Avatar 3 : అవతార్ 3 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ఎలా ఉందంటే..
వరల్డ్ సినిమాలో అవతార్ సృష్టించిన సంచలనం గురించి రాయాలి అంటే ఒక బుక్ సరిపోదు.. పెద్ద గ్రంథమే కావాలి. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుండి వచ్చిన ఈ సినిమా 2009లోనే దాదాపు 12 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. మూడేళ్ల కింద సీక్వెల్ చేశాడు జేమ్స్. ఇప్పుడు అవతార్: 3 వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా..?
మూవీ రివ్యూ: అవతార్ 3
నటీనటులు: సామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లేట్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రసల్ కార్పెంటర్
మ్యూజిక్: సైమన్ ఫ్రాంగ్లన్
నిర్మాతలు: జేమ్స్ కామెరూన్, జాన్ లాండ్యూ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జేమ్స్ కామెరూన్
వరల్డ్ సినిమాలో అవతార్ సృష్టించిన సంచలనం గురించి రాయాలి అంటే ఒక బుక్ సరిపోదు.. పెద్ద గ్రంథమే కావాలి. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుండి వచ్చిన ఈ సినిమా 2009లోనే దాదాపు 12 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. మూడేళ్ల కింద సీక్వెల్ చేశాడు జేమ్స్. ఇప్పుడు అవతార్: 3 వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా..?
కథ:
ముందు నుంచి అవతార్ అంటే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. అక్కడే తన కథ రాసుకుంటున్నాడు జేమ్స్ కెమెరూన్. అవతార్ 2లో సముద్ర గర్భాన్ని చూపించిన ఈయన.. ఈసారి కథను నిప్పు దగ్గరికి వచ్చాడు. జేక్ సల్లీ కుటుంబం సెకండ్ పార్ట్ మొత్తం నీళ్లలో నివసించే వాళ్లతో కొట్లాడుతూ ఉంటారు.. తమ తెగ కోసం హీరో పోరాడుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి పండోరలోని అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే యాష్ పీపుల్ అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతిని ప్రేమించే నావీలకు పూర్తి భిన్నంగా.. కాస్త క్రూరంగా ఉండే ఈ కొత్త తెగతో జేక్ కుటుంబానికి వచ్చిన ముప్పు ఏంటి..? ఈ ఘర్షణలో వారు ఎలా బయటపడ్డారు..? అనేదే ఈ సినిమా కథ.
కథనం:
జేమ్స్ కెమెరూన్ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే దాని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు ఏమో అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. నిజం చెప్పాలంటే పదహారేళ్ల కింద వచ్చిన అవతార్ సినిమా చూసినప్పుడు ప్రపంచ సినిమా మొత్తం మైమరిచిపోయింది. అలాంటి సినిమా ఎలా తీయగలిగాడు అంటూ మొత్తం ప్రపంచమే జేమ్స్ కెమెరూన్ గురించి మాట్లాడుకుంది. ఆ సినిమా క్లైమాక్స్‌లో గానీ, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు గానీ కలిగిన ఆ కిక్ ఈ సీక్వెల్స్‌లో దొరకడం లేదు. ఆల్రెడీ మూడేళ్ల కింద వచ్చుగా అవతార్ 2లో కథనం నెమ్మదించిందని విమర్శలు వచ్చాయి. ఈ మూడవ భాగంలోనూ అదే సమస్య కనిపిస్తుంది. కథ, కథనం సినిమాకు ప్రధాన బలహీనతలుగా మారాయి. చూసిన సన్నివేశలు మళ్లీ మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఇందులో లోపించాయి. ఒక మాస్టర్ పీస్ నుండి ఆశించే ఆ అడ్రినలిన్ రష్ ఈ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి. కథ పరంగా నిరాశపరిచినా, టెక్నికల్ అంశాల్లో మాత్రం ఈ సినిమా ఒక అద్భుత దృశ్యకావ్యమే.
VFX క్లారిటీ చూస్తే మతిపోతుంది. ప్రతీ ఫ్రేమ్‌లోనూ దర్శకుడు తీసుకున్న జాగ్రత్త, ఆ డిటైలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వాడిన రంగులు, బ్రైట్నెస్, విజువల్ పాలిష్ అన్నీ బాగా కుదిరాయి. తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కేవలం ఈ విజువల్ గ్రాండియర్ కోసమే సినిమాను చూడొచ్చు. ఇలాంటి సినిమాలను మంచి స్క్రీన్ మీదే చూడాలి. 3D ఎఫెక్ట్స్ చాలా ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. ముఖ్యంగా PCX స్క్రీన్‌పై చూస్తే.. ఆ అనుభూతి ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గానీ, ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే భావన గానీ 3Dలో అద్భుతంగా పండాయి. టెక్నాలజీని వాడుకోవడంలో కామెరూన్ ఎప్పుడూ ముందుంటాడని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
నటీనటులు:
సామ్ వర్తింగ్టన్, జియో సాల్డానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లేట్ ఇలా ప్రతి క్యారెక్టర్ ఇంతకు ముందు సినిమాల్లో చూశాం. అవి క్యారెక్టర్స్ కంటిన్యూ అయ్యాయి. కొన్ని కొత్త పాత్రలు పరిచయం అయినా కూడా అవి కూడా అలాగే బిహేవ్ చేశాయి.
టెక్నికల్ టీం:
అవతార్ సినిమాకు సంగీతం పెద్దగా హెల్ప్ కాలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా కుదరలేదు. ఎడిటింగ్ కూడా చాలా వీక్. 3.17 గంటల సినిమా భరించడం కష్టం. స్క్రీన్ ప్లే రేసీగా ఉంటే ఎంతసేపైనా చూడొచ్చు కానీ.. కేవలం విజువల్స్ కోసమే అంతసేపు కూర్చోవాలంటే కష్టం. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. దర్శకుడిగా జేమ్స్ కామెరూన్ ఈసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మాట చెప్పడానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది కానీ ఇక్కడితో అవతార్ ఫ్రాంచైజీ ఆపేస్తే గౌరవంగా ఉంటుందేమో. ఒకే విజువల్స్ మళ్లీమళ్లీ చూసినట్టు అనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా అవతార్: ఫైర్ అండ్ యాష్.. టైటిల్ లో ఉన్న ఫైర్ సినిమాలో లేదు.. జస్ట్ ఫర్ విజువల్స్..!




