UP ELECTIONS 2022: యుపీ ఎన్నికల ముఖచిత్రం అంతా సామాజివర్గాల సమ్మేళనం.. కులాల ప్రాతిపదికనే పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు

UP Polls: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాల అంశాల ఆధారంగానే అన్ని పార్టీలు విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. యూపీలో చాలా కులాలను అంతర్లీనంగా, అంతర్గతంగా అత్యంత సైలెంట్‌గా ప్రభావం చేసే నేతలు చాలా మందే వుంటారు.

UP ELECTIONS 2022: యుపీ ఎన్నికల ముఖచిత్రం అంతా సామాజివర్గాల సమ్మేళనం.. కులాల ప్రాతిపదికనే పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు
UP election 2022
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 04, 2022 | 3:54 PM

UP ELECTIONS 2022 PARTIES WORKING OUT ON CASTE BASED STRATEGIES: అభ్యర్థి సచ్ఛరిత్ర, పార్టీ మేనిఫెస్టో అంశాలు వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపడం దశాబ్దాల క్రితమే బందయ్యింది. ఎన్నికల్లో డబ్బు, కులం, మతాలే ప్రభావం చూపుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాల అంశాల ఆధారంగానే అన్ని పార్టీలు విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. గత దశాబ్ధకాలంగా చోటుచేసుకున్న పలు పరిణామాలు యుపీలో ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి అండగా వుండబోతోంది.. ? ఏ పార్టీకి ఏ సామాజిక వర్గం వారు ఓట్లు వేయబోతున్నారు ? అనే ప్రశ్నలకు రకరకాల విశ్లేషణలు సమాధానాలుగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఏ సామాజికవర్గం మద్దతు ఏ పార్టీకి ఉందనేది ఆసక్తి కలిగించే అంశంగానే పరిగణించాలి. చాలా కులాలను అంతర్లీనంగా, అంతర్గతంగా అత్యంత సైలెంట్‌గా ప్రభావం చేసే నేతలు చాలా మందే వుంటారు. వారే పార్టీల విజయాలను తారుమారు చేసే సత్తా కలిగి వుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ అటువంటి వారే ఓటర్లను ప్రస్తుత ఎన్నికల్లోను ప్రభావితం చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. యూపీలో 66 దళిత కులాలున్నాయి. వారి జనాభా 21 శాతం దాకా ఉంటుందని అంచనా. ఈ దళిత కులాలన్నీ చాలా కాలం పాటు బహుజన్‌ సమాజ్‌ పార్టీ(Bahujan Samaj Party)కే అండగా నిలుస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం బీఎస్పీ ప్రదర్శన పేలవంగా వుండడంతో వారి ఓట్లకు గాలమేసేందుకు అధికార బీజేపీ(Bjp) వ్యూహాలు రచిస్తోంది. ట్రడిషనల్‌గా చర్మకార వృత్తిలో ఉండే జాతవ్‌ల జనాభా యుపీ రాష్ట్రంలో సుమారు 10 శాతం. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) అదే కులానికి చెందిన వారు కావడంతో వారు ఆమె పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తు వచ్చారు. యూపీలో జాతవేతర దళిత కులాలైన పాసి, ధోబీ, బింద్‌, కోలీ, ముస్‌హర్‌, హారీల జనాభా సుమారు 11 శాతం. బీఎస్‌పీ అధికారంలో ఉన్నప్పుడు జాతవ్‌లకే అధిక ప్రాధాన్యం లభించిందన్న అసంతృప్తి జాతవేతర దళిత కులాల్లో బలంగా వుంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే వ్యూహంతో భారతీయ జనతా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

ఇక ప్రస్తుతం బీజేపీ ఓటమి పాలు చేయడం ద్వారా అధికార పగ్గాలు చేపట్టాలనుకుంటున్న సమాజ్ వాదీ అధినాయకత్వానికి యాదవుల మద్దతు పుష్కలంగా కనిపిస్తోంది. అయితే.. ఎస్పీ పాలనలో తాము అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తున్న జాతవ్‌లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో పేరు గాంచిన జాతవ్ నేతలు దుష్యంత్ గౌతమ్, బేబీ రాణీ మౌర్యలను కమలం పార్టీ బరిలోకి దింపింది. ఎస్పీకి మరోసారి అధికారం దక్కకూడదని భావిస్తున్న జాతవ్‌లలో మూడో వంతు బీఎస్పీకి కాకుండా బీజేపీకి అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీఎస్పీ కాలంలో నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తున్న ఇతర దళిత కులాల వారితోపాటు.. చిరకాలంగా మాయావతి పార్టీకి మద్దతుగా వున్న జాతవ్‌లలో 30 నుంచి 35 శాతం బీజేపీ వైపు మొగ్గు చూపితే.. అది బీజేపీ బాగా లాభించే అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక యుపీ ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయించేది ప్రధానంగా 44 శాతం వున్న ఓబీసీలే. వీరిలో చాలా కులాలు చిరకాలంగా సమాజ్ వాదీ పార్టీకి మద్దతునిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ ఈ ఓబీసీలను ఏకం చేయడంలో సఫలమవడం వల్లనే యుపీలో సమాజ్ వాదీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే తదనంతర పరిణామాలలో ఎస్పీ హయాంలో ఓబీసీల్లోకి యాదవులకే ఎక్కువ ప్రయోజనం జరిగిందని మిగిలిన ఓబీసీ వర్గాలు భావించడం మొదలైంది. ఈ అంశాన్ని గత ఎనిమిదేళ్ళుగా బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. యాదవేతర ఓబీసీ కులాలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచించింది.

2014 ఎన్నికల నాటి నుంచి ఆనాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి, ప్రస్తుతం యావత్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కొనసాగుతున్న నరేంద్ర మోదీని దేశంలోనే అత్యంత వెనుకబడిన కులమైన ఘాంచీ సామాజిక వర్గం ప్రతినిధిగా బీజేపీ యుపీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అందువల్లనే యుపీ ఓబీసీల్లో పెద్ద ఎత్తున బీజేపీ పట్ల సానుకూలత వ్యక్తమవడం మొదలైంది. ఫలితంగా 2014, 2019 లోక్‌సభ ఎన్నకల్లో, 2017 యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవేతర ఓబీసీ కులాలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. 2012 యుపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 17శాతం ఈబీసీల మద్దతు ఉండేది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 58 శాతం ఈబీసీలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. యూపీలో 35.5 శాతం ఉన్న యాదవేతర ఓబీసీలు దాదాపు రెండొందల అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. 50 శాతంకన్నా ఎక్కువ ఈబీసీల మద్దతు దక్కిన పార్టీయే యుపీలో అధికారాన్ని పొందుతుందని ఓ అంచనా. మధ్య, తూర్పు యూపీలోని 126 స్థానాల్లో రాజ్‌భర్‌ వర్గ జనాభా 14 నుంచి22 శాతం దాకా వుంది. సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీకి చెందిన ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ ప్రస్తుతం ఆ సామాజికవర్గంలో ప్రజాదరణ పొందిన నేతగా కొనసాగుతున్నారు. శ్రీరామచంద్రుని పెద్ద కుమారుడు కుశుడి వారసులుగా చెప్పుకొనే కుశ్వాహాల (వీరినే మౌర్యాలని కూడా అంటారు) జనాభా తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లోని 60 స్థానాల్లో 14 నుంచి 20 శాతం దాకా ఉంటుంది. 2014 ఎన్నికల్లో వారి మద్దతు కమలం పార్టీకే దక్కింది. 2017 ఎన్నికల్లోను అది పునరావృతమవడం వల్లనే బీజేపీకి భారీ మెజారిటీ దక్కిందన్నది స్థానిక మీడియా విశ్లేషణ. ప్రస్తుతం యుపీ ఎన్నికల్లోను వారి మద్దతు అదే స్థాయిలో పొందాలని బీజేపీ వ్యూహరచన చేసినా కొన్ని వ్యతిరేకతలు ప్రభావం చూపొచ్చని తెలుస్తోంది.

ఉత్తర యూపీలో ఉండే 19 శాతం జాట్లు, 27 శాతం ముస్లింలు అక్కడ పార్టీల విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్ల తరువాత జాట్లు బీజేపీవైపు మొగ్గారు. గత మూడు ఎన్నికల్లోను వారు బీజేపీకే మద్దతు పలికారు. అయితే జాట్లలో ఇపుడు వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు సంవత్సరం పాటు తాము వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో బీజేపీ ప్రభుత్వం జాప్యం చేసిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. 2013కు ముందు నాటి జాట్‌-ముస్లిం సమీకరణలను పునరుద్ధరించడం ద్వారా లబ్ది పొందాలని ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ వ్యూహాలు రచిస్తున్నాయి. కొంత మేరకు వారి మద్దతు పొందగలిగే పరిస్థితి కూడా వుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జాట్‌-ముస్లిం బంధం ఇతర హిందూ కులాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. వారంతా బీజేపీ వైపు మొగ్గే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. పశ్చిమ యూపీలోని 60 సీట్లలో త్యాగి, గుజ్జర్‌, ఇతర హిందూ కులాల జనాభా 50 శాతం దాకా ఉంది. జాట్‌-ముస్లిములు ఆర్‌ఎల్‌డీ, ఎస్‌పీ వైపు మొగ్గుచూపుతుంటే- ఇతర కులాలు బీజేపీ, బీఎస్‌పీ వైపు ఆకర్షితులవుతున్నాయి. అయితే ఎస్పీని నిలువరించాలంటే బీఎస్పీవైపు కాకుండా బీజేపీ వైపు మొగ్గుచూపితేనే ఆశించిన ఫలితం వస్తుందని వారు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. యూపీలో అగ్ర కులాల జనాభా 15 శాతం దాకా ఉంటుంది. ఎస్‌పీ, బీఎస్‌పీల హయాంలో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదని భావిస్తున్న వారు బీజేపీ వెన్నంటే ఉంటున్నారు. శ్రీరామ చంద్రుని చిన్న కుమారుడు లవుని వారసులుగా భావించే కుర్మీలు తూర్పు యూపీ, దక్షిణ బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లోని 80 స్థానాల్లో 8 నుంచి 12శాతం దాకా ఉన్నారు. 2014 నుంచి ఎక్కువ శాతం కుర్మీలు బీజేపీ కూటమికే మద్దతుగా నిలుస్తున్నారు. పశ్చిమ, మధ్య యూపీలోని 60 స్థానాల్లో 12 నుంచి 20శాతం ఉండే లోధ్‌లు కమలం పార్టీ వెంటే నడుస్తున్నారు. బీజేపీని ఓబీసీ, దళిత వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రిస్తూ ఆ పార్టీ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడగట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఒకవేళ తన సంప్రదాయ దళిత ఓటర్లు, ఇతర ఓబీసీల మద్దతుతో బీఎస్‌పీ 20 శాతం ఓట్లు రాబట్టుకోగలిగితే- ఎస్‌పీకి నష్టం వాటిల్లడం ఖాయం. అది బీజేపీకే ప్రయోజనంగా మారుతుంది. బీజేపీ వ్యతిరేక ఓబీసీ, దళిత ఓటర్లందరూ బీఎస్‌పీకి బదులుగా ఎస్‌పీ వైపు మొగ్గితే బీజేపీ, ఎస్‌పీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు జరగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో