్‌ కవే కాదు, గాయకుడు- సంగీత దర్శకుడు కూడా. లత వచ్చిన తర్వాత ఓ కాగితంపై పాట రాసి కొన్ని లైన్లు పాడి వినిపించారు. లతకు ఆ పాట విపరీతంగా నచ్చింది. పాడతానని మాట ఇచ్చింది. ఆ పాట మొదటి మూడు లైన్లకు ప్రదీప్‌ ట్యూన్‌నే వాడుకున్నారు. మిగతా పాటను సి.రామచంద్ర కంపోజ్‌ చేశారు. పాట ఎలా పాడాలో లతకు చెప్పారు. అప్పటికే సి.రామచంద్ర-లత మధ్య విభేదాలు వచ్చాయి. అయినప్పటికీ ఈ పాట కోసం కలిసి పని చేశారు.

రిపబ్లిక్‌ డే ఉత్సవాల ఏర్పాట్లు చూసుకునేందుకు నాలుగు రోజుల ముందే రామచంద్ర ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. మీరు లేకుండా రిహార్సల్స్‌ ఎలా చేయను అని అడిగారు లత. రామచంద్ర కూడా గాయకుడే కాబట్టి ఓ టేపు మీద పాట పాడి లతకు ఇచ్చి ప్రాక్టీస్‌ చేయమని చెప్పి ఢిల్లీకి వెళ్లారు. 1963 జనవరి 26న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో సినిమా కళాకారులంతా ఢిల్లీ వెళ్లారు. దిలీప్‌కుమార్‌, నెహ్రూ అభిమాని అయిన దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్‌ కూడా కార్యక్రమానికి వచ్చారు. ఆయన నెహ్రూను ఎంతగా అభిమానిస్తారంటే నెహ్రూ చనిపోయిన మరుసటి రోజే మెహబూబ్‌ఖాన్‌ కూడా గుండెపోటుతో చనిపోయారు. విమానంలో కూడా పాటను లత ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నారు. మరుసటి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. లత మొదటగా హమ్‌దోనో సినిమాలోని అల్లా తేరో నామ్‌ పాట పాడారు. తర్వాత ఏ మేరే వతన్‌కే లోగోం పాట పాడారు. ఆ పాట పాడుతున్నంత సేపు సభా ప్రాంగణం అంతా నిశ్శబ్దం. పాట పూర్తి అయిన తర్వాత హోరున చప్పట్లు. వేదికపై ఉన్న నెహ్రూతో పాటు అందరూ కన్నీరు కార్చారు. పాట పాడుతున్న లత ఈ కన్నీళ్లు గమనించలేదు. వేదిక వెనక్కి వచ్చి కాఫీ తాగుతున్నారు. ఇందులో మెహబూబ్‌ఖాన్‌ వచ్చి పండిట్‌జీ పిలుస్తున్నారు అంటూ చేయి పట్టుకుని నెహ్రూ దగ్గరకు తీసుకెళ్లారు. ఇదిగో మా లతా మంగేష్కర్‌ అని గర్వంగా చెప్పారు. నెహ్రూ కాసేపు లత కేసి చూశారు. లడ్కీ తూనే ముఝే ఆజ్‌ రులాయా హై (అమ్మాయి ఈ రోజు నన్ను ఏడిపించావు) అని అన్నారు. ఎందుకో నెహ్రూ ఎక్కువ సేపు అక్కడ ఉండలేకపోయారు. కార్యక్రమం మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు. చైనా చేసిన మిత్రద్రోహం ఆయనను వెంటాడుతూనే ఉంది. ఆ యుద్ధంలో మరణించిన సైనికుల త్యాగాల గురించి రాసిన ఆ పాట ఆయన్ని కదలించివేసింది.

ఆ మరుసటి రోజు సినిమా కళాకారులందరినీ తేనీటి విందుకు ఆహ్వానించారు నెహ్రూ. రాజ్‌కపూర్‌, దిలీప్‌కుమార్‌, శంకర్‌, జైకిషన్‌, మదన్‌మోహన్‌ ఇలా వీరంతా నెహ్రూ చుట్టూ చేరి మాట్లాడుతున్నారు. లత మాత్రం ఓ మూల ఒదిగి నిలబడి ఉన్నారు. అంతలో అక్కడికి వచ్చిన ఇందిరాగాంధీ లత దగ్గరకు వెళ్లి మీరు కూడా వచ్చి కలవండి అని అన్నారు. వద్దు నాకు ఇక్కడే బాగుందని లతా జవాబిచ్చారు. అలా అయితే ఇక్కడే ఉండండి.. మీ వీరాభిమానులు ఇద్దరు మిమ్మల్ని కలవడానికి తహతహలాడుతున్నారు అని రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీలను తీసుకొచ్చారు ఇందిరా. కొన్ని నిమిషాలయ్యాక లతా ఎక్కడ? అని గట్టిగా కేక వేశారు నెహ్రు. లత ఆయన దగ్గరకు వెళ్లి నిలుచున్నారు. బాంబేకు వెళ్లిన తర్వాత మళ్లీ ఈ పాట పాడతావా అని అడిగారు. ఏమో ఇంకా తెలియదు అని జవాబిచ్చారు లత. అప్పుడు నెహ్రూ ఓ ఫోటోగ్రాఫర్‌ను పిలిచి లతతో ఫోటో దిగారు. తర్వాత నెహ్రూ సెక్రటరీ ఆ ఫోటోను లతకు పంపారు. నెహ్రూ సంతకంతో ఉన్న ఆ ఫోటోను లత చాలా భద్రంగా దాచుకున్నారు.

ఇది జరిగిన కొన్ని నెలలకు బాంబేలోని బ్రాబోర్న్‌ స్టేడియంలో ఓ ఛారిటీ షో జరిగింది. దానికి నెహ్రూ ముఖ్య అతిథిగా వచ్చారు. అందులో లత పాటల ప్రోగ్రామ్‌ కూడా ఉంది. స్టేజి వెనకాల ఉన్న లతకు నెహ్రూ ఓ సందేశం పంపారు. ఏ మేరే వతన్‌కే లోగోం పాడాలన్నది ఆ సందేశం సారాశం. రామచంద్ర ఆర్కెస్ట్రాకు సూచనలు చేశారు. అందరూ కలిసి రిహార్సల్‌ చేశారు. తర్వాత లత పాట పాడారు. పాట అయిపోగానే నెహ్రూ వెళ్లిపోయారు. కారు ఎక్కిన తర్వాత లతను పిలిపించారు. లత రాగానే కారు కిటికీ అద్దం దించి ఆమె చేతిని పట్టకున్నారు. నీ పాట వినడానికే వచ్చాను. నువ్వు పాడి ఉండకపోతే చాలా నిరాశపడేవాడిని అని చెప్పి వెళ్లిపోయారు. లత పాట నెహ్రూను అంతగా కదిలించిందన్న మాట!