Allu Arjun: హిందీ ‘అల వైకుంఠపురం’ కు బ్రేక్.. సినిమాను విడుదల చేయట్లేదని ప్రకటించిన నిర్మాత.. కారణమేంటంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప' బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఊర మాస్ పాత్రలో నటించిన బన్నీకి బాలీవుడ్ సినిమా ప్రియులు ఫిదా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఊర మాస్ పాత్రలో నటించిన బన్నీకి బాలీవుడ్ సినిమా ప్రియులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే హిందీలో 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం వందకోట్ల వైపు వేగంగా దూసుకెళుతోంది. ఇలా పుష్ప మేనియా సాగుతుండగానే ఐకాన్ స్టార్ క్రేజ్ ను మరింత క్యాష్ చేసుకోవాలని భావించారు గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ అధినేత మనీశ్ షా. ఈ క్రమంలోనే బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ అల..వైకుంఠపురం’ లో హిందీ వెర్షన్ ని ఈనెల 26న సుమారు 200 థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు మనీశ్. ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
కాగా ‘అల వైకుంఠ పురం’ సినిమాను ఇప్పటికే హిందీలో ‘షెజాదా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, భూషణ్ కుమార్, అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఓవైపు ‘షెజాదా’ షూటింగ్ జరుగుతుండగానే .. మరోవైపు తెలుగు ‘అల..వైకుంఠపురం’ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయడం ‘షెజాదా’ నిర్మాతలను కలవరపెట్టింది. హిందీ వెర్షన్ విడుదలైతే తమ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని, ప్రేక్షకులు థియేటర్లకు రారేమోనని నిర్మాతలు కంగారు పడ్డారు. దీంతో సినిమా విడుదల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మనీశ్ షాకు విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సినిమాను విడుదల చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు గాను ‘షెజాదా’ నిర్మాతలు మనీశ్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.
— Goldmines Telefilms (@GTelefilms) January 21, 2022
Also Read:IND VS SA: రెండో వన్డేలోనూ చతికిల పడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..