Nandigram Fight: బెంగాల్ అంతా ఒకెత్తు.. నందిగ్రామ్ ఒకెత్తు.. అందుకే దీదీ అంత రాద్ధాంతం

2019 పార్లమెంటు ఎన్నికలిచ్చిన ఊపుతో బీజేపీ బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలని సకల ఎత్తులు వేస్తోంది. అయితే, బెంగాల్‌లోని 294 అసెంబ్లీ సీట్లకు గాను ఓ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Nandigram Fight: బెంగాల్ అంతా ఒకెత్తు.. నందిగ్రామ్ ఒకెత్తు.. అందుకే దీదీ అంత రాద్ధాంతం
West Bengal
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 13, 2021 | 6:58 PM

Nandigram constituency catching all eyes: దేశంలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టి ఫోకస్ అయ్యింది బెంగాల్ పైనే. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా కాసింత ఆసక్తికరంగా మారినప్పటికీ దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే. మూడోసారి అధికారంలోకి రావడానికి సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీ సర్వ వ్యూహాలు అమలు చేస్తుండగా.. 2019 పార్లమెంటు ఎన్నికలిచ్చిన ఊపుతో బీజేపీ బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలని సకల ఎత్తులు వేస్తోంది. అయితే, బెంగాల్‌లోని 294 అసెంబ్లీ సీట్లకు గాను ఓ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.

బెంగాల్ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాలనలో వున్న కమ్యూనిస్టులను చావు దెబ్బ కొట్టి.. 2011లో అధికార పగ్గాలు చేపట్టిన మమతాబెనర్జీ.. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భూపోరాటాలతో కమ్యూనిస్టుల పాలనకు చరమ గీతం పాడిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మమత పోటీ చేస్తుండడం కూడా ఆసక్తి రేపుతోంది. దీదీ స్వయంగా బరిలోకి దిగడంతో నందిగ్రామ్ సెగ్మెంటు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. అయితే నందిగ్రామ్ నుంచి దీదీ స్వయంగా బరిలోకి దిగడం వెనుక ప్రధాన కారణం అక్కడ్నించి ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంటేనని బెంగాల్ మీడియా కథనాలు రాస్తోంది. 2011 వరకు నందిగ్రామ్ నుంచి వామపక్ష నేతలే గెలుస్తూ వచ్చారు. అదే సమయంలో బెంగాల్ సుదీర్ఘంగా 34 సంవత్సరాల పాటు లెఫ్ట్ పాలన కొనసాగింది. 2010-11 మధ్య కాలంలో బెంగాల్ నందిగ్రామ్ సెంట్రిక్‌గా భూ పోరాటాలు కొనసాగాయి. ఆనాటి బుద్దదేవ్ భట్టాచార్య ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా భూపోరాటాలు జరిగాయి.

ఆ తర్వాత 2011 ఎన్నికల్లో భూపోరాటా ఎఫెక్టు స్పష్టంగా కనిపించింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజా బీబీ గెలుపొందారు. అదే సమయంలో రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఖిల్లాను బద్దలు కొట్టి ఏకంగా 189 సీట్లలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రాధికారాన్ని సాధించింది. ఆ తర్వాత 2016లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి (ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి) టీఎంసీ తరపున ఏకంగా 67 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. నిజానికి నందిగ్రామ్ ప్రాంతంలో భూపోరాటాలు జరిగిన 2010-11 కాలంలో సువేందు సారథ్యంలోనే అధికంగా ఉద్యమాలు జరిగాయి. కానీ ఆయన 2011లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. 2016లో ఎమ్మెల్యేగా గెలిచి మమతా బెనర్జీ మంత్రి వర్గంలో మిస్టర్ 2గా అధికారం నిర్వహించారు. కారణాలేవైతేనేం సువేందు గత నెలలో భారతీయ జనతా పార్టీలో చేరారు. దాంతో ఆయనకు నందిగ్రామ్ సీటును కేటాయించింది బీజేపీ. సువేందు కుటుంబానికి నందిగ్రామ్‌ మాంచి ఫట్టుంది. ఆయన్ని మట్టికరిపించాలంటే సామాన్య అభ్యర్థుల వల్ల కాదన్న ఉద్దేశంతోనే దీదీ స్వయంగా నందిగ్రామ్ బరిలోకి దూకారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇక్కడే మమతా బెనర్జీ తన వ్యూహాన్ని సెంటిమెంటుకు అనుగుణంగా మార్చుకున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును వదిలేసి.. సువేందుకు సవాల్ విసురుతూ నందిగ్రామ్ బరిలోకి వచ్చారు. దానికి కారణం అక్కడ బలమైన సువేందు అధికారిని తాను మాత్రమే ఎదుర్కోగలనని ఆమె విశ్వసించడమే. ఒకవేళ మమత స్వయంగా బరిలోకి దిగకుండా నందిగామ్ర్ బీజేపీ ఖాతాలో చేరడం ఖాయమని, అక్కడ గెలిచిన బీజేపీకే రాష్ట్రాధికారం దక్కుతుందన్న సెంటిమెంటు వర్కౌట్ అయితే తనకు శంకరగిరి మాన్యాలే శరణ్యమని దీదీ భావించినట్లు బెంగాల్ మీడియా కథనాలు రాస్తోంది.

అనూహ్యంగా నందిగ్రామ్ బరిలోకి వచ్చిన మమతా బెనర్జీ.. ఇపుడు అక్కడ గెలిచేందుకు అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. హిందూ కార్డును వినియోగిస్తున్నారు. ఆలయాల దర్శనాలకు వెళుతున్నారు. ఇలా ఓ ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుండగానే ఆమెకు కారు డోర్ తగిలి గాయమైతే.. దాన్ని బీజేపీ వర్గాల దాడి అభివర్ణించారు మమతా బెనర్జీ. అయితే ఇందుకు తగిన సాక్ష్యాలను చూపడంలో ఆమె విఫలమవడంతో కాసింత పరువు పోగొట్టుకున్నారు దీదీ. దానికి తోడు ఆమె ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం తగిన సాక్ష్యాలు లేవంటూ తోసిపుచ్చింది.

2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లోని 42 ఎంపీ సీట్లలో 18 సీట్లను బీజేపీ సాధించింది. ఇదే ఉత్సాహంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోను గెలవాలని బీజేపీ వ్యూహరచన చేసింది. అందులో భాగంగా తన క్యాడర్‌ని పెంచుకోవడంతోపాటు ఎన్నికలకు ముందు భారీగా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించింది. సువేందు అధికారి లాంటి కీలక నాయకులను టీఎంసీ నుంచి లాక్కుంది. మిథున్ చక్రవర్తి లాంటి సీనియర్ సినీ నటులకు గాలమేసింది. నందిగ్రామ్‌లో గెలిస్తే తానే బీజేపీ తరపున సీఎం అవుతానని సువేందు అధికారి కూడా భావిస్తున్నారు. అందుకే ఆయన ఏ మాత్రం పట్టు సడల కుండా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. నందిగ్రామ్ గెలుచుకోవడంతోపాటు బెంగాల్‌లోను పాగా వేస్తామని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.

అయితే నందిగ్రామ్‌లో సువేందుకున్న పట్టుపై భయంగా వున్న మమతా బెనర్జీ.. నందిగ్రామ్ ప్రచారానికి సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ రాకేశ్ తికాయత్‌ పిలిపిస్తున్నారు. 2010 తర్వాత నుంచి మోదీ విధానాలకు గట్టిగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ అందుకు ధీటుగా వ్యూహరచన చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఢిల్లీ శివార్లలో మకాం వేసి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న సంఘాల ప్రతినిధులు ఇటీవల బెంగాల్‌లో బీజేపీ ఓడించాలంటూ బెంగాలీలకు పిలుపునిచ్చారు. ఆ వెంటనే స్పందించిన మమతా బెనర్జీ రైతు సంఘాలకు సారథ్యం వహిస్తూ బీజేపీ మీద ఆగ్రహంతో వున్న రాకేశ్ తికాయత్‌ను బెంగాల్‌కు ఆహ్వానించింది. ఆహ్వానమందిన వెంటనే బయలు దేరిన తికాయత్ శనివారం (మార్చి 13న) కోల్‌కతా చేరుకున్నారు. ఆ వెంటనే టీఎంసీ నేతలతో భేటీ అయ్యారు. దీదీ అభ్యర్థన మేరకు ఆయన ఆదివారం నందిగ్రామ్ ఏరియాలో పర్యటించబోతున్నారు. నందిగ్రామ్‌లో సువేందును ఓడించడం అంత తేలిక కాదని గుర్తించినందువల్లనే మమతా బెనర్జీ అనేక వ్యూహాలకు పదును పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. ఏది ఏమైనా బెంగాల్ సీఎం సీటుకు నందిగ్రామ్ గెలుపు బాట వేస్తుందని అటు టీఎంసీ, ఇటు బీజేపీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఎవరి కలలు నెరవేరతాయో తెలియాలంటే మే రెండో తేదీ దాకా ఆగాల్సిందే.

ALSO READ: ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలకు ఆలవాలం తెలంగాణ.. అదంతా గత చరిత్రేనా?

ALSO READ: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్ర ఆసక్తికరం.. రాజకీయాలు తక్కువైనా అదే ఉత్కంఠ

ALSO READ: 2020 కరోనా నామ సంవత్సరమే కాదు.. మరో పేరు కూడా సంపాదించింది.. ఏంటంటే?